విజ్ఞానకోశము - ౨
కావ్యాత్మ
ములును (వేదాంతశాస్త్రము- ఉత్తర మీమాంస) బయలుదేరినట్లే కావ్యతత్త్వ పరిశీలనకు కావ్య మీమాంసా
గ్రంథములును రచింపబడినవి. ఈ జాతి గ్రంథజాలమునకు సాహిత్యశాస్త్రము, అలంకారశాస్త్రము అని ప్రసిద్ధి. కావ్యమును మానవునితో పోల్చి యాతని కున్నట్లే కావ్యమునకును శరీరము - ఆత్మ (జీవము) - గుణములు - వృత్తులు (వర్తనములు)- అలంకారములు (భూషణములు) పాకములు మొదలైనవి యుండునని, యట్టిదే పుష్టమైన కావ్యమని లాక్షణికులు హృద్యముగా సమర్థించినారు.మానవోదాహరణము తోనే కావ్యములోను ప్రధానమైన దానిని అత్మగాను, అప్రధానమైన దానిని శరీరముగాను, తక్కినవానిని శోభా హేతువులుగాను నిర్వచించినారు. కాని ఆ శరీర మెట్టిది? ఆ యాత్మ యెట్టిది? అను ప్రశ్న వచ్చినపుడు వారు భిన్నాభిప్రాయములను ప్రకటించినారు. ఈ కావ్యతత్త్వ చర్చ క్రీస్తుపూర్వ ముండిన భరత మహర్షి మొదలు క్రీ. శ. పదునేడవ శతాబ్దములో నుండిన జగన్నాథ పండితరాయల వరకును దాదాపు రెండువేల సంవత్సరముల కాలము అవిచ్ఛిన్నముగా పొగుచునే వచ్చినది. ఒకవైపు ప్రతిభలోని కారయితృ మూర్తి కాళిదాసాది మహాకవులచే సుందర కావ్యములను నిర్మింప జేయుచుండగా, మరి యొకవైపు భావయితృ మూర్తి పండితాఖండలులచే కావ్యానుశాసక గ్రంథములను సృష్టింపజేయుచు వచ్చినట్లు తెల్లమగును. ఈ కావ్య సంబంధి శరీరాత్మలను గురించి చర్చించిన విద్వాంసులలో ముఖ్యులగు కొందరి యభిప్రాయ సారాంశము లిట్లుండును.
భరతమహర్షి : (ఇతివృత్తము శరీరము - రసము ఆత్మ) నాట్యశాస్త్రకర్త యగు ఈతని కాలము అనిర్దిష్టముగానే యున్నది. క్రీ. పూ. 300 కు ఈవలివాడుమాత్రము కాదను చున్నారు. ప్రధానముగ రూపకములను గూర్చియే చర్చించేను. ఇతివృత్తమే రూపకములకు శరీరమని చెప్పేను. ఆయన కంఠోక్తిగా చెప్పకపోయినను శ్రవ్యకావ్యములకు కూడ ఆ ఇతివృత్త మే శరీరమనునది యని ఆ మహర్షి యథి ప్రాయమై యుండునని విమర్శకు లూహించుచున్నారు.
రూపకాదులుగు కావ్యములకు జీవిత మిచ్చునది రనమే యని యాతడు చెప్పెను. రసమే కావ్యములో ముఖ్యమైనది. రసహీనమైన కాన్యము తక్కిన పద లాలిత్యము, అలంకారశోభ మున్నైనవి యెన్ని యున్నను శోభింపదు. (జీవము లేని) వట్టికట్టెకు పీతాంబరము కట్టిననేమి, నగలు పెట్టిన నేమి? కావున రసమే కావ్యాత్మ.
అలంకారశాస్త్ర విస్తృతికి మూలమైన 'విభావాను భావ వ్యభిచారి సంయోగాదస నిష్పత్తిః' అను రస సూత్రమీ భరతమునిదే. కావ్యమున అత్యంత ప్రాముఖ్యము వహించు ఈ రస స్వరూపమిది: సరసకావ్య నిబద్ధములో, నిపుణ నట ప్రదర్శితములో, పఠితలచేతను, సామాజికులచేతను భావింపబడు విభావాదుల సంయోగమున పరిపుష్టమై ఆస్వాదింపబడు స్థాయిభావమే రస మనబడును. దీని నింకను ఇట్లు వివరింపవచ్చును. కావ్యము వలనగాని, నాటక మూలమునగాని నివేదింపబడు రామాదులకు గలిగిన సుఖదుఃఖాదుల భావనమువలన (అనుభవము వలన) పఠితలకు, సామాజికులకు మనస్సులో ఒకానొక వికారము కల్గును. అదియే భావము, సంస్కారమనియు నందురు. సన్నిహితము, వ్యవహితము అని యీ భావము రెండు విధములు. వీనిలో సన్నిహితభావమునకును, రసమునకును నూలునకు వస్త్రమునకువలె ఆకారమున మాత్రమే భేదము. ఈ సన్నిహిత భావమే కావ్యభాషలో స్థాయిభావమని వ్యవహరింపబడును. నూలే యెట్లుమగ్గము, పలక మొదలైనవాని తోడ్పాటుతోనే నేయబడి వస్త్ర వ్యవహారమును పొందునో అట్లే ఈ స్థాయిభావమే విభావాధుల చేరిక వలన పరిపుష్టమై రస వ్యవహారము ను పొందును. ఇక వ్యవహిత భావమో, స్థాయిద్వారమున రస నిష్పత్తిలో నిమి త్తమగుచు విభావాది వ్యవహారము నొందును. కాగా సామాజికుని మనోవికార రూపమైన రస సన్నిహిత పూర్వావస్థయే స్థాయీ భావమనియు, అయ్యది విభాజాదులచే సముల్లాసితమై రసమగుననియు తేలును.
భరతముని చెప్పిన రస సూత్రములోని 'సంయోగ నిష్పత్తి* శబ్దములను పలువురు పలువిధములుగా అర్థము చేసికొన్నందున భిన్న వాదములు పుట్టినవి. భట్టలోల్లటుడు రసోత్పత్తి వాది. శ్రీ శంకుకుడు రసానుమితవాది, భట్ట నాయకుడు రసభుక్తి వాది. అభినవగుప్తుడు రసాభివ్యక్తివాది. సంగ్రహముగా వీరి యభిప్రాయములివి: