కాంతి విశ్లేషణశాస్త్రము
సంగ్రహ ఆంధ్ర
క్షణమునకు 1,86,000ల మైళ్ళ వేగముతో ప్రయాణము చేయుచుండుటవలన గణనీయమైన ఫలితమును కలుగజేయవలెనన్నచో నక్షత్రము అతి వేగముతో తప్పక ప్రయాణము చేయవలసి యుండును.
విచ్ఛిన్న కిరణదర్శని, లోహచుంబకత్వమునకును, కాంతికిని నడుమ గల సంబంధమును గూర్చి గూడ అద్భుత విషయములను వెల్లడిచేసినది. శక్తిమంతమయిన విద్యుదయాస్కాంత చుంబక క్షేత్రముగుండా కాంతి చొచ్చుకొని పోవునపుడు, దీని ఫలితముగా ఏర్పడు వర్ణమాల యందలి కాంతి రేఖలు రెండు లేక మూడు ఉపరేఖలుగా విచ్ఛిన్నమగునని హాలెండు దేశపు భౌతిక శాస్త్రవేత్తయైన పీటర్ జీమన్ 1896 సంవత్సరములో కనుగొనెను. కాంతిపై లోహచుంబకత్వమునకు గల ప్రభావము పీటర్ జీమన్ చే కనుగొనబడుటచే, దీనికి "జీమన్ ఎఫెక్టు" అని పేరు గలిగినది. సూర్యబింబములో గల లోహచుంబ కత్వమును కనుగొనుటకును, దాని పరిమాణమును కొలుచుటకును జీమన్ కనిపెట్టిన సిద్ధాంతము అత్యంత ప్రయోజనకారి అయ్యెను.
విచ్ఛిన్న కిరణములు (spectra); భౌతిక పదార్థమ యొక్క స్వభావము: వివిధములయిన వర్ణమాలలలోని కాంతి రేఖల యొక్క పరిశీలనము, భౌతిక పదార్థమునుగూర్చి ఆధునిక సిద్ధాంతమును నిర్మించుటకు మిక్కిలి సహాయకారియైనది. బున్ సెన్, కిర్ చాఫ్ లు రాసాయనిక విశ్లేషణ సాధనముగా వర్ణమాలా రేఖల యొక్క ప్రయోజనము (use)ను అభివృద్ధి చేయగానే, ఉష్ణము యొక్క ఉత్తేజకత్వముచే వేర్వేరు ప్రమాణములలో కంపనము చేయు అణువులవలన వివిధములయిన కాంతి రేఖలు బహిర్గతములు చేయబడెనని శాస్త్రజ్ఞులు అభిప్రాయపడిరి. అణువుల కంపనము శీఘ్రతరమగుకొలదియు, తరంగముల దైర్ఘ్యము హ్రస్వతరమగుచుండునని గూడ వారు తలచిరి. స్వీడిష్, శాస్త్రవేత్తయయిన బాల్మర్స్, 1885 సం.లో మండుచున్న ఉదజని ద్రవ్యరాశిలోని వేరువేరు కంపన ప్రమాణములు ఒక దానితో నొకటి సామాన్యమగు గణిత శాస్త్రీయ సంబంధములు (simple mathematical relations) కలిగి యుండునని కనుగొనెను. వేర్వేరు తరంగ దైర్ఘ్యములను బహిర్గతముచేయు ఉదజని అణువులలో వేర్వేరు ప్రమాణములలో ఒక విధమయిన యాంత్రిక విశేషము (Type of mechanism) పనిచేయునని ఈ స్వీడిష్ శాస్త్రజ్ఞుడు సూచించెను. కాని ఈ యాంత్రిక విశేషము యొక్క స్వరూప స్వభావములను ఇతడు ఊహింపజాల డయ్యెను. జె. ఆర్. రిడ్ బగ్గు (1854-1919) అనునాతడు ఈ విషయమును గూర్చిన పరిజ్ఞానమును విస్తృతపరచి తన పేర ఒక నూతన సూత్రమును (formula) ఆవిష్కరించెను. ఆ సూత్రము అనేకములగు లక్షితములైన సంబంధములను వివరించెను. కాని అణువులో కంపనము కలిగించెడిదేది అను విషయమును కనుగొనుటలో బాల్మర్ కంటె ఇతడు ఒక్క అడుగైనను ముందునకు వేయలేక పోయెను. కోపెన్ హేజెన్ డెన్మార్క్ కు రాజధాని నగరము వాస్తవ్యుడయిన 'నీల్స్ బొహర్ ' (Neels Bohr) అను శాస్త్రవేత్త 1913 సం. లో ఈ ప్రశ్నకు సమాధాన మొసగెను.
రుధర్ ఫర్డు అను మరియొకశాస్త్రజ్ఞుడు 'సూర్యుని' చుట్టును, లేక కేంద్ర ఆధ్య జీవకణముచుట్టును గ్రహము పరిభ్రమించునట్లు ఉదజని అణువులో ఋణవిద్యుత్కణము పరిభ్రమించుచుండునని ప్రతిపాదించెను. అణువు శక్తిని (energy) పీల్చుకొను కొలది ఋణవిద్యుత్కణము యొక్క అక్షపండలము (orbit) నిర్ణీతమైన ప్రమాణములలో విస్తృతి చెందుననియు, ఒక్కొక్క సారి చెందిన విస్తృతి, ఒక శక్తి రాశి యొక్క శోషణమును (absorption of one quantum of energy) తెలియ జేయుననియు 'బొహర్' విశ్వసించెను. కాంతిరూపమున శక్తి బహిర్గతమైనప్పుడు, విద్యుత్కణము క్రమముగా అంతర అక్షిమండలములలో పడును. కాంతి యొక్క తరచుదనము (Frequency), అతిక్రమింపబడు అక్షిముండలముల సంఖ్య మీద ఆధారపడి యుండును. విద్యుత్కణము ఒక అక్షి మండలము చొప్పున లోపల పడినపుడు, దీనివలన కలిగిన శక్తి విక్షేపము (energy splash) కొంత తరచుదనము గల కాంతిగా బహిర్గతము చేయబడును. విద్యుత్కణము రెండు అక్షిమండలముల చొప్పున లోపలగా పడినపుడు గాని, లేక మరియొక అణువులోని విద్యుత్కణము ఈ చర్యను జరిపినపుడుగానీ, భిన్నమయిన తరుచుదనముగల కాంతి బహిర్గతమగును. విచ్ఛిన్న కిరణదర్శనిలో ఉదజని