74
శారదలేఖలు
అత్యద్భుతములుగదా! ఆకృతులలో భేదమున్నను, ఆచారములలో మార్పులున్నను, భాషలలో భిన్నత్వములున్నను, వేషములో వ్యత్యాసమున్నను, ఆసేతుశీతనగ పర్యంతముగల యావద్భారతీయుల నైక్యపఱచుచున్న దేది? మత సూత్రమే గదా!! మతము మానవునకు ప్రాణముకంటె నుత్కృష్టమైనది.
కల్పలతా! వ్రాయవలసిన విషయములు పెక్కులున్నను లేఖా విస్తరభీతి లేఖినిని వెనుకకీడ్చుచున్నది. ఇప్పటికే లేఖ పరిమితిని మించినది. కాన నింకొక్కమాటతో ముగించెదను. మిత్రమా! మేమీ విధముగా హిందూదేశపు సుప్రసిద్ధక్షేత్రములలో నొక్కటైన రామేశ్వర క్షేత్రమందు ద్వాదశదినములు గడపి పర్వతవర్ధనీ రామలింగేశ్వరుల పలుమాఱు సేవించి అనంతపద్మనాభస్వామిని దర్శింప కుతూహలము గలుగుటచే నచ్చటికేగుటకై రామేశ్వరమునుండి మధురకువచ్చి అక్కడ నుండి ట్రివేండ్రము వెళ్లుబండి నెక్కితిమి. ట్రివేండ్రము వెళ్లుచు మార్గ మధ్యమున మేముచూచిన మొదటిక్షేత్రము తెంకాశీకి సమీపముననున్న కుర్తాళం. ప్రకృతి శోభావిభాసితంబై నేత్రపర్వంబైన యారమణీయ ప్రదేశమును గూర్చి ముందు వ్రాసెదను.
భావపురి
మిత్రురాలు,
1929 ఏప్రియల్
శారద.