Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/328

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము -౨

ఉష్ణోగ్రత


పంపివేయును. అవి భూమిమీద పడుటవలన భూమి ఎక్కువగా చల్లబడదు. అందువలన గాలిలో నీటియావిరి తక్కువ ఉన్న యెడల కనిష్ఠ గరిష్ఠ ఉష్ణోగ్రతల తారతమ్యము ఎక్కువగా నుండును. చలికాలములో సాధారణముగా నీటియావిరి తక్కువగానుండును. అందువలన భూమి చాలా చల్లబడుటకు అవకాశము ఎక్కువగానుండును.

చలియెక్కువగానుండు ప్రదేశములలో ఒక్కొకప్పుడు భూమి యెక్కువ చల్లబడుటచే అక్కడి నీటియావిరి నీటి బిందువులుగా మారి మంచు ఏర్పడును. ఉష్ణోగ్రత ఇంకను తక్కువ అయినయెడల ఆవిరి గడ్డకట్టి గడ్డమంచు ఏర్పడును. ఇది పైరులకు చాలనష్టము కలుగజేయును. ఈ సమయములలో నేల గాలికంటే చాల ఎక్కువగా చల్ల బడును. అందువలన వాతావరణ శాస్త్రజ్ఞులు, గాలి యొక్క ఉష్ణోగ్రతను, భూమి యొక్క ఉష్ణోగ్రతను వేరువేరుగా కనుగొందురు. భూమియొక్క కనిష్ఠ ఉష్ణోగ్రతను గడ్డియొక్క కనిష్ఠ ఉష్ణోగ్రత (Grass - minimum) అని వేరుగా పిలుతురు.

సముద్రతీరములందలి శీతోష్ణస్థితి: సముద్రతీరములందు గాలిలో నీటియావిరి ఎక్కువగా నుండుటచే అక్కడ గరిష్ఠ, కనిష్ఠ, ఉష్ణోగ్రతల తారతమ్యము చాల తక్కువగా నుండును. పగలు ఎక్కువ వేడిగా గాని రాత్రి ఎక్కువ చల్లగా గాని ఉండదు. వేసవిలో వేడి ఎక్కువగానుండదు. శీతకాలములో శీతలము ఎక్కువగానుండదు.

ఈ ప్రదేశములలో పగటి వేళ భూమి, సమీపమున నున్న సముద్రముకన్న ఎక్కువ వేడెక్కుటచే నేలమీదిగాలి వేడెక్కి, తేలికయై పైకిపోవును. ఆ ప్రదేశమును ఆక్రమించు కొనుటకై సముద్రమునుండి 'గాలి నేలమీదికి వీచును. ఈ సముద్రపు గాలివలన వేసవిలో వేడివలన బాధ కొంతతగ్గును.

నీటి యావిరివలన పైన చెప్పిన లాభములే కాక ఒక ముఖ్యమైన నష్టము కూడ ఉన్నది.

తడివేడి - పొడివేడి : ఒక ఉష్ణమాపకపు బుంగమీద ఒక పలుచని గుడ్డను చుట్టి దానిని కొంచెము తడిచేసిన యెడల నెమ్మదిగా పొదరసము క్రిందకు దిగుట కాననగును. గుడ్డను అంటియున్న నీరు ఆవిరిగా మారుచుండును. ఇట్లు నీరు ఆవిరిగా మారుటకు శక్తి కావలెను. ఈశక్తిని చుట్టుప్రక్కలనుండు గాలినుండి నీరు తీసికొనుటవలన గాలి యొక్క వేడి తగ్గిపోవును. కూజాలోని నీరు చల్లగా నుండుటకు, వేసవిలో తడకలమీద నీరు చల్లిన, చుట్టు ప్రక్కల నుండు గాలి చల్లబడుటకును ఇదే కారణము. ఉష్ణమాపకము చూపించు ఈ ఉష్ణోగ్రతను తడి ఉష్ణోగ్రత (Wet-Bulb. Temperature) అందురు. గాలిలో నీటి యావిరి తక్కువయినకొలది, నీటియావిరిని తీసికొనుశక్తి అధికమగుచుండును. అందువలన ఈ తడి ఉష్ణోగ్రత, పొడి ఉష్ణోగ్రత (అనగా తడిగుడ్డ చుట్టనప్పుడు ఉష్ణమాపకము చూపించు ఉష్ణోగ్రత) కంటే చాల తక్కువగా నుండును. అట్లుకాక, గాలిలో నీటియావిరి ఎక్కువగా నున్న యెడల ఈ రెంటి తారతమ్యము చాల తక్కువగానుండును. ఇదే కారణముచే గాలి తడిగా నున్నప్పుడు మన శరీరముమీది చెమట బిందువులకు ఆవిరిగా మారు శక్తి తక్కువగుట వలన, మనకు చెమట ఎక్కువగా పట్టును. కాని గాలి పొడిగా నున్న యెడల చెమట బిందువులు ఆవిరిగా మారుచుండుటచే అంత బాధాకరముగానుండదు, సముద్రతీరము లందు గాలి తడిగా నుండుటచే, ఉష్ణోగ్రత అంత ఎక్కువగా లేకపోయినను, ఉక్క ఎక్కువగానుండి బాధాకరముగా నుండును. గాలి పొడిగానున్న ప్రదేశములలో, వేడి ఎక్కువగానున్నను, తడితడకలు మొదలగు పరికరములవలన ఉష్ణోగ్రతను తగ్గించవచ్చును. ఉక్క బాధ ఎక్కువగా నుండదు.

వేడిగాడ్పులు, చలిగాలులు : ఎడారి ప్రదేశములలో వేసవి కాలమందు గాలి ఎక్కువగా వేడెక్కుటవలన తేలికయై పైకి పోవుచుండును. అందువలన అక్కడి వాయుపీడన శక్తి కూడ తక్కువగానుండి చుట్టుప్రక్కలనున్న గాలి అక్కడకు వచ్చుటకు ప్రయత్నించుటవలన గాడ్పులు కలుగుచున్నవి. ఈ వేడిగాడ్పులవలన ఉష్ణోగ్రత యొక్క బాధ ఎక్కువగును.

చలికాలములో తుఫానులవలన వాయు చలనము ఎక్కువగుచుండును. ఈ తుఫానులు ఉత్తరార్ధగోళములో పడమరనుండి తూర్పునకు పోవుచుండును. ఇట్లు పోవునపుడు, ఉత్తరముననున్న చలిగాలులను దక్షిణమునకు వ్యాపింపచేయుటవలన చలికాలములో ఒక్కొక్కప్పుడు అత్యంత శీతల వాయువులను కూడ చూచుట తటస్థించుచును.'