Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శారదలేఖలు

79

కాని కల్పలతా! ఆపడమటికనుమల భాగ్యమేమని చెప్పుదును? సమస్తపాదపములు, నఖిలలతావితానములు, సర్వగుల్మములు వానిసొత్తు. వికసించిన పుష్పగుచ్ఛములతో, విరియగ్రమ్మిన యాకుజొంపములతో, నాపర్వతములపై నున్న లతాద్రుమావళు లెంతరమణీయముగ నున్న వనుకొంటివి? కుంకుమపు రాసులుపోసినట్లొకచోటను, పసుపుకుప్పలుపోసినట్లొకచోటను, నీలాంబరము గప్పినట్లొకచోటను, వెల్లముసుంగువేసికొని నట్లొకచోటను, వివిధవర్ణపత్రపుష్ప విరాజితంబై యాకనుమయందలి ప్రతివృక్షమును ప్రతివల్లరియు సొంపు నింపుచుండెను. అచ్చటవీచెడు వాయువుగూడ మాలతీచంపకవకుళాదికుసుమ సౌరభములనేగాక మన కపరిచితములగు పుష్పపరిమళముల నెన్నిటినో గొనివచ్చి ఘ్రాణేంద్రియ పరితృప్తి గలిగింపుచు హాయిహాయి యనిపించుచుండెను. కొండలపైనుండి పడెడి సెలయేళ్ళు చఱియలలోబడి చిన్న చిన్నవాకలై దొనదొనమని ధ్వనిసేయుచు ప్రవహించుచుండెను. ఆప్రవాహముల కొడ్డుననే యున్న వెదురుచెట్లు నీటిలోనికివంగి ప్రవాహవేగమున కుయ్యాల లూగుచు బొయ్యిమని బోలుధ్వనిసేయుచుండెను. వివిధములగు జలపక్షు లానీటివాకలలో విహరించుచు కలకలమని మంజులధ్వని జేయుచుండెను. రమ్యమైన ఆకనుమమార్గమున మాపొగబండి పర్వతసొరంగములలో జొచ్చుచు నెత్తముల కెగబ్రాకుచు లోయలలోనికి దిగుచు సెలయేళ్ళదాటుచు బో అని బొబ్బలిడుచు పాముప్రాకినట్లు మెలికలు మెలికలు దిరుగుచు పోసాగెను. కల్పలతా! అంతవఱకు సుప్రసిద్ధమైన