Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము -౨

ఆస్ట్రేలియా (భూగోళము)


ఒకప్పుడు ఉష్ణమండలపు తుఫాను వాయవ్యము నుంచి అడ్డముగా ఆగ్నేయమునకు కదిలి ఈఖండ మధ్యమండల ములలో అసాధారణ వర్షములు కలుగచేయును. సంవత్సరమునందు 50 నుండి 80 అంగుళముల పరిమితిగల గొప్ప వర్షపాతము రెండు ద్వీపకల్పముల ఉత్తరభాగము లందును, కేప్ యార్డు ద్వీపకల్పమునందును సంభవించును.

క్వీన్సులాండు సముద్రతీరమున 50 అంగుళములకు మించిన గాఢమయిన వర్షపాతముండును. ఇచ్చట కొన్ని ప్రదేశములలో వర్షము 80 " లను మించును. సవానా ప్రాంత భాగములందు వర్షపాతము 25" కు తగ్గును.

ఆస్ట్రేలియా మైదానములను చేరునప్పటికీ ఋతుపవనములు పొడిగానుండును. అందువలన ఆస్ట్రేలియా అంత ర్భాగములో వర్షము లేకుండును. ప్రబలమై వీచు పడమటిగాలులు శీతకాలమందలి తుఫానుగాలులు, ఖండ మందలి ఆగ్నేయ నైరృతి భాగములందు వర్షము కలుగజేయును. ఇచ్చట సంవత్సరమునకు వర్షపాతము సగటుగ 20" నుండి 40" వరకు ఉండును.

ఈ ఖండము చాలవరకు ఉష్ణప్రదేశమందున్నను, ఇచ్చటి శీతోష్ణస్థితి పొడిగను, ఆరోగ్యవంతముగను ఉండును. ఉత్తరమునను, వాయవ్య భాగమునందును, యూరోపియనులు నివసించరు. ఆస్ట్రేలియా దేశమంతయు ఉష్ణ, నిమ్నోష్టములగు శీతోష్ణస్థితులు కలిగియున్నది. ఇందు విశేషభాగము పొడి వాతావరణము కలదిగా నున్నది.

ఆస్ట్రేలియా ఆగ్నేయభాగమున ఎక్కువ ప్రాముఖ్యము గలది ముట్టేడార్లింగ్ -ముర్రంబ్రిడ్జి నదీమండలము. ఈ నది పొడగునను పొలములకు నీటిపారుదల కార్యక్రమము జరుగుచున్నది. ఆస్ట్రేలియాలో పెక్కునదులు సంవత్సరములో కొంతకాలము మాత్రమే ప్రవహించును. పశ్చిమ ఆస్ట్రేలియాలో ముఖ్యమైన నదులు, ఫిట్జురాయ్, ఓర్డు అనునవి. నైరృతి భాగమందలి ముఖ్యనది స్వాన్ అనునది. ఆస్ట్రేలియా దక్షిణభాగమునందు ముట్టే ముఖ్యమైన నది. క్వీన్సులాండునందు ఫిట్జురాయ్ (మరియొకటి) మిక్కిలి పొడవైనది. దీనిపొడవు 510 మైళ్ళు. ఈ రాష్ట్రమునందు స్వల్ప ప్రాముఖ్యముకల చిన్ననదులు పెక్కులు కలవు. ఒక్క ముట్టేనది తప్ప తక్కిన ఆస్ట్రేలియా నదులన్నియు వర్షపాతముమీదనే పూర్తిగా ఆధారపడి యుండును. వానలలో ఈ నదులు వరదలై పారును. కాని వానలు లేని కాలమున వీటిలో "పెక్కు నదులు జలాశయ పరంపరగా కనిపించును.

ఆస్ట్రేలియాయందలి బుగ్గబావులు గొజ్జెలకు, పశువులకు నీరు సరఫరా చేయును. ఈ బావులు ఆస్ట్రేలియా యందు ముఖ్యముగా పేర్కొనదగిన అమూల్యములయిన విశేషములు. కనీసము 950,000 మైళ్ళ విస్తృతికల ప్రదేశములో ఇవి ఆధారములుగ నున్నవి.

పశ్చిమ ఆస్ట్రేలియాలో ఉప్పు బురదతోకూడి పొడుగైన చీలికలవంటి 200 సరస్సులు కలవు. ఐర్ సరస్సు యొక్క నీటిపారుదల ప్రదేశము దాదాపు 500,000 చదరపు మైళ్ళ విస్తీర్ణము కలిగియున్నది. పెక్కునదులు ఈ సరస్సులోనికి ప్రవహించుచున్నవి. ప్రధానమైన సరస్సు 110 మైళ్ళ పొడవు, 40 మైళ్ళ వెడల్పుకలిగియున్నది. ఈ ప్రాంతమునందలి వర్షపాతము 4 అంగుళములు మాత్రమే.

వర్షపాతమే సహజమైన వృక్షజాలముయొక్క స్వరూపమును నిర్ణయించును. ఈ రెంటికిని సన్నిహిత సంబంధమున్నది. ఆస్ట్రేలియా అంతర్భాగమునందు ఎడారి ప్రదేశమున్నది. దాని చుట్టును ఎక్కువ వర్షపాతము కలిగి సారవంతమైన ప్రదేశమున్నది. ఈ విధముగా ఎడారి భాగమును దుబ్బు నేలలు ఆవరించియున్నవి. ఈ నేలలు క్రమముగా సవానాలలో కలిసిపోవును. ఈ సవాసాలు అడవి నేలలుగా రూపొందుచున్నవి. ఉత్తర, ఈశాన్య సముద్రతీర భాగముల పొడుగునను, ఉష్ణములు, ఆర్ద్రము లయిన వన ఖండములు కనిపించును. నైరృతి ఆగ్నేయ భాగములలో వర్షముచే పెంపొందు సమశీతోష్ణ మైన అడవులు కలవు. ఇందు యూకలిప్టసు చెట్లుకల పుష్కలమైన పచ్చగడ్డి బీడులు కనిపించును. ఈ ప్రాంతములు అస్ట్రేలియాలో ఎక్కువ విలువగల కలపను ఉత్పత్తి చేయును.

ఆస్ట్రేలియాలో 350 రకముల యూకలిప్టసు చెట్లు గలవు. వీటిని జిగురుచెట్లు అని కూడ అందురు. ఇచ్చట కలపకు పనికివచ్చు ఇతర వృక్షములలో పేర్కొనదగినవి కారి, జూరా, సఫర్ గం, కర్పూరపుచెట్టు, ఐరన్ గం, ఈశాన్య భాగమందలి ఎఱ్ఱ దేవదారువు అనునవి. ఎడారి ప్రదేశములందు తుమ్మచెట్లు కనిపించును.