విజ్ఞానకోశము - ౨
ఆహారము - విహారము
తమ మెదడు త్రుప్పును వదలించుకొనవలెనని అతని భావన. ఐదేండ్ల కొకమారు వైద్యశాలలకు కాని, ప్రయోగశాలలకు కాని పోయి, వారు తమ మేధస్సులను పునీతము చేసికొనవలెనని ఇతడు వాదించెను. రోగపరీక్షా బోధనలలో ఈయనకు సాటి యెవరును లేరు. వైద్యశాస్త్ర పఠనావశ్యకత నుద్ఘాటించుట ఇతని అభిమానవిషయము. ఏకాలమున పూర్వ ప్రతిభాశాలురు నిర్లక్ష్యము చేయబడుదురో అది ప్రతిభారహితమగు కాలమునకు మచ్చుతునక యని ఆతని అభిప్రాయము. ఇతని దృష్టిలో వైద్యునకు కేవలము వైద్యపాండిత్యమేగాక సంస్కృతికూడ అవసరము. శాస్త్ర ప్రతిభా శాలియైన హార్వే, నైపుణ్యశాలియైన సిడెన్ హోం వంటి వ్యక్తులలో జీవితమునకు కీలకప్రాయములైన గుణములు లోపించవచ్చును. ఆశాభావము, అచంచల దృక్పథము ఆవశ్యకములని అతని అభిప్రాయము. 1892 లో అతడు "వైద్యశాస్త్ర సూచనలు, కృషి" యను పాఠ్య గ్రంథమును ప్రచురించెను. “చారిత్రక వ్యాసములు, పరిచయములు” (1904) "ఆల్బారూ విద్యార్థి" (1904) అనునవి ఇతని యితర గ్రంథములు.
యస్. నెం. రా.
ఆహారము - విహారము : అహ్రియత ఇత్యాహారః - సేవింపబడుచున్నది గాన ఆహారము అని చెప్పబడును. అనగా అన్నము అని ముఖ్యార్థము. పానములను, వాయుభక్షణమును గూడ ఈ పదముచే గ్రహించుట కవకాశముండును 'వాతాంబుపర్ణాశ నాః' అనిగూడ ప్రతీతి యున్నది. కనుక ఆహార శబ్దముచే అన్నము - పానము - వాయు సేవనము మొదలగునని విమర్శింపబడును.
అన్నమును గూర్చి ఉపనిషత్తులు చాలా యెక్కువగ కీర్తించినవి. బ్రహ్మపదార్థము గూడ నిదియగునా యను నంతవరకు విమర్శనము జరిగినది. 'అన్నం బ్రహ్మేతి వ్యజానాత్' ప్రాణులకు ప్రాణరక్షణ నిమిత్తము అన్నమే ముఖ్యమని 'అన్నగ్ంహి భూతానాం శ్రేష్ఠం' అను వాక్యము చెప్పుచున్నది. అన్నములో నుండియే జీవులు పుట్టుచున్నారని ‘అన్నాద్భూతాని జాయంతే జాతాన్యన్నేన వర్థ స్తే! అద్య తేఽత్తిచభూతాని - తస్మాదన్నం తదుచ్యత ఇతి' అను వాక్యముల వలనను 'పురుషోన్నర సమయః ' అను వాక్యమువలనను, 'ఓషధీ భ్యోన్నం - అన్నాత్పురుషః' అను వాక్యముల వలనను తెలియుచున్నది. వీటి నన్నిటిని పురస్కరించుకొనియే శ్రీచరకముని 'రసజం పురుషం విద్యాత్ రసం రక్షేత్ప్రయత్నతః' యని పురుషుడు ఆహార రసమువల్ల కలుగుచున్నాడనియును కనుక ఆహార రసమును జాగ్రత్తగాకాపాడవలయుననియు చెప్పియుండెను.
ఆహారమును సేవించు విధానముగూడ చాల పవిత్రమైన కార్యమని వేదములు చెప్పుచు, దీనిని ప్రాణాగ్ని హోత్రమని నుడివియున్నవి. అగ్నిహోత్రమును ఉదయ సాయంకాలములయందు మాత్రమే ఆహుతులిచ్చి ఉపానించినట్లు ఆహారమును రెండు పర్యాయములే సేవింప వలయును. ఆహారముననుగూడ నియమము 'సాయం ప్రాతర్మనుష్యాణాం, అశనం విధినిర్మితం అంతరానై వ బొక్తవ్యం, అగ్నిహోత్ర సమోవిధిః' అను వాక్యము చెప్పుచున్నది.
ఆహార విహారముల మీదనే ఆరోగ్యము ఆధారపడి యున్నందున ఆహారమును సేవించునపుడు దానికి కొన్ని నియమము లుపదేశింపబడినవి. యథాకాలముగ, యథా సాత్మ్యముగ, మాత్రాపూర్వకముగ, శుచిగ, సంతుష్టుడే, ఇష్టజనులతో గూడి, ఏకాంతస్థలమున, తనయందు భక్తి గలవారిచే తేబడిన, భగవన్ని వేదితమైన, యాహారమును, పరిమాణమును గుర్తెరిగి భుజించవలెను. ఇది ఆరోగ్యమునకు మూలమగును.
ఆహారమునకు కాలము : మలమూత్రములు విసర్జింపబడి హృదయము నిర్మలముగనుండి, వాత, పిత్త, శ్లేష్మములు తమ మార్గములయందు సంచరించుచు, ఉద్గారము (తేనుపు) దోషరహితముగనుండి, ఆకలి దెలియుచు, అపానవాయువు సమముగ వర్తించుచు, జఠరాగ్ని దీప్తి గలిగి, ఇంద్రియములు ప్రసన్నములై, దేహము చాల చులకనగ నుండునపుడు ఆహారమును సేవింపవలయును. ఇది విధినియమితమైన కాలము. (వాగ్భట సూ-అధ్యాయ 8)
ఆహారసాత్మ్యము : సాత్మ్యమనగా అభ్యాసము. ఇది రెండు విధములు. దేశసాత్మ్యము - ఓకసాత్మ్యము. దేశసాత్మ్యమనగా దేశము మొత్తముమీదనుండు అభ్యాసము. ఉదా : వరిధాన్యముల నుపయోగించు దేశము,