Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/547

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కన్నడదేశ చరిత్ర - II

సంగ్రహ ఆంధ్ర


ఇట్టి సమయమున విజయుడు, కృష్ణుడు అను ఇద్దరు సోదరులు హదినాడునం దుండుట తటస్థించెను. వీరిద్దరు యదు వంశజులు. ద్వారక నుండి బయలుదేరి, దక్షిణమున నొక రాజ్య మేర్పరుచుకొనవలయు నని సంచారము చేయుచు హదినాడు వచ్చియుండిరి. ఈ సోదరులు హదినాడువారు తమ రాజకుమారి వివాహ విషయములో పడుచున్న దుర్భర పరిస్థితిని గమనించిరి. అంత సోదరు లిద్దరు హదినాడువారికి ధైర్యము పురిగొల్పి, వారికి సాయము చేయుదుమని బాసట చేసిరి. వారు కారుగహళ్ళి ప్రభువుపై దండెత్తి, వానిని మడియించిరి. విషమసమయములో సహాయముచేసి తమ వంశ గౌరవమును కాపొడినందులకు రాజపుత్రిక కృతజ్ఞురాలై, సోదరులలో పెద్దవాడగు విజయుని వరించెను. హదినాడు, కారుగహళ్ళి అను రెండును విజయుని స్వాధీనమయ్యెను. అప్పుడతడు "ఒడయరు" అను బిరుదు వహించెను. విజయుడే మైసూరు ఒడయరు రాజవంశమునకు మూలపురుషు డయ్యెను (క్రీ.శ.1399). ఈ మైసూరు రాజ్యము సహ్యపర్వతము లకును, కావేరినదికిని మధ్యగల ఎత్తయిన పీఠభూమిలో వర్థిల్లినది.

ఈ ఒడయరు రాజవంశమునందు 25 గురు క్రీ.శ. 1309 మొదలుకొని 1956 వరకు, 557 సంవత్సరములు కన్నడ దేశమునుపరిపాలించి కన్నడ రాజ్యవిస్తీర్ణమునకును, భాషా సాహిత్యముల యభివృద్ధికిని, ధర్మ ప్రతిస్థాపనమునకును ఇతోధికముగ కృషి సలిపిరి. ఈ రాజ్యము విజయనగర సమ్రాట్టులకు సామంతరాజ్యముగా నుండెను. ఈ ఓడయరులలో ఆరవవాడగు తిమ్మరాజ ఒడయరు II (1552-1571) విజయనగర సామ్రాజ్య పతనానంతరము (1565) స్వాతంత్య్రము ప్రకటించి పరిమితమయిన కన్నడ దేశమును పాలించసాగెను. ఈ రాజులలో తొమ్మిదవ వాడగు రాజ ఒడయరు (1578-1617), పన్నెండవ వాడగు కంఠీరవ నరసింహ ఒడయరు (1638-1659), పదు మూడవవాడగు దొడ్డ దేవరాజ ఒడయరు (1659-1672). పదునాల్గవవాడగు చిక్క దేవరాజ ఒడయరు (1672-1704) పేర్కొనదగినవారు. వీరు రణధీరులు, యశోవంతులు. కంఠీరవ నరసింహరాజ ఒడయరు తన పేరిట కంఠీరవ హొన్నులు, పణములు అను నాణెములను ముద్రింపించెను. మైసూరు రాజ్యసీమయందు హైదరాలివరకును ఈ నాణెములు చెలామణి యగుచుండెను, ఈ రాజే మైసూరు నందు నేటికిని జరుగుచుండు దసరా ఉత్సవములను నెలకోల్పినవాడు. చిక్క దేవరాజు తపాలా వసతులను ఏర్పాటు చేసెను. నేల పన్నులను తగ్గించెను. దొడ్డదేవరాజు కాలములో మైసూరురాజ్యము తూర్పున సక్కెర పట్టణము మొదలుకొని సేలమువరకును, ఉత్తరమున చిక్క నాయకుని హళ్ళి మొదలుకొని ధారాపురము (కోయంబత్తూరు జిల్లా) వరకును వ్యాపించియుండెను. చిక్క దేవరాజు కాలములో దక్షిణమున పళని, అన్నామలలు మొదలుకొని ఉత్తరమున మిడగేశి వరకును, తూర్పున కర్ణాటక ఘరము మొదలుకొని పడమట కొడగు బాలముల సరిహద్దులవరకును వ్యాపించియుండెను.

పదునారవవాడగు దొడ్డ కృష్ణరాజ ఒడయరు 1 (1713-1731) రాజ్యమునకు వచ్చునప్పటికి మొగలాయి పాదు షాలు దక్షిణ హిందూదేశము నాక్రమించి యుండిరి. .