Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉష్ణగతి శాస్త్రము

సంగ్రహ ఆంధ్ర


ప్రతిగంటలోను అర్ధ రాత్రము మొదలు సూర్యోదయము వరకు కనిపించు ఉల్కల సంఖ్య సూర్యాస్తమయమునుండి అర్ధరాత్రమువరకు కనిపించు సంఖ్యకు రెట్టింపు ఉండునని గుర్తించినారు. భూమి తనచుట్టుతాను తిరుగుచున్నపుడు సూర్యుని చుట్టుతిరుగు ఉల్కలు, భూమిమీదనుండు పరిశోధకునకు అర్ధరాత్రము మొదలు మిట్ట మధ్యాహ్నము వరకు ఎదురుగాను, మిట్టమధ్యాహ్నమునుండి అర్ధ రాత్రమువరకు ఒకేవైపునకు తిరుగుచున్నట్టు కనిపించును. ఎదురుగా నున్నప్పుడు అన్ని రకముల ఉల్కలలో ఎక్కువ వేగముతో పోవుచున్న వాటిని తక్కువ వేగముతో పోవుచున్న వాటినికూడ పరిశోధకుడు చూచును. ఒకేవైపున పోవునపుడు, భూమి తిరుగు వేగముకన్న ఎక్కువ వేగముతో పోవుచుండు ఉల్కలు మాత్రము పరిశోధకునకు కనిపించును. అందువలన అర్ధరాత్రమునుండి మిట్ట మధ్యాహ్నమువరకు నుండుకాలములో భూమిమీద ఎక్కువ ఉల్కలుపడుట గమనింపదగినది.

ఋతుక్రమ ఉల్కాపాతము: ఉల్క లసంఖ్య సమానముగా నుండక, అనుదినము మారుచుండును. అందు ఋతువు ఋతువునకు వ్యత్యాసము కనిపించుచుండును. ఒక్కొక్క రోజున ఆకాశమున ఒక ప్రదేశమునుండి వాన కురిసినట్లు ఒక పెద్ద ఉల్కా సమూహము వచ్చును. దీనిని "ఉల్కలజల్లు” (Meteoric Shower) అందురు. ఒక్కో కప్పుడు వేలకొలది, లక్షలకొలది ఉల్కలు ఒకేసారి కనిపించును. ఇవి అన్నియు సమాంతర రేఖలలోనే పయనము' చేయుచున్నను దూరమునుండి చూచుటచే మనకు ఒకే ప్రదేశమునుండి పయనించుచున్న ట్లగపడును. (సమాంతరముగా నుండు రైలుపట్టాలను ఒక వంతెనమీది నుండి చూచిన అవి దూరముపోయి కలిసికొన్నట్లు కనిపించునుకదా ! అట్లే.

సంవత్సరములో సుమారు. ఒకే రోజున ఈ (ఉల్కల) జల్లులు వచ్చును. జనవరి 2 వ. తేదీయందు కాలియము (డ్రేకన్) అనురాశినుండి వచ్చును. ఇట్లే ఏప్రెల్ 20. వ తేథియందు వైరా (స్వరమండలము) నుండియు, మే 6వ తేదియందు కుంభరాశినుండియు, జూలై 28 వ తేది యందు కూడ కుండ రాశినుండియు, అగష్టు 12 వ. తేది యందు యయాతి (పెర్సియస్) నుండియు, అక్టోబరు 20 వ. తేదియందు మృగశీర్ష (ఓరియన్) నుండియు, నవంబరు 14. వ. తేదియందు సింహరాశినుండియు, నవంబరు 24. వ. తేదియందు దేవయాని (ఆండ్రోమీడా) నుండియు, డిసెంబరు 10. ప. తేదియందు మిధునరాశి నుండియు వచ్చుజల్లులు నీటిలో ముఖ్యమయినవి. చిన్న చిన్న జల్లులు నేలకొలది కలవు.

లఘుగ్రహములవలె, తోకచుక్కలవలె, ఈ ఉల్కా సమూహములు కూడ సూర్యునిచుట్టు దీర్ఘవృత్తాకారములలో తిరుగుచుండునని హె. జి. న్యూటన్, జె.సి. ఏడమ్సు, అను వైజ్ఞానికుల పరిశోధనములవలన తెలియుచున్నది. భూకక్ష్యము ఉల్కాకక్ష్యము కలిసినపుడు ఉల్కలు భూమిమీద జల్లులుగా పడును.

ఉల్కల ఉత్పత్తి: యయాతి (పెర్సియస్) రాశినుండి వచ్చు ఉల్కలును క్రీ. శ. 1862 లో వచ్చిన "టటిక్" అను తోకచుక్కయు ఒకే కక్ష్యలో తిరుగుచున్నట్లు షియాపరేలి అను వైజ్ఞానికుడు తెలియపరచెను. తరువాత ఒపాల్జర్ అను విఖ్యాత శాస్త్రజ్ఞుడు, సింహరాశినుండి వచ్చు ఉల్కా సమూహము యొక్క కక్షయు, క్రీ.శ. 1866 లో వచ్చిన “టెంపెల్" అను తోకచుక్క యొక్క కక్షయు, ఒకటే అని గణించిచెప్పెను. తరువాత చాలమట్టుకు ఉల్కా సమూహము లన్నియు తోక చుక్కల దారులలోనే పోవుచున్నట్లు నిర్ధారణచేసిరి. ఈ పరిశోధనములు నాధారము చేసికొని ఉల్కలు తోకచుక్కల శిథిలఖండములే యని ఊర్టు అను హాలండ్ దేశ వైజ్ఞానికుడు నిర్ధారణ చేసేను.

ఎన్. రా.

ఉష్ణగతి శాస్త్రము :

ఉష్ణశక్తి పొందెడు మార్పులను వివరించెడు శాస్త్రమును ఉష్ణగతిశాస్త్రము అందురు. అనుభవమును బట్టి చెప్పిన కొన్ని ప్రతిపాదనలమీద ఈ శాస్త్రము ఆధారపడి ఉన్నది. ఆ ప్రతిపాదనలను పదార్థములలో జరుగు మార్పులకు అన్వయింప చేసి, మారిన పదార్థము ఈ విధముగ ఉండును, అని సిద్ధాంతరీత్యా సూచింపబడినది. ప్రయోగరీత్యా కనుగొనబడిన దానితో సమన్వయమగుట వలన, ఈ శాస్త్రమునకు బలము చేకూరినది. దానితో అనేక విధములైన మార్పుల పరిశీలనములకు ఉపయోగపడుచున్నది.