Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/460

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఐరోపాఖండ కళ

పదార్థ విజ్ఞానశాస్త్ర, గణితశాస్త్రములందేగాక, ఖగోళ శాస్త్రమందును, తాత్త్విక విషయములందును, లలిత కళలయందును గొప్ప ప్రావీణ్యముకలవాడయియుండెను. లలితకళలలో ముఖ్యముగ సంగీతశాస్త్రమునందు అతనికి ఇష్టము మెండు. అతడు ఫిడేలు, పియానో జంత్రములను వాయించగలిగియుండెను.

సాధువు, అలౌకికుడు, అమాయికుడు, గంభీర ఆధ్యాత్మిక చింతాయుతుడు, భౌతికశాస్త్రపారగుడు, మహనీయుడు, శాస్త్రజ్ఞులలో ఘనుడు అయిన ఆల్బర్టు ఐన్ స్టెన్ 1955 ఏప్రిల్ నెల 18 వ తారీఖున పిత్తాశయము యొక్క వాపువలన దివంగతుడయ్యెను.

ఏ. యం. జ.


ఐరోపాఖండ కళ (European Art) :

అన్ని కళలవలె ఐరోపాఖండ కళ బహువిషయార్థకము. దృశ్యకళలలో (visual arts) ముఖ్యముగా చిత్రకళ, రేఖాచిత్రము, శిల్పము అను శైలీభేదములు ఈ వ్యాసము నందలి విషయములు.

నిజమునకు ఐరోపాఖండమున పూర్వ చారిత్రక యుగ నాగరికత ఎంత ప్రాచీనమైనదో ఐరోపాఖండ కళగూడ అంత ప్రాచీనమైనదే. ఎందుచేతననగా అనేక వేల సంవత్సరములకు పూర్వము ఎట్టి లేఖనా పద్ధతియు తెలియబడని కాలములో గుహా నివాసియగు మానవుడు వ్రాసిన రేఖా చిత్రములు కనిపించుచున్నవి. వాటియందు పూర్వ చారిత్రకయుగపు మనుజుడు కావించిన కృత్యములను గూర్చియు, భూమిపై ఆనాడు నివసించియున్న జంతువులనుగూర్చియు వివరణము గలదు. ఈ రేఖాచిత్రముల సహజ కౌశల్యమునకు నేటికిని సామ్యముకానము. అట్టి అత్యుత్తమమైన రేఖాచిత్రములలో సజీవమయిన కారెనుము (Cow-bison) దేహచిత్ర మొకటి. ఇది ఆల్ టమెరా (Altamera) గుహాలయములకు చెందినది. శిల్పియొక్క ఉజ్జ్వలమైన అవలోకనమునందును, ఆ జంతువును శయనించు స్థితిలో దివ్యముగ చిత్రించుట యందును ప్రాథమిక కళ యొక్క విస్మయావహమైన సామర్థ్యము గోచరించుచున్నది.

క్రీటనుకళ (Cretan art) : ఐరోపాఖండ కళ యొక్క ఉత్పత్తి అభివృద్ధులమీద నిస్సందేహముగ ప్రాచీనము లయిన ఈజిప్టు, సుమేరియా దేశముల కళల యొక్క ప్రభావము మహత్తరముగ ప్రసరించియున్నది. గ్రీసు, క్రీటు అను దేశములు తమతమ భావముచే ఈజిప్టు, సుమేరియాల యందలి సంపన్న కళాకేంద్రములు కావల కొంతదూరమున నుండియున్నవి. ఐనను నిజమునకు ఐరోపా ఖండకళకు ఉత్పత్తిస్థానములు గ్రీసును, కొంచెము పూర్వము క్రీటు దేశమునై యుండెను. వీటికింత సాన్నిధ్యమున్నప్పటికిని క్రీటు ద్వీపమునందును, ఏజియన్ ద్వీపముల (Aegean Islands) పరిసరములందలి ద్వీపములందును క్రీ. పూ. 3000 మొ. సుమారు 2000 సం. ల వరకు వర్థిల్లిన నాగరికత సాకల్యముగా భిన్నమైనదే. ఈజిప్టు, సుమేరియా దేశములకు ముఖ్యముగా మతమునందును, రాజ దేవతలందును (King deities) మక్కువ మెండు. ఈ దేశములందలి ఆకార రేఖ (Design) విశేషముగా మతావసరములచే నిర్ణయమై స్వకల్పిత సంకేతబద్ధ మయ్యేను (Self.imposed formalization). క్రీటు నాగరికతలోని ఐహిక జీవిత విధాన భావము ననుసరించి స్వేచ్ఛగా చిత్రములు వ్రాయబడెను, శిల్పి, సంప్రదాయబద్ధమయిన భావమును విసర్జించెను. క్రీడాకార్యములకు సంబంధించిన ఉజ్జ్వలములైన విగ్రహముల నిర్మాణమునందు సాంకేతికత్వమునకు అల్పస్థానము లభించెను. వృషభ యుద్ధములు, గరిడీ క్రీడా విధానములు సజీవములైన రూప రేఖలతో (outlines) విశేషముగ గోడలపై చిత్రింపబడెను. మృణ్మయపాత్రలమీది మృణ్మయ పాత్రలమీది అలంకరణముల యొక్క భావన యందును, అనుసంధానమందును, నూతనమైన ఉల్లాసము లక్షితమయ్యెను. చుట్టునున్న సముద్రముచే శిల్పులు ఆవేశితులైన కారణముచే కుండలమీదను, పాత్రలమీదను సహజముగా చేపలు, సముద్రపు నాచు (weed), మధ్యధరా సముద్రమందు చేపలు పట్టుటకై ఉపయోగించు ఎర(Squid) తరచుగా కనిపించెను. ఇవన్నియు స్వేచ్ఛగా, విసుగు పుట్టించెడు పునరుక్తి దోషము లేకుండా ఉద్దిష్టమైన వస్తురూపమునకు అత్యంత అనుకూల్యము లభించునట్లుగా నిర్వహింపబడెను. కుండలపై చిత్రింపబడిన స్త్రీ విగ్రహములకు నేడు ప్యారీసు నగరమందలి దర్జీపని వారు తయారుచేయుచున్న మేలుబంతి జరీబుటావలు వలవంటి వస్త్రాలంకరణములు కూర్పబడినవి. ప్రసారితములైన