Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/396

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము -౨

ఎరువులు


సామాన్య పశువుల ఎరువునందు సగటున నూటికి 0.5 పాళ్ళు నత్రజని, 0.25 పాళ్ళు స్ఫురత్వం చామ్ల జనితము, 0.5 పాళ్ళు పొటాషు ఉండును. మలమూత్రము యొక్క సంఘట్టనము అన్ని జంతువులయందును ఒకే విధముగ నుండక, వాటి యొక్క రకమును, వయస్సును బట్టియు, అవి తిను ఆహారమును, చేయు పనిని బట్టియు కూడ మారుచుండును. ముసలి పశువుల యొక్కయు, దుక్కి పశువుల యొక్కయు, మల మూత్రములు, ఎదుగుచున్న దూడల యొక్కయు, పాడియావుల యొక్కయు మలమూత్రముల కంటే ఎక్కువ సారము కలవి. ఆవుల యొక్కయు, ఎడ్ల యొక్కయు మలమూత్రములు, గేదెలయొక్కయు, దున్నల యొక్కయు మలమూత్రముల కంటే ఎక్కువ సారముకలవి. ప్రత్తివిత్తులు, వేరుసెనగపిండి, ఉలవలు మొదలగు దాణాలు పెట్టబడు పశువుల మలమూత్రములు కేవలము జొన్న చొప్ప, పచ్చిగడ్డి, వరిగడ్డి మొదలగు స్థూలాహారములు మాత్రమే తిను పశువుల మలమూత్రము కంటే ఎక్కువసారము కలవిగా నుండును.

“ ప్రశస్తమైన పశువుల ఎరువును తయారు చేయుటకు పశువుల శాలలందలి మలమూత్రములును, చెత్త చెదారములును వృథాకాకుండ పొదుపుచేసి, అవి కలిసి గోతి యందు చీకునప్పుడు, వాటి యందలి సారము పోకుండ చూడవలెను. పశువుల యొక్క మూత్రము చాల విలువ గలది. అందుచే జిగురులేని పొడిమట్టిగాని, ఎండిన కలుపు మొక్కలు లేక రాలుటాకులుగాని పశువుల శాలలందు పరచి, వాటివలన ఆ మూత్రమును ఇంకింపజేసి, ఎరువు గోతియందు జేర్చుచుండవలెను. పశువులశాల యొక్క నేలను గచ్చుచేసి, దాని పైబడు మూత్రమును, ఒక చివర నుండు గచ్చుకుండిలో పడునట్లు చేసి, దానిని ప్రతిదినము ఎరువు గోతియందు పోయుచుండుట చాల శ్రేష్ఠమైన వని.

ఇట్లు ప్రతి దినము పశు శాలనుండి తీయబడు మల మూత్రములు, చెత్తచెదారములు గోతిలో వేయబడి కాని, కుప్పగా పెట్టబడి కాని, 3.4 నెలలు చీకినతరువాత, అందలి సేంద్రియ పదార్థములు, సూక్ష్మజీవుల సహాయమున కొన్ని మార్పులు చెంది, మొక్కల వేళ్ళచే తీసికొనబడు ద్రావణీయ లవణములుగ మారును. ఎరువు, గోతియందు చీకునపుడు, దాని పై భాగమును దట్టముగ మట్టితో కప్పినచో, అండలి సారద్రవ్యములు సూర్యరశ్మివలన క్షీణింపకుండుటయేగాక, వర్షపు నీటితో కొట్టుకొని పోకుండ నుండును. మరియు ఎరువునందలి సారము క్రిందికి దిగిపోకుండునట్లు, గోతి యడుగు నేలను, కంకర వేసి గట్టిపరచి, నీరు ఇంకకుండ చేయవలెను.

అన్ని నేలలయందును, అన్ని సస్యములకును, ఉపయోగించి నిస్సంశయముగ ఫలితమునిచ్చు విషయమున పశువుల ఎరువునకు సాటి మరియొకటిలేదని చెప్పవచ్చును. మరియు, పశువుల ఎరువు వేసి పెంచిన కూరగాయలు ఇతర సస్యములు, కేవలము అమ్మోనియా గంధకిదములు మొదలగు నిరింద్రియపు టెరువులను (Inorganic fertilisers) మాత్రమే వేసి పండించిన పంటలకంటె, రుచికరములుగను, ఆరోగ్యదాయకములు గను ఉండునని తేటపడినది.

2. గొట్టే పెంట, మేక పెంట: గొజ్జెల యొక్కయు, మేకల యొక్కయు, మలమూత్రములు పశువుల మల మూత్రములకంటే హెచ్చుసారముకలిగి త్వరలో చీకును. ఆవులు మున్నగువాటివలె వీటిని పళ్లు శాలలలో కట్టి ఎరువును తయారుచేయుటకు ఎక్కువగా వీలుగ నుండక పోవుటచే, సత్తువచేయవలసిన నేలపై, రాత్రులందు ఎకరమునకు 1000–2000 చొప్పున గుంపులుగా మందలు తోలబడును. కలుపుమొక్కలు విస్తారముగానుండు నేలపై మంద కట్టినయెడల ఎరువు బలమువలన అందలి గడ్డి గాదములు విస్తరించును. అందుచే మందను పరుండబెట్టుటకు ముందుగ నేలను బాగుగ దున్ని మంద తొక్కిన తరువాత గుంటకను తోలిగాని మరల దున్నిగాని మలమూత్రములు నేలయందు బాగుగ కలియునట్లు చేయవలెను. వర్షకాలమున శేషగనుండు బంక నేలలపై మందులను పరుండ పెట్టినచో అనేలలు గట్టిపడిపోవును. గొజ్జెల యొక్కయు, మేకల యొక్కయు మల మూత్రములతో ఊరినమట్టి, పొగాకు, మిర్చి, నారింజజాతి ఫలవృక్షములు గులాబి, మల్లే మొదలగు పూల మొక్కలకు చాల పుష్టికరము. నిస్సారములగు నేలలందు ఎదుగనట్టియు, తెగుళ్ళచే నీరసించినట్టియు సస్యములకు, ఈ ఎరువులు అతి త్వరితముగ బలము నొసగును.