Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/439

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎస్కిమోలు

సంగ్రహ ఆంధ్ర

యున్నవి. ఇవి శిల్పియందు సృజనాత్మకశక్తి లోపించి యుండినట్లు చూపును.

పుష్పసంబంధమైనట్టియు, ఆభరణ సంబంధమైనట్టియు నమూనాలు, పౌరాణికములో, వాస్తవికములో అగు జంతునిరూపణకు సుప్రసిద్ధమగు సంప్రదాయ పద్ధతులు, లేక తాత్వికములయిన అల్పవిషయములు మున్నగు వాని కేవల అలంకరణ కల్పనలందు జైన శిల్పకారుని నైపుణ్యము బ్రాహ్మణ- బౌద్ధ శిల్పకారుల నైపుణ్యమునకు తీసిపోదు. కల్పనా సమృద్ధియందును, సంక్లిష్టములైన అలంకరణ విస్తారముల సంపూర్ణత యందును జైనశిల్పి బ్రాహ్మణ బౌద్ధ శిల్పులను కూడ మించగలడు. అత్యాడంబర భూయిష్ఠమయిన (lavish) జైనకళ మొత్తము మీద సామాన్యశిల్పి కల్పనకు అననుగుణముగా నుండి, సంస్కృతీకూన్యమయిన అభిరుచిని, సద్వివేక రహితమయిన, నిర్ణయమును వెల్లడిచేయుచున్నది.

ఈ గుహాలయములందలి చిత్రలేఖనములలో ముఖ్యముగా ఇంధ్రసభ యొక్క యు, జగన్నాథసభ యొక్క యు విహారములయందు గల అపురస చిత్రములు అజంతా యందలి తత్ప్రతిబింబములకు తుల్యముగా నున్నవి. అప్పుడపుడు ఈ గుహాలయ నివాసులగు సాధువులు కల్పించిన నిప్పుపొగల మూలమున ఈ చిత్రలేఖనముల అసలు వర్ణములు చెడిపోయినవి. ఐనప్పటికినీ, సాయంకాలిక సిందూరవర్ణ కలితములైన మేఘముల యొక్క మధ్యభాగములందు పయనించు శ్యామవర్ణ భాసురములైన అప్సరసల విగ్రహములు యథాదర్శన చిత్రలేఖన (perspective) పరిణామముతో కనిపించును. ఆ విగ్రహముల అవయవలాలిత్యము, తదాభరణ నేపథ్యములు విరళమైయున్నను, శోభ శ్లాఘ్యముగా పరిదృశ్యమానమగుచున్నది. అన్ని రంగులలోను శిల్పులకు సిందూర వర్ణము నచ్చినట్లు కనిపించును. శిల్పులు అనుకరణమున దక్షులుగనున్నారు. ఇంద్రసభ యొక్క వితానములందలి (ceilings) అప్సరసల విగ్రహములు అజంతా మఠము లందు చిత్రింపబడిన అప్సరసల విగ్రహములు నిలుచు తీరు నందలి సౌందర్యమును, అంగవి జేపమునందలి లాలిత్యమును విస్తారమయిన అలంకారప్రీతిని మాత్రమే ద్యోతకము చేయును. మొత్తముమీద ఎల్లోరాయందలి జైన చిత్రణము అనుకర ణాత్మకమై, సృజనాత్మకశక్తి విహీనమై యున్నది.

పు. శ్రీ.


ఎస్కిమోలు :

ఎస్కిమోలు ఉత్తర అమెరికా ఆర్కిటిక్ ప్రాంతము నంతయు అనగా 'అలాస్కా' నుండి 'గ్రీన్ లాండ్' వరకే కాక ఆవల 'ఎల్యూషియన్' (Aleutian) ద్వీపముల లోనికి, ఆసియాలో మిక్కిలి ఈశాన్యమునకు ఉన్న కొల్యు చిన్ అఖాతము (Kolyuchin Bay) వరకును వ్యాపించి యున్నారు.

వారు పొట్టివారు. వారి ముఖములు వెడల్పుగను, సోగగను ఉండును. దవడ ఎముకలు స్ఫుటముగా కనిపించు చుండును. ముక్కు తిన్ననై, సన్నగాను, పొడవుగాను ఉండును. లేతపసుపుతోకూడిన గోధుమవన్నె శరీరచ్ఛాయ గల మంగోలియనులకు విశిష్టలక్షణములయిన ఏటవాలు కన్నులు వీరికుండును. ఎపి కాంతికు (Epicanthic) ముడుతలుండును, వారి శిరోజములు ఒత్తుగాను, బిరుసుగాను,. నల్లగాను, ఒక్కోక్కప్పుడు నొక్కులతోను ఉండును.

ఇగ్లూ (Igloo) అని పిలువబడు గోపురాకారముగల మంచుఇండ్లలో ఎస్కిమోలు నివసింతురు. వెచ్చదనము కలుగుటకు ఒక్క దీపముమాత్రమే ఉపయోగింపబడినను, ఎస్కిమోల ఇండ్లు మిక్కిలి వెచ్చగా నుండును. అందుచేత గృహములోపల నున్నప్పుడు ఎస్కిమోలు నడుమువరకు నుండు చొక్కాలవంటి దుస్తులను వేసికొనరు.

ఈ జాతికూడా ఆహార సంపాదనార్థము ఒకప్పుడు సంచార మొనర్చుట కలదు. కొన్నిసందర్భములలో తప్ప, వారి ఆహారమంతయు వేటవలననే లభించుచున్నది. కణితి వంటి ఒక జంతువు (Reindeer) మాంసము ఎస్కిమోలకు మిక్కిలి ఇష్టమైనది. రైండీరు మాంసమును అధికముగా సంపాదించుటకు శరదృతువులో (Autumn) వేటవలన మంచి అవకాశములు లభించుచున్నవి. ఎస్కిమోలు ఈ కాలమున ఈ మాంసమును విరివిగా సంపాదించి, ఎండబెట్టి చలికాలమున వాడుకొనుటకొరకు నిలవచేసికొందురు. వేసవికాలములో ఎస్కిమోలు రువ్వెడు ఈటే, కత్తి, బల్లెము మొదలైన వాటితో సీలు, వేలు అను జంతువులను వేటాడుదురు. సముద్రతీరమునకు దూరమైన లోపలి