Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/433

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎల్లోరా గుహాలయములు

సంగ్రహ ఆంధ్ర


నాటి ఆలయ శిల్పకళనుండి పరిణామము చెందినది. గాడులు గల దిండు ఆకారములోనున్న స్తంభాగ్రములు అగ్రమున కొలదిగ భారవండములుగ నున్నట్లు కన్పట్టును' కాని పైకప్పు ఎత్తుగా నుండుటవలనను, దేవాలయపు నడవలు విశాలముగా నుండుటవలనను, ఇది ఎబ్బెట్టయిన లోపముగా ఎంచబడుటలేదు. గుహాలయాంతర్భాగమందలి శిల్పనై పుణ్యప్రభావము మొత్తముమీద తేజోవంతమును, శాశ్వతసిద్ధియు కలిగినదిగా నున్నది.

ముందు భాగమున నున్న చావడికి మూడు ప్రక్కల యందును అన్ని చివరలయందు, పెద్ద పెద్ద శిల్పములు చెక్కబడియున్నవి. పశ్చిమ వసారాలో దక్షిణాగ్రమున రావణుడు కైలాసమును కదల్చుచున్నట్లును, ఉత్తరాగ్రమున భైరవుడు ఇద్దరు వ్యక్తులను హతమార్చినట్లును చెక్కబడెను. పశ్చిమమున శివపార్వతులు చదరంగమాడు చున్నట్లును, క్రిందిభాగమున గణదేవతలతో నందీశ్వరుడు నిలచియున్నట్లును, పిరికి కుడిప్రక్కగా విష్ణువు, ఎడము ప్రక్కగా బ్రహ్మ వీక్షించుచున్నట్లును, శిల్పములు రూపొందింపబడెను. కాళిదాసుని వర్ణనలచే ప్రభావితులై శిల్పులు ప్రార్ధికయందు కల్యాణ మహోత్సవ రంగమును, దానికి మీదుగా అంతరిక్షమునుండి స్త్రీ పురుష దేవతలు వీక్షించు సన్నివేశమును చెక్కి యున్నారు. దీనికి దక్షిణముగా గోడలోని స్తంభమునకు వెలుపల సరస్వతీ విగ్రహమొకటి కలదు. వలయాకారముగల శిరో వేష్టనమును (తలపొగను) ఆమె ధరించినట్లు కన్పట్టును. ఆమెకు ఎగువ భాగమున ఋషులును, దిగువభాగమున పరివారమును ఉన్నట్లు శిల్పము చెక్కబడెను. సరస్వతి సరసనే కొంచెము క్రిందుగా ఆమె వాహనమయిన హంస నిలబడియున్నట్లు చూపబడినది.

దీనికి దక్షిణముగా క్రిందిభాగములోనున్న జలప్రవాహమువరకు సోపాన పంక్తులు కలవు.

వసారా యొక్క ఉత్తరాగ్రమున మహాయోగిగా శివుడో లేక లకుటేశ్వరుడో, ఎడమచేతిలో లగుడ ధారియై పద్మాసనముమీద కూర్చుండినట్లు కన్పడును. బౌద్ధ గుహాలయములలోవలెనే ఇద్దరు భక్తులు వెనుక నిలబడియుండగా, సర్పఫణమండిత విగ్రహులగు కొందరు తామరతూడును మోయుచున్నట్లుండును. దీని కెదురుగా, శివుడు తాండవ నృత్యము చేయుచున్నట్లును, ఆతనికి ఎడమవైపున పార్వతి ఆసీనయై యున్నట్లును కలదు.

గోడ స్తంభము (Pilaster) నకు వెలుపలగా తూర్పు దిశ యందున్న గోడపై తాబేలు మీద గంగాదేవి విగ్రహము చెక్కబడి యున్నది. ఈ విగ్రహము మరియొక చివర నున్న సరస్వతీవిగ్రహముతో సరితూగునట్లు చెక్కబడినది. గంగ సరసనే ఆమె పరివారము కలదు.ఆమె శిరముపై ఎత్తుగా గంధర్వులు ఎగురుచున్నట్లు కలదు.

అన్ని దేవాలయములందువలెనే, దీనియందును లింగ మున్నది. కాని దీనికి నాల్గు ప్రక్కలయందు ద్వారములు కలవు. నాలుగువైపులద్వారములయందును బ్రహ్మాండమైన ఆకారములతో ద్వారపాలకులు దేవాలయరక్షణకు నిలబడియున్నారు. ద్వారపాలకులు దక్షిణహస్తములందు పుష్పకలితులై యున్నారు. వీరి చెంత ఒక పరిచారిక గూడ పుష్పహస్తయై నిలచియున్నది. ఈ విగ్రహముల యొక్క శిరో వేష్టనములు ఒక దానికొకటి విభిన్నమైనవిగానున్నను, మొత్తముగా చూచినప్పుడు సుందరమయిన అనురూప్యము కలిగియే యుండును.

జైనగుహలు : బ్రాహ్మణ గుహా సముదాయమునందలి తుదిగుహకును, దాని కావలనున్న జైనగుహా సముదాయమునకును మధ్య గొప్ప దూరము కలదు. ఈ సముదాయమునకు చెందిన అయిదారింటిలో 31 వ సంఖ్యగల 'చిన్న కైలాసము', 32 వ సంఖ్యగల 'ఇంద్రసభ', 33 వ సంఖ్య గల 'జగన్నాథ సభ' అనునవి అత్యంత ముఖ్యమయినవి. - ఎల్లోరాయందలి ఇతర గుహలకంటే అవి ఎక్కువగా సురక్షిత స్థితియం దుంచబడినవి. వాటియందు చిత్రకళకును, శిల్పకళకును సంబంధించిన సూక్ష్మాంగ విభూతి ఎంతో గలదు.

ఇంద్రసభ అనునది రెండు అంతస్తులుగల దేవాలయము. అది శిలలో నూరుఅడుగులకు మించిన లోతున తొలచబడినది. దానిని చేరుటకు ఒక ద్వారము కలదు. ఈ ద్వారము శిలనుండి తొలచబడినదే. అది చతురస్రాకారము గల ఒక ఆవరణములోనికి ప్రవేశ పెట్టును. దాని మధ్య భాగమున మహాశీలను తొలచిన గుహాలయములు కనిపించును. అది కొంతమట్టుకు ఒక చిన్న ద్రావిడ దేవాలయ రూపమున నుండును. ద్వారమునకు కుడివైపున అద్భుతా