Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/330

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము -౨

ఉస్మానియా విశ్వవిద్యాలయము


గుణముగ ఆంగ్లభాషా సాహిత్య పరిజ్ఞానార్థము, ఉరుదు నకు ప్రత్యేకస్థానము నొసగుటయు మా సంకల్పము.” అని నిజాం ప్రభువు వారు సెలవిచ్చినారు. ఈ గజెటు లేదా మన్హూరు క్రీ. శ. 1918 లో (1327 ఫసలీ) వెలువడినది.

9.0 శాతము జనులకు తెలియని ఉర్దుభాషకు ఈ ప్రత్యేక గౌరవమేలు అనగా, ఉర్దు రాజభాష, శిష్టజనుల భాష, దేశ భాష అని సమర్థించినారు.

ఈ ఉర్దు విశ్వవిద్యాలయము నిజాం ప్రభువుగారి పేర "ఉస్మానియా విశ్వవిద్యాలయము"గా 1918 లో అవతరించినది. ప్రప్రథమమున ప్రణాళిక ననుసరించి ఉర్దు భాషలో పాఠ్య గ్రంథములు రచించుటకై, అందులకు అవసరమగు ప్రామాణిక సాంకేతిక పదజాలమును, భాషాస్వరూపమును నిర్ణయించుటకై, ఆయా శాస్త్రము లందు ప్రవీణులగు వారిని, భాషావేత్త లను నియమించి "ఉస్మానియా విశ్వవిద్యాలయ అనువాద - ప్రచురణశాఖ" నెలకొల్పబడినది. ఈ శాఖవారు అపారకృషి సలిపి, సమస్త శాస్త్రములందలి ముఖ్య గ్రంథములను, ఆధార గ్రంథములను ఉర్దు భాషలో రచింప జేసిరి. కొన్ని స్వతంత్రగ్రంథములు కూడ రచింపబడినవి. భారతీయ విశ్వవిద్యాలయములు అనేకములుండ దేశ భాషలో ఇట్టికృషికి పూనుకొనినవారు ఉస్మానియా విశ్వవిద్యాలయమువారే. వారు అవిరళ కృషి యొనర్చి, కష్టనష్టములకోర్చి ఉన్నత విద్యాబోధనము దేశభాషయందు జరుపవచ్చుననియు, అది ఆచరణ సాధ్యమనియు నిరూపించిరి. వారిదీక్ష, వారి ఉన్నత ఆదర్శము, వారి దేశ భాషను ప్రోత్సహించు సంకల్పము ప్రశంశనీయములుసు మార్గ దర్శకములునై యున్నవి. అయితే ఈ సందర్భమున గమనించదగిన ముఖ్యవిషయ మేమన, వారు తమ కృషికి దోహదకరముగా ప్రాంతీయ భాషల సహకారమును సంపాదించలేదు. వారు సృష్టించిన సాంకేతిక పదజాలమంతయును అరబ్బీ, పారశీక భాషలపై ఆధార పడి యుండుటవలన జనసామాన్యమునకు అనగా సామాన్య భాషాజ్ఞానము కలవారికి సుబోధముగ లేకుండినది. అది విద్యార్థులకు సయితము కొంతవరకు కఠినముగనేయుండినది. సంస్కృతము యొక్కయు ప్రాంతీయ భాషలగు ఆంధ్ర కన్నడ. మహారాష్ట్ర భాషల యొక్కయు సంప్రదాయములను పదములను కొంతవరకైనను ఉపయోగించుకొని యున్నచో ఈ ఉర్దు విశ్వవిద్యాలయము కొంతవరకు అభిమానపాత్రమైయుండి యుండెడిది. మరియొక విషయమీ సందర్భమున గమనించదగియున్నది. ఉర్దు రాజభాషగ నుండినంత మాత్రమున ఉర్దుకే అధిక ప్రాధాన్య మొసగబడినది. పాఠ్య ప్రణాళికయందు ప్రాంతీయ భాషలను నిర్బంధ పఠనీయములుగ గుర్తించియున్నచో విశ్వవిద్యాలయమువారి కృషి ఇంకను అధికముగ సఫల మగు అవకాశ ముండెడిది. కాని వారు ప్రాంతీయభాషలు ఐచ్ఛికముగా మాత్రమే పఠనార్హములని నిర్ణయించిరి. ఈ విధముగ ప్రాంతీయ భాషలకు అప్రాధాన్యము కొసగుచు చిన్న చూపు చూచినందున, ఈ కృషి యంతయు రాష్ట్రములోని అధిక సంఖ్యాకులకు విరుద్ధముగా తోచెను. 'అనువాద ప్రచురణశాఖ' యొక్క స్థాపనా నంతరము, గ్రంథ ప్రకటనానంతరము, ఉస్మానియా మెట్రికు తరగతులు ప్రారంభింపబడినవి. దారుల్ ఉలూమ్ విద్యాలయమున ప్రప్రథమమున మెట్రిక్ పరీక్ష 1918 లో జరిగినది. విద్యాలయములందు ఉస్మానియా మెట్రికుతో పాటు మద్రాసు విశ్వవిద్యాలయ ప్రణాళిక ననుసరించి ఆంగ్ల భాషలో, హెచ్. ఎస్. ఎల్. సి. పరీక్షకు చదువు అవకాశము కల్పింపబడినది. ఉన్నత పాఠశాలలు అటు తర్వాత ఎన్నియో నెలకొల్పబడినవి. క్రమాభివృద్ధి నొందు చున్న విద్యార్థుల సంఖ్య ననుసరించి ప్రైవేటు పాఠశాలలకుకూడ అనుమతి లభించినది.

ఉస్మానియా మెట్రికు పరీక్షలందు ఉత్తీర్ణులైనవారికి విశ్వవిద్యాలయ తరగతులందు ప్రవేశించుటకును, ఉన్నత విద్య నభ్యసించుటకును తత్ క్షణమే ఏర్పాట్లు ఓనర్చబడినవి. ప్రారంభదశయందు ఇంటర్మీడియటు, బి.ఏ. తరగతులు ప్రస్తుతము స్టేటుబ్యాంకుగల ఆవరణముననున్న కొన్ని భవనములందు ఏర్పాటుచేయబడినవి. అడిక మెట్టు ప్రాంతమున విశ్వవిద్యాలయ భవన నిర్మాణము జరుగు వరకు ఈ తాత్కాలిక భవనములందే విద్యాబోధనము జరుగుచుండెను.

అటు తర్వాత ఈ తరగతులు విశ్వవిద్యాలయ ఆవరణమునందలి తాత్కాలిక భవనములకు మార్చబడినవి. ప్రభుత్వము వారు హైదరాబాదు నగరమునకు తూర్పున నాలుగుమైళ్ళ దూరముననున్న రెండువేల ఎకరముల