Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము – ౨

ఆసియా కళ


భారతదేశము ప్రత్యేకముగా ఒక అధ్యాయములో వివరింపబడుటచేత, ఆసియాలోని ఇతర ముఖ్య దేశములగు అరేబియా, పర్ష్యా, చైనా దేశముల యొక్క కళ యొక్క ప్రధానలక్షణములు మాత్రము ఇచ్చట పరిశీలింపబడును.

ఈ నాలుగును నాలుగు విభిన్న సంస్కృతుల రీతులను ప్రదర్శించుచున్నవి. పురాతనమును, ఆధునికమును, అగు చరిత్రలను కలిగియుండుట ఈ దేశములకు సర్వసామాన్య లక్షణము.

ఆసియాకును, తూర్పున కంతకును, సామాన్యమైన ఒక లక్షణ మేమనగా సంప్రదాయము నెడ పూర్వాచార పరాయణత్వముతో కూడిన ప్రేమ; ఇది ప్రతిదేశము యొక్క కళను, కవిత్వమును; వస్తువునందును, రచన యందును, నిర్ణీతము లగు హద్దులలో నుండునట్లు పరిమితము గావించును. గొప్ప సమర్థులును, రచయితలును, తమ శైలి యొక్క ముద్ర జాతుల పై వెల్లడియగునట్లు తమ ప్రభావమును ప్రదర్శించి యుండిరి. కానీ వారు కూడ తమ కాలము యొక్కయు, దేశము యొక్కయు సంప్రదాయమును చాల జాగరూకతతో అనుసరించుచు వచ్చిరి. కేవలము సహజమును, ధారాళమును, కానప్పుడు కళ గతానుగతికమగు సంప్రదాయము ననుసరించునట్టిదగును. గతానుగతిక మగు సంప్రదాయ మనగా సర్వసామాన్యమగు ఒప్పుదల లేక ప్రజా వ్యాప్తమగు అంగీకారము అను దానిమీద ఆధారపడిన ఒక ఆచారము. సంప్రదాయ మని మనము పిలుచుచున్నది, ఒకానొకప్పుడు స్వతంత్రమును సహజమునై ఉండవలేను. గతానుగతిక మగు ఆచార మనగా సహజత్వమును కోలుపోయిన సంప్రదాయమును అనుసరించుట. శాస్త్రము (science) నకు సంబంధించని నూతన కల్పనలు చాలవరకును, సంప్రదాయము నుండి భిన్న మార్గమును త్రొక్కుటను సూచించును. కళలో శైలి - వాఙ్మయములోవలెనే సమకాలిక లోక సంప్రదాయము యొక్క హద్దులకు లోబడి, కళాశాలి రచించిన వ్యక్తిగత రచనా విశేషము. కనుకనే "శైలి అనగా మనుష్యుడు" అను లోకోక్తి ఏర్పడినది.

కళా విషయమైన పూర్వాచార పరాయణత్వమునకు ఈజిప్టు మిక్కిలి పరిచితమైన ఉదాహరణము. అట్టి పూర్వాచార భావములకు మరేజాతియు ఇంత ఎక్కువగా లోబడియుండలేదు. అన్ని కాలములందును మిక్కిలి గొప్పవారగు కళాభిజ్ఞులలో స్థానము వహించుటకు ఈజిప్టు దేశీయులు నిది ఆటంకపరుపలేదు. స్మారక చిహ్నముల నెలకొల్పు శీలమును, శైలిలో ఏకత్వమును అనునవి వారి విశిష్ట లక్షణములు. సుదీర్ఘమైన చరిత్రలో స్వల్పకాలము తప్ప, ఈ దేశపు కళాశీలులు వివిధత్వముకొరకు యత్నింపలేదు. ఆ కాలము - క్రీ.పూ. 14వ శతాబ్దములోని వీరి రచనలు వీరికి మిక్కిలి వాస్తవమైన రచనను గావింపగల శక్తి గలదని రుజువు చేయుచున్నవి. ఒక్కటే ఉదాహరణము చాలును. అమర్ణా చిత్రశాలలో కనుగొనబడిన అనేకములగు సుందరములును, సజీవములును అగు చిత్రములలో నెఫర్టిటీ యొక్క శిరస్సు ఒకటి.

ఈ పూర్వాచార పరాయణ శీలము ఆసియాలో ఎంత బలీయమై ఉన్నదనగా, ఒక జాతి మరొక జాతి నుండి ఒక శైలిని అనుకరించినప్పుడు గూడ స్వీయముద్రను అనుకరణములపై గురించి, వాటికొక క్రొత్త లక్షణము ఇచ్చి యున్నది. ఉదా : చైనా దేశీయులు గ్రీకు దైవములను తమ బౌద్ధ విగ్రహములకు మాదిరులుగా తీసికొన్నప్పుడిట్లు జరిగినదని, చైనాటర్క్ స్థానమున క్రొత్తగా కనిపెట్టబడిన శిల్పములు స్పష్టముగా రుజువు చేయుచున్నవి.

శిల్పములు, భవనములు, ప్రపంచమంతటను అనేక విషయములలో పోలికలను కలిగియున్నవి. శిల్పి యొక్క నమూనాలలో ఉన్న ఏకత్వముచేతను, దేవాలయములు, ఇండ్లు కట్టుటలో గల ప్రత్యక్షమగు ఉద్దేశముచేతను, ఇట్టి పోలిక ఉండుట మిక్కిలి సహజము. అయినను, మానవ రూపమును ప్రదర్శించుటలో నమూనాల నుండియే హిందువులు చిత్రించియుండిరి; కాని వారి దైవములు మానవులకన్న అధికు లని వెల్లడిచేయుటకు వారికి అనేక శిరస్సులు, చేతులు, కందురిగవంటి నడుములు, మరికొన్ని అసాధారణ విషయములు కల్పించియుండిరి. ఇది ఐరోపా వాసులకు గాని, అమెరికా వారికి గాని వింతగా తోచును. ఇది యిట్లుండ చైనా దేశీయులు మాత్రము మానవ రూపమును చిత్రించుటలో ఎన్నడును సహజత్వమును తప్పలేదు; జంతువులను చిత్రించుటలో మాత్రము వీరు