Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/680

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - ౨

కాగితపు పరిశ్రమ


ప్రమాణములలో కలుపుటవలన దానినుండి మంచి తెలుపు గల కాగితమును తయారు చేయవచ్చును. నిజమునకు అది తృప్తికరముగా సమమైన బూడిద వర్ణమే (Grey). నేటి వార్తాపత్రికల కాగిరములో తెలుపు యొక్క భ్రమను జయప్రదముగా కల్పింపగలుగుట గొప్ప పారిశ్రామిక విజయసాధనము.

యంత్రముతో చేయబడు కాగితము: ఫ్రాన్సులోని 'ఎస్సోన్' కాగితపుమిల్లుల యజమానులగు మెస్సర్స్ డీడో కంపెనీ కొలువులో ఒక గుమాస్తాగా పనిచేయు లూయీ రాబర్టు అనునాతడు కాగితపు యంత్రమును కనిపెట్టెను (1798). ఈ కనిపెట్టుట ఈ పరిశ్రమకు గొప్ప ప్రోద్బలము నిచ్చెను. కాగితమును చౌక పరచుట, గుండ్రని చుట్టలుగా లభింపజేయుట, దీనివలన ప్రాప్తించిన ఫలితములు.

ఈ నూతన కల్పన ఇంగ్లండులో హెన్రీ ఫౌర్డి నియర్ చే ప్రవేశ పెట్టబడెను. నే డతని పేరుమీదుగానే ఈ యంత్రము పిలువబడుచున్నది. అత్యుత్తమ తరగతికి చెందిన ప్రత్యేకపు కాగితముల విషయములో తప్ప, తక్కిన అన్ని సందర్భము లందును యంత్రముతో చేయబడు కాగితము చేతికాగితమును ఈనాడు పూర్తిగా రంగమునుండి తొలిగించియున్నది.

కాగితమును తయారుచేయు యంత్రము : కాగితపు యంత్రము యొక్క మొదటి భాగములో గుజ్జుయొక్క జారుడుముద్ద తడి అల్లికగా చేయబడును. దీనిని 'తడికొస’ (wet end) అని పిలుచు చున్నారు. ఎండించుట, తుది మెరుగులు పెట్టుటయును జరుగు ఆవలి చివర దీనికి వ్యతిరేకముగా 'పొడికొస' (dry end) అని పిలువబడు చున్నది. లోహతంతువు ఒక పొడుగైన అంతులేని ఇత్తడి తీగల వల యల్లికతో నిర్మింపబడిన వస్త్రమై యున్నది. ఇది సుమారు 40 నుండి 50 అడుగుల పొడవును, 70 నుండి 90 అంగుళముల వెడల్పును సామాన్యముగా కలిగియుండును. ఒక్కొక్కప్పుడు ఇది 240 అం. వెడల్పు వరకునుగూడనుండి, అంగుళమునకు 60 నుండి 70 వరకు లోహపు తీగెలను కలిగియుండును.

గుజ్జుయొక్క జారుడు ముద్దలో గుజ్జు 2.3% బలము కలదిగా నుండునట్లు తయారు చేయబడును. అప్పు డది పదార్థపు పెట్టెనుండి ఎక్కువ యెత్తులో నున్న ఒక చిన్న పెట్టెలోనికి గొట్టముద్వారా పైకి తోడబడును. కలగలిపిన లేక తెల్లని నీటిలో (white water) అది. 75%-1% బల మేర్పడునట్లు పలుచన చేయబడును. అక్కడినుండి అది ఒక ఇసుకబోను (sand trap) లోనికి ప్రవహించును. ఈ యిసుకబోను మెలికలు తిరిగెడి కాలువగా నుండి, బరువైన సూక్ష్మపదార్థ భాగములేవైన యున్నచో వానిని దిగబడునట్లు చేయును. అక్కడినుండి ఆ ప్రవాహము ఏవైన కొద్ది పెద్దవియగు సూక్ష్మపదార్థ భాగము లున్నచో వానిని ఆపుచేయుటకొరకై ఒక జల్లెడ గుండా ప్రవహింపజేయబడును. జల్లెడనుండి గుజ్జు 'బ్రెస్టు బాక్సు'(Breast Box) అను పెట్టెలోనికి పోవును. ఈ పెట్టె యొక్క వెడల్పు యంత్రము లోని లోహతంతువు యొక్క వెడల్పుతో సమానముగా నుండును. అప్పుడా ద్రవము అంతులేని లోహరంతువునొద్దకు ముందుకు ప్రవహించును. ఈ లోహతంతువు ముందునకు కదలుచుండగా దాని మీదకు ఒక చిన్న వెడల్పయిన పరికరము (spreader or Slice) గుజ్జును హెచ్చుతగ్గులు లేక సమానముగా నుండునట్లు పరచును. ఇట్లు ఒక ఎడ తెగని తడిపొరలేక 'వస్త్రమువంటి నిర్మాణము' (web) లోహతంతువుతొ సమానమైన వెడల్పుగలిగినదై క్రమముగా నేర్పడును. నీరు లోహతంతువుగుండా కారిపోవు వ్యవధిలో లోహతంతువు యొక్క రెండు చివరలనుండియు కాగితపు గుజ్జును కారిపోనీయకుండ జేయుటకై రెండు వైపులను 'డేకెల్' (deckle) పెట్టి అమర్పబడి యుండును. ఇది 'వల్కనైజ్డ్ రబ్బరు' (vuicanised rubber) తో చేయబడి యుండును. మరియు దాని కనుబంధమైన ఉపరితలము తో దగ్గరి సంబంధము కలిగి ఇది లోహతంతువు యొక్క వేగముతోనే కదలుచుండును. అక్కడినుండి ఈ కాగితపు వస్త్రము పొడి కొసయొద్దకు పోవును. ఆ యంత్రభాగము నీటిని తొలగించి కాగితపు టల్లికను దృఢపరచెడి గుండ్రముగా తిరుగు ముద్రాయంత్ర (press rolls) పరంపరను కలిగి యుండును. అక్కడి నుండి ఆవిరిచే వేడిచేయబడిన స్తూపముల వద్దకు పోయి అది ఎండి, కాగితము తయారగును. అక్కడినుండి మరికొన్ని రోలర్ల మీదుగాపోయి, అది మెరుగు పెట్టబడును. ఆవిరిచే వేడిచేయబడి, ఎండించుటకు వినియోగపడు