విజ్ఞానకోశము -౨
ఉష్ణోగ్రత
పద్దులో చేరు ఖర్చు ఉత్పత్తియైన శక్తికి అనురూపముగా నుండును. ఇది ముఖ్యముగా ఇంధనములు, నీరు, కందెన తైలము వెల, పనివాండ్ర వేతనములు అను వాటిపై ఆధారపడి యుండును.
సరఫరాచేయు కంపెనీ, ఈ మొత్తము ఖర్చును వినియోజకుల నుండి వసూలు చేయవలసియున్నది. సరఫరాచేసిన విద్యుత్తునకు వినియోజకులనుండి వెలను తీసికొనుట సుంకముల వసూలు (Tariff) అనబడును. ఈ వసూలు న్యాయమైనదిగా నుండవవలెను. అనగా, అది కంపెనీనుండిగాని వినియోజకునినుండిగాని అధికముగా వసూలు చేయబడకూడదు. ఇందు నిమిత్తమై రెండు భాగములుగల సుంకములపట్టి తయారుచేయబడినది. వినియోజకునిచే కోరబడిన విద్యుత్ ప్రమాణమునకు తగినట్లుండు స్థిరమైన వెల ఒక భాగమందును, వినియోజకుడు ఉపయోగించిన శక్తికి అనురూపముగా నుండు వెల మరియొక భాగమందును ఉండును.
మొత్తము ఖర్చు స్వల్ప సామర్థ్యముగలిగి ఆవిరిచే పనిచేయు స్థావరములు భరింపలేనంత హెచ్చుగా నుండును. పీడనముచే పనిచేయు (diesel) స్థావరములలో అది స్థాపిత పరిమితికి తగినదిగా నుండును. ఇంధనములకగు ఖర్చుకూడ తక్కువగా నుండును. కాని డీసెల్ స్థావరముల నిర్వహణమున కగు ఖర్చు ఎక్కువగా నుండును.
ముగింపు : నీరు లభించనిచోట ఉష్ణ విద్యుత్ ఉత్పాదక స్థావరములు (Thermal Power Stations)ఆవశ్యకము అగుచున్నవి. కాని, జలవిద్యుత్ స్థావరములలో పెద్ద పెద్ద విద్యుత్ శ్రేణులను ఉత్పత్తిచేయుట, ఆధునిక మగుపోకడ. అచట జలపాతశక్తి వినియోగింపబడి, అది దూరప్రదేశములకు హెచ్చు దుశక్మతలుగల ప్రసార రేఖలద్వారమున పంపబడును. ఈ దృష్టితో చూచినపుడు, ఉష్ణస్థావరముల ఆవశ్యకత ఉండదు. కాని, జలవిద్యుత్ స్థావరములలో సంవత్సరము పొడుగునను సమానముగా విద్యుత్ ఉత్పాదనము జరుగదు. ఎందుచేత ననగా కొన్ని ఋతువులలో తక్కువ నీరుండును, కొన్ని ఋతువులలో నీరు హెచ్చుగా నుండును. తక్కువ నీరు ఉండు ఋతువులలో విద్యుత్తును పరిపూర్తి చేయుటకు ఉష్ణ విద్యుత్ స్థావరములు కావలెను. అంతేగాక, బొగ్గుగనుల దగ్గర తక్కువ తరగతికి చెందిన బొగ్గు లభించుచోట్ల ఉష్ణస్థావరములను నిర్మించుట లాభకరము.
అందువలన పరమాణుశక్తిని ఉత్పత్తిచేయుట, సూర్యకిరణ ప్రసరణమును వినియోగించుట, ఫలవంతములగు నంత వరకు ఉష్ణస్థావరములు అభివృద్ధి చెందుటకు మంచి అవకాశము కలదు. మన దేశములోనున్న అన్ని జల విద్యుత్ స్థావరములు, ఉష్ణవిద్యుత్ స్థావరములు సక్రమముగా పరస్పర సంబంధము కలిగి విద్యుత్ జాలము (Power grids) లేర్పడినపుడు అన్ని శాఖలయందును పారిశ్రామిక అభ్యున్నతి వేగముగా కలుగగలదని మనము ఆశించవచ్చును.
కే. వి. పి. రం.
ఉష్ణోగ్రత (వాతావరణ సంబంధము)
ఒక ప్రదేశముయొక్క శీతోష్ణస్థితిని తెలిసికొనవలెనన్న, సంవత్సరము పొడుగునను అక్కడి వాతావరణము యొక్క ఉష్ణోగ్రత, గాలివేగము, వర్షపాతము మొదలయినవి తెలిసికొనవలెను. వీటన్నిటిలోను మానవుని సౌఖ్యము అక్కడి ఉష్ణోగ్రతమీద చాలవరకు ఆధారపడి యుండుట వలన, ఉష్ణోగ్రత దేనిమీద ఆధారపడియుండునో తెలిసికొనుట చాల ముఖ్యము.
ఒక ప్రదేశముయొక్క ఉష్ణోగ్రత (1) ఋతువుల మార్పులవలనను (2) వాతావరణము వలనను మారుచుండును.
ఋతువులు: భూమిమీద వేడి ముఖ్యముగా సూర్యరశ్మి వలననే గదా కలుగుచున్నది. మధ్యాహ్నమున సూర్యరశ్మి ఎక్కువగా నుండుట, ఉదయ సాయంకాలములందు తక్కువగానుండుట అందరును గమనించిన విషయమే. దీనికి కారణము. మధ్యాహ్నమున సూర్యుడు ఆకాశ మధ్య మందుండుటచే భూమిమీద సూర్యకిరణములు సూటిగాపడు చున్నవి. కాని ఉదయ సాయంకాలములందు పటవాలుగా పడుచున్నవి. ఇటులనే, భూమధ్య రేఖకు సమీవముగానున్న ప్రదేశములకు సూర్యకిరణములు సూటిగా తగులుటచే అక్కడ ఉష్ణోగ్రత హెచ్చుగానుండును. ధృవములవైపు పోవుకొలది వేడి తగ్గుచుండును. '