Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉభయచరములు

సంగ్రహ ఆంధ్ర


గలిగి కండరములతో (muscles) నిండిన గోడలు గలిగి యుండును. మీదిభాగపు గదులను కర్ణికలు (auricles) అనియు క్రిందిభాగమునందు పెద్దగది జఠరిక (Ventricle) యనివ్యవహరింపబడును. జఠరిక గోడలు స్పంజు (spongy) వలె నుండుటచే మలినరక్తము శుభ్రరక్తముతొ వీలైనంతవరకు వేరుగా నుంచుటకు వీలగును. శుభ్రరక్తము శ్వాసకోశముల నుండి ఎడమకర్ణిక (Left auricle) లోనికి, మలినరక్తము దేహము యొక్క వివిధ భాగములనుండి సిరల (veins) ద్వార కుడికర్ణిక (Right auricle) లోనికి గొనిరాబడును, కుడి ఎడమకర్ణికల నుండి రక్తము ఒకేద్వారము నుండి జఠరికను చేరును. ఇచట నుండి రక్తము ధమనుల ద్వారా దేహాద్యంతము వ్యాపింపచేయబడును. ఉభయచరములలో శ్వాసక్రియ శ్వాసకోశముల (lungs) తోబాటు చర్మము ద్వారా సయితము జరుగును. కావున గుండెకాయ లోపల జరుగు రక్తమిశ్రమమునకు (mixing of pure and impure blood in the ventricle) అంత ప్రాముఖ్యము నీయ నవసరము లేదు. వీనిరక్తము ఎరుపుగానుండి తెలుపు, ఎరుపు కణములలో (White and red blood corpuscles) నిండి యుండును. ఎర్రకణములు (Red blood corpuscles) అండాకృతి కలిగియుండును.

శ్వాసముండలము : ఈ తరగతియందు శ్వాసకోశములు యౌవనదశయందు శ్వాసాంగములుగ (Respiratory organs) పనిచేయును. నలికండ్లపాములలో నివి నామమాత్రమునకే యుండుటబట్టి శ్వాస సంపూర్ణముగ చర్మము ద్వారా జరుగును. శ్వాసకోశములు గుండెకాయ కిరుభాగములందుండి శ్వాసనాళము ద్వారా (trachea) ముఖకుహరము (buccal cavity) లోనికి తెరచును. వాయువు శ్వాసకోశములోనికి చేరినంతనే శ్వాసకోశముల గోడలయందున్న కేశనాళికల (capillaries) రక్తము వాయువునుండి ఆమ్లజనిని స్వీకరించి కర్బనద్వ్యమ్ల జనిదము (corbondioxide) ను విడచును. ఉభయచరముల శ్వాసనాళము (Trachea) చిన్నగదిని, పోలియుండును. ఇందులోనున్న సన్నని పురులను (cords) వాయువు మీటుటచే ధ్వని జనించును. ఈ విధముగా శ్వాసాంగములు సర్వాంగములుగ (sound producing organs) పనిచేయును. శ్వాసకోశములతో పాటు చర్మము, మరియు ముఖకుహరము (buccal cavity) అడుగుభాగము సైతము శ్వాసక్రియ సలుపుటయందు తోడ్పడును.

అస్థిపంజరము: ఉధయచరముల అస్థిపంజరము (skeleton) దృఢమైన ఎముకలతో నిండి యుండును. ఆధునిక ఉభయచరములంచు కపాలకుహరము (skull) ప్రాచీన ఉభయచరము లందువలె క్లిష్టమైనదిగాక చిన్నదై స్వల్ప సంఖ్యగల ఎముకలు గలిగియుండును. ఆధునికములలో కొన్ని భాగములు మాత్రమే విస్తృతమైయున్నవి. వెన్నెముక (back bone) కొన్ని ఉభయచరములందు నిడుపుగానుండును. కాని కప్పలందు తొమ్మిది వెన్ను పూసలు (vertebrae) మాత్రమే కలిగియుండును. అపోడా (Apoda) తప్ప అన్ని ఉభయచరములందు అంగములుండును. కప్పలయందు చేతులు గట్టిగాను, కురుచగాను ఉండి కాళ్ళు మాత్రము పొడవుగానుండును. ఈ ప్రకృతిసిద్ధమైన ఏర్పాటు దుముకుట కనుకూలమై యున్నది. నాలుగు కాళ్ళయందును దీనికి ఐదేసి వ్రేళ్ళుండును.

నాడీమండలము : ఉభయచరముల నాడీమండలము (Nervous system) చేపలకన్న అధిక అభివృద్ధి చెంది యున్నది. కపాలకుహరము (skull) నందు మస్తిష్కము నుండి పది జతల నాడులు బయలు దేరును. తొమ్మిది జతల నాడులు జ్ఞానేంద్రియములకు చివర ఒక జత శరీరములోని ఇతర భాగములందు వ్యాపించియుండును. వెన్నుపాము (Nerve Cord) యొక్క ముందు భాగము మస్తిష్కము నంటి యుండి వెన్నెముక (Vertebrae Column) మధ్యనాళమున చేర్చబడియుండును. ఈ వెన్నుపాము (Spinal Cord) నుండి సయితము పది జతల నాడులు బయలుదేరి దేహమంతయు వ్యాపించును. జ్ఞానేంద్రియములలో చెవి, కన్ను ముఖ్యమైనవి. ఉభయచరములందు బాహ్యకర్ణము ఉండదు. చెవి మధ్య భాగమున కాల్యుమెల్లా (Collumella) యనబడు నొక పొడవైన ఎముకయుండును. దీనిద్వారా. ధ్వని చెవి యొక్క అంతర్భాగమును ప్రవేశించును. తల ముందుభాగమున కన్నులుండును. కనురెప్ప వెండ్రుకలును, కనుబొమలును ఉండవు. కనురెప్పలలో క్రింది రెప్ప విస్తరించియుండి ఒక