విజ్ఞానకోశము - ౨
కాంతి - జ్యామితీకాంతిశాస్త్రము
2. పతన, పరావర్తనకిరణములు లంబమున కిరువైపుల ఉండును.
3. పతనకోణము (అనగా పతనకిరణము లంబముతో చేయుకోణము) పరావర్తనకోణము (అనగా పరావర్తన కిరణము లంబముతో చేయుకోణము) లు సమానము.
వక్రీభవన సూత్రములు ఈ క్రింద పేర్కొనబడినవి :
1. పతనకిరణము, వక్రీభవనకిరణము, పతనబిందువు వద్ద ఉపరితలమునకు గీయబడిన లంబము ఒకే సమతలములో నుండును.,
2. పతన, వక్రీభవనకిరణములు లంబమున కిరువైపుల ఉండును.
3. పతనకోణము యొక్క జ్యా (Sine) కును, వక్రీభవనకోణము యొక్క జ్యా (Sine) కును గల నిష్పత్తి స్థిరముగా నుండును. ఈ నిష్పత్తిని వక్రీభవన గుణకము (refractive index) అని అందురు. వక్రీభవన గుణకము రెండుయానకముల స్వభావముమీదనే ఆధారపడి యుండును.
కటకములు: వస్తువులను చూచుటకు ఉపయోగించు దృగ్యంత్రములను సాధారణముగా ఒకటిగాని అంతకంటె ఎక్కువగాని కటకములచే నిర్మించుదురు. అందుచే వివిధ రకముల కటకములను గురించి యు, అవి పనిచేయు విధానమును గూర్చియు మనము తెలిసికొనవలసి యున్నది. రెండు వక్ర ఉపరితలముల మధ్యనుండు పారదర్శక యానకములోని (Transparent medium) భాగమును కటకము (lens) అని పిలుచుదురు. రెండు వక్ర ఉపరితలములలో ఒకటి సమతలముగా నుండి రెండవది వక్రముగా నుండవచ్చును. లేదా, రెండును వక్రముగా నుండవచ్చును. సామాన్యముగా ఈ వక్ర ఉపరితలములు గోళాకారము (Spherical) లో నుండును. ప్రత్యేక సమయములలో స్థూపాకారము (Cylindrical) లో నున్న కటకములుగూడ ఉపయోగించబడును. రెండు ఉపరితలములకును లంబముగా గీయబడిన సరళరేఖను కటకము యొక్క అక్షము (axis of the legs) అని అందురు. ఈ అక్షముగుండా పోవు కాంతికిరణము (axial ray) కటకములో నుండి పోయిన తరువాతకూడ వక్రీభవనము చెందకుండ అక్షము వెంబడి పోవును. అంచువద్ద పలుచగా నుండి మధ్య అక్షము సమీపములో దళసరిగానున్న కటకమును కుంభాకారకటకము (Convex lens) అనియు, అంచువద్ద కంటె మధ్య తక్కువ దళసరిగానున్న కటకమును పుటాకార కటకము (Concave lens) అనియు అందురు.
కటకములలోని వివిధరకములు 2 వ పటములో చూపబడినవి. అందులో (A) ద్వికుంభాకారకటకము (Double convex lens), (B) సమతల కుంభాకారకటకము (Plano convex lens), (C) కుంభాకార మెనిస్కస్ (Convex-meniscus) (D) ద్విపుటాకార కటకము (Double concave lens) (E) సమతల పుటాకార కటకము (Plano concave lens) (F) పుటాకారమెనిస్కస్ (concave-meniscus.)
గాజుతో చేయబడిన ద్వికుంభాకార కటకముపై, అనంత దూరములోనున్న వస్తువునుండి కాంతి కిరణములు ఒక దానికొకటి సమాంతరముగా వచ్చిపడిన అవి వక్రీభవనము చెందిన తరువాత కటకమునకు ఆవలభాగమున అభిసరించి (converge) ఒక బిందువు వద్ద కలియును. అందుచే