Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/716

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము -౨

కార్లీ గుహాలయములు


ములు గలవు. గజముల చుట్టును చిత్రాలంకార భూయిష్టమైన గ్రాదులు (కంచెలు) రెండు గోడల చివరలయందు కలవు. మొదటి గుహను తొలిచినప్పుడు ఎట్టి విగ్రహములును లేకుండెను. తరువాత బుద్ధుని యొక్కయు అతని పరివారము యొక్కయు విగ్రహములు గ్రాచుల యంతమున చేర్చబడినవి. దీనిపై చిన్న వర్తులాకారమున దట్టమైన భిత్తిశీర్షము (moulding) కలదు. దీనికి ప్రతిగా, రెండవ గ్రాదియందు గొప్ప పోతాయనపు గడప (sill) కలదు. ఇట్టి ప్రదేశమువయి అల్పాకారపు ఆలయ ముఖభాగములు కలవు. ఈ గుడికి చైత్యవాతాయనము శిఖరాలంకారముగా నున్నది. ఆలయ ముఖ భాగముల మధ్య విగ్రహముల జంటలు గలవు. వీటిలో కొన్ని హిందూస్థాన మందలి అత్యుత్తమ శిల్పచిత్రములను తలదన్ను చున్నవి. దీని పైన చైత్యతోరణమును, గ్రాదివిధానమును పైకప్పు వరకు పౌనఃపున్యముగ చెక్కబడినవి. తరువాతి కాలములో గుహ యొక్క ముందటి కుడ్యమునందుగల అడుగు భాగపు గ్రాదియు, ద్వారముల పై భాగమును తీసివేసి బుద్ధుని యొక్కయు, అతని పరివారము యొక్కయు, పద్మపాణి మొదలగువారి యొక్కయు విగ్రహములను చేర్చి చెక్కడపు పని గావించుట కవకాశము కల్పించినారు. ద్వారబంధముల కిరువైపుల నుండు మహాకాయులగు ద్వారపాలకుల జంటమాత్రమే ఇందు దృగ్గోచర మగుచుండును. నడిమి ద్వారములకును, కుడివైపు ద్వారము లకును మధ్యనున్న ప్రదేశమున ఒక శిల్పచిత్రము కూర్చబడినది. ఇచ్చట పద్మపాణి, మంజుశ్రీ (కాబోలు) పరివేష్టించుచుండగా బుద్ధభగవానుడు సింహాసనముపై సధిష్ఠించియుండును. బుద్ధదేవుని పాదములు ధర్మచక్రము మీది కమలముపైన ఆనియుండును. సింహాసనమును రెండు హరిణములు మోయు చుండును. ధర్మచక్రము క్రింద దానిని నిలుపు వారధి స్తంభము (pier) కలదు. ఆ వారధి స్తంభము యొక్క భారమును నాగవిగ్రహములు వహించియున్నవి. బుద్ధుని శిరమునకు పైభాగమున ఇద్దరు విద్యాధరులు కిరీటమును పట్టుకొని యుండినట్లు కనిపించుచున్నారు.

ఈ చైత్యమునకు మూడు ప్రవేశ ద్వారములుకలవు, ఒక ద్వారము మధ్యభాగమునకు గొంపోవును. ఒకటి రెండు వైపుల నుండు ప్రక్క భాగములకు (aisles) గొంపోవును. తాళ్వారము పైన చైత్యశాలా ప్రాంగణ మంతయు తెరచియుండును. ఈ విధముగా అది గాలికిని, వెలుతురునకును ప్రవేశము కలిగించును. ఈ మహాచైత్య మంతయు గర్భ భాగపు విశాలాంగణము, ప్రక్క భాగములు కలిగియుండి గోపుర భాగముతో అంతమొందును. ఈ గోపుర భాగము చుట్టుననే బాపడి ప్రక్క భాగములు (aisles) ఉన్నవి. ప్రవేశ ద్వారమునుండి వెనుక భాగపు గోడవరకును 124 అడుగుల పొడవు గలదు. దీని మొత్తము వెడల్పు 45 అడుగులు, ప్రక్క భాగపు పడసాలల (వరాండా) అంతరములు అల్పవిస్తీర్ణము కలవి. మధ్యభాగము 25½ అడుగు లుండగా మిగతవి స్తంభముల సాంద్రతను గలుపుకొని 10 అడుగు లుండును. ఎత్తు 46 అడుగులు. మధ్య భాగమును, పడసాలలను విడదీయుచు ఒక్కొక్కవైపు 15 స్తంభము లున్నవి. ఈ స్తంభములమీద బౌద్ధ మతాంతరార్థములను దెలుపు చిహ్నములు గలవు. ఇవి విరాజమాన శృంగాలంకార ములకు ప్రబలోదాహరణములు. స్తంభములు అధోభాగములు పూర్ణకుంభ లక్ష్మీ విలసితములు. స్తంభపు నిడువు (shaft) అష్టకోణాకృతి గలిగి "బౌద్ధసంఘము"ను సూచించును. స్తంభాగ్రము (capital) పవిత్ర కమలబీజ చిహ్నము. దక్షిణదిశా సంరక్షకములగు రెండు గజములు రెండు విగ్రహముల భారమును వహించి యుండును. ఈ రెండు విగ్రహములలో ఒకటి పురుషుడుగను, రెండవది స్త్రీ గను ఉన్నవి. కొన్ని సమయములందు ఇద్దరు స్త్రీలుందురు. వీటి పనితనము సామాన్యాలం కారములను మించి యున్నది. కుడివైపున నుండు ఎనిమిదవ స్తంభమునకు 16 పలకలు గలవు. దీనికి మధ్యమందలి యుత్తర ముఖభాగమున ఒక చిన్న దాగోబా, స్తంభాకార రేఖా సముదాయమును కలవు. ఎడమవైపున నున్న అయిదవ స్తంభముమీద ఒక గూడు గలదు. ఈ గూటి యందు “సౌపార" (sopara) అను భిక్షు మహాత్ముని ధాతు సంతతిని నిక్షేపించి యుండిరి. దాగోబా వెనుక భాగమున నుండు ఏడు స్తంభములు నిరలంకారములయి ఎనిమిది పలకలతో నొప్పుచుండును. స్తంభాగ్రముల మీది శిల్పవిన్యాసము పైన నున్న కప్పుభాగము అర్ధ వలయాకారమున (semi-diameter) నుండును. కప్పుభాగము