Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/545

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కన్నడదేశ చరిత్ర - I

సంగ్రహ ఆంధ్ర


ఒకటవ చాళుక్య సోమేశ్వరుని యొక్కయు, ఆరవ విక్రమాదిత్యుని యొక్కయు కాలములలో ప్రబల సామంతు లుగా నుండిన దేవగిరి యాదవులు క్రీ. శ. 1187-91 మధ్య ఖిల్లముని నాయకత్వమున కృష్ణకు ఉత్తరమున స్వతంత్రులైరి. హోయసలులు తుంగభద్రకు దక్షిణప్రాంతమును ఆక్రమించిరి. కృష్ణా తుంగభద్రలకు మధ్యభూభాగమును ఆక్రమించుటకై చాళుక్యులకు, యాదవులకు ఎడ తెగని యుద్ధములు జరుగుచునే యుండెను. ఇట్టి యుద్ధములలో నొకటగు సోర్ తూర్ యుద్ధమున హోయిసల రెండవ వీరథల్లాలుడు భిల్లముని పారద్రోలెను. హోయసల వంశములోనివాడగు సింహణుడు మిక్కిలి ప్రబలుడై హోయసల రాజ్యము దక్షిణమున షిమోగా జిల్లావరకు చొచ్చుకొనిపోవునట్లును, తూర్పున కాయస్థ చోళ సామంతులు లోబడునట్లును, గుజరాత్ రాజగు లావణ్య ప్రసాదు సంధి కొడబడునట్లును చేసెను (క్రీ.శ. 1231). ఈ వంశ వైభవము కృష్ణుడు, మహాదేవుడు అనువారి పరిపాలనలో ఇతోధికముగా విలసిల్లెను.

మహమ్మదీయ దండయాత్రలు: మహాదేవుని పరిపాలనలొ శ్రీ మధ్వాచార్యులు ద్వైత భావముకల విష్ణుభక్తిని ప్రబోధించెను. దీనితో ప్రజలకు జీవితముపై గల దృక్పథము మారెను. అయనను, ఐహిక భోగపరాయణత్వము బలవత్తరము కాజొచ్చెను. రామచంద్రుని పరిపాలనా కాలమున అల్లాఉద్దీన్ ఖిల్జీ యొక్క సేనానియగు మాలిక్ కాఫర్ అనువాని దండయాత్రల ఫలితముగా రాజ్యము విచ్ఛిన్నమైపోయెను. ఇట్లే హోయిసలు కాకతీయ రాజ్యములును మహమ్మదీయ దండయాత్రలవలన ఛిన్నా భిన్నములై పోయెను. దీనితో దక్షిణ హిందూస్థానమంతయు అల్లకల్లోలమై, అవ్యవస్థితముగ నుండెను.

విష్ణువర్ధనుడు, రెండవ వీరభల్లాలుడు, మూడవ భల్లాలుడు మొదలగువారి విజయపరంపరల మూలమునను, వైష్ణవమతాచార్యుడయిన శ్రీరామానుజస్వామి వారి ప్రచారము మూలమునను హోయసలవంళము ప్రసిద్ధమయ్యేను. వీరికాలమున విశిష్టాద్వైతము కర్ణాట తమిళదేశములందు' ప్రచారము గాంచెను. బేలూరు సమీపమున హలెబీడువద్దగల దేవాలయ శిల్పము హోయిసల శిల్పరీతి యనబరగేను. వైష్ణవకవి రుద్రభట్టు రెండవ వీరభల్లాలునకు ఆశ్రితుడు.

పైన పేర్కొనబడినట్లు యాదవులు హోయసలులతో తలపడి ఉత్తర మైసూరువరకు షిమోగావైపునకు చొచ్చు కొనిపోగా హోయిసలులు మూడవ భల్లాలుని కాలమున తూర్పున అనంతపురమువరకు తమ రాజ్యపు సరిహద్దును నిలుపుకొనగలిగిరి. ఇట్లే ఓరుగల్లు కాకతీయులు యాదవులతోను, హోయిసలులతోను తరచుగ యుద్ధములు సాగించిరి. ఈ యుద్ధములు దక్కనులోని హిందూ ప్రభువుల సామర్థ్యమును కుంఠిత మొనర్చెను. కావుననే దండెత్తుచున్న మహమ్మదీయులకు దక్షిణాపథమంతయు ఒక్కసారిగా వశమయ్యెను.

విజయనగర సామ్రాజ్య స్థాపనము: మహమ్మదీయ అధికారులు ఢిల్లీలోని కేంద్రప్రభుత్వమును ధిక్కరించుటతో హిందూరాజ్య స్థాపనమునకు అనుకూల వాతావరణము ఏర్పడెను. సంగముని కొడుకు లిద్దరు హుక్క (హరిహర 1) రాయలు, బుక్కరాయలు I అనువారు కుమ్మటి దుర్గము యొక్క పాలకుడగు కంపిలి రాయని యెద్ద రాజోద్యోగులుగా నుండి కంపిలదేవుని పతనానంతరము రాజ్యమునకు స్వతంత్ర పాలకులమని ప్రకటించుకొనిరి. మొదట వీరి రాజ్యము కంపిలి రాజ్యమునకు పరిమితమయ్యు కాలక్రమమున 14 వ శతాబ్దమున దక్కనునందేర్పడిన మహమ్మదీయ రాజ్యములు తప్ప మూడు సముద్రముల మధ్యగత దేశమంతటను వ్యాపించెను. విజయనగర సామ్రాజ్యమును 300 సంవత్సరములు సంగమ వంశము, సాళువ వంశము, తుళువ వంశము, ఆరవీడు వంశము పరిపాలించెను. మొదటి వంశములోని రెండవ దేవరాయల (1426.1446) కాలమున ఈ రాజ్యము తెలుగు తమిళ దేశములలో విశేషముగా వ్యాపించెను. దాని వైభవము అత్యుత్తమస్థాయి నందుకొనెను. కృష్ణ దేవరాయల (1509 - 1530) అజేయమైన ప్రభుత్వము దక్షిణభారతమున గుర్తింపబడువరకు ఈ విజయపరంపర సాగుచునే యుండెను. కృష్ణదేవరాయల తమిళోత్కల దండయాత్రలను గూర్చి దేవాలయముల మూలమునను, దేవతల కిచ్చిన దానముల మూలమునను మనకు తెలియుచున్నది.