విజ్ఞానకోశము - ౨
ఉపాధ్యాయుడు
దేహసౌష్ఠవమును, బలమును, వృద్ధిచెందించుటకై ప్రత్యేక శిక్షణ కేంద్రములును, వ్రాతకోతలు మున్నగునవి నేర్పుటకై వేరు పాఠశాలలును ఉండెను. పౌరధర్మములను నేర్చుకొనుటకై యువకులు, అధికారపదవు లందున్న పెద్దల కార్యకలాపములను శ్రద్ధతో, సవిమర్శముగ చూచుచుండిరి. గ్రీకులు తమ గురువులకు ప్రత్యేక గౌరవ మొసగినట్లు కన్పడదు. ఉపాధ్యాయ పదవి నవలంబించిన వారిలో పలువురు తమ వృత్తిని జీవనోపాధిగా మాత్రము భావించుచుండిరి. సోఫిస్ట్సు (Sophists)అనబడు బోధకులు గ్రీకు దేశ చరిత్రలో విఖ్యాతి గాంచిరి. వీరు ధనాపేక్షలో విద్యాప్రచారము కావించెడి వారు. అంతేకాక వారు బోధించెడివిద్య రాష్ట్రాభ్యుదయము కొరకు కాక, వ్యక్తి ప్రయోజనముల సాధించుటకొరకు మాత్రమే ఉపకరించెడిది. కావున వారు ప్రజాదరమును పొందలేదు. సోక్రటీసు, ప్లేటో, అరిస్టాటీలు అను మహావిజ్ఞానులు విద్య యొక్క ప్రయోజనములను గూర్చియు, త త్సాధనోపాయములను గూర్చియు లెస్సగ చింతించి, గ్రంథ రచనము కావించిరి. కాని వారి విద్యావిధానమునందు గురుశిష్య సంబంధమున కెట్టి విశిష్టస్థానమును లేదు. అయినను ఆకాల మునకూడ అచ్చటచ్చట ఉత్తమ గురుశిష్య సంబంధము లేకపోలేదు. విజ్ఞానియగు సోక్రటీసునకు పలువురు శిష్యు లుండిరి. వారు తమగురువును మిక్కిలి గౌరవించెడి వారు. వారిలో ప్లేటో ఒకడు. పాశ్చాత్య బాదరాయణుడగు అరిస్టాటిలు ప్లేటో యొక్క శిష్యుడు. జగదేక వీరుడగు అలెగ్జాండరు అరిస్టాటిలునకు శిష్యుడు. ఇట్టి అసామాన్యవ్యక్తులు గ్రీకు ప్రపంచముననుండినను, గ్రీకు దేశమునందలి ఉపాధ్యాయులకు ప్రత్యేక గౌరవము లభించినట్లు తెల్పుటకు వీలుపడదు. గ్రీకు విద్యావిధానమునకును, రోమనుల విద్యావిధానమునకును విశేషభేదము లేదు. రోమనులు గొప్ప కార్యశూరులు. కావున వారు విద్యావ్యాప్తికై సంస్థల నేర్పాటు కావించిరి. ఆదికాలమున రోమను సంఘమునందు తండ్రియే కుమారునకు గురువు. తల్లికికూడ ఇంచుమించు ఇట్టి గౌరవమే లభించియుండెను. తండ్రి కుమారుని నీతిప్రవర్తనమును సరిదిద్ది, ఇంచుక వ్రాతకోతలు నేర్పి, ఈడు వచ్చిన వెనుక వీరోచితమగు శిక్షణము నొసగుచుండెను. ఈశిక్షణమున కంతకును లక్ష్యము ఉత్తమ పౌరులను సిద్ధపరచుటయే. ధనాధికులగువారు తమ కుమారులకు పై విధమగు శిక్షణము నొసగుటకై ఉపాధ్యాయులను నియమించుచుండిరి. ఈ ఉపాధ్యాయుడు గృహమందలి ఇతర భృత్యులలో నొకడుగ భాపింపబడుచుండెను. క్రీ. పూ.150 ప్రాంతమున రోమనులు గ్రీకురాజ్యమును జయించిరి. ఆనాటినుండియు గ్రీకుల ప్రభావము రోము నాగరకతపై ప్రసరించెను. బాలుర విద్యాభివృద్ధికై ప్రాథమిక పాఠశాలలు, గ్రామరు స్కూల్సు అనబడు ఉన్నత పాఠశాలలు, రెటోరికల్ స్కూల్సు అనబడు ప్రౌఢ విద్యాశాలలును ఏర్పడెను. ఉన్నత పాఠశాలలలోను, ప్రౌఢవిద్యాలయములలోను, గ్రీకులు ఉపాధ్యాయులుగనుండి, విద్యాబోధనము చేయుచుండిరి. వీరికి మంచి వేతనములును, సంఘమున గౌరవస్థానమును లభించుచుండెను. రోమక చక్రవర్తులు ఉపాధ్యాయులకు హెచ్చు వేతనము లేర్పాటు కావించి వారిని గౌరవించుచుండిరి.
క్రైస్తవమతము ఐరోపా ఖండములో క్రమముగ వ్యాపించెను. తత్ఫలితముగ ప్రజా సామాన్యమునకు విద్యాబోధనము కావించు భారము క్రైస్తవమత సంఘములే వహింపసాగెను. పట్టణములలోని ప్రతి క్రైస్తవ దేవాలయమునకును అనుబంధముగ పాఠశాలలు వెలసెను. వీటికి కాతెడ్రల్ స్కూల్సు అని పేరు. ఇవికాక అనేక ముఖ్య ప్రదేశములలో మఠముల (Monasteries) కు సంబంధించిన పాఠశాలలు కూడ నెలకొనేను. ఇందుకైస్తవ సన్న్యాసులు విద్యార్థులకు మత విషయములు, గ్రీకు ల్యాటిను భాషలు, వ్యాకరణము మున్నగునంశములను బోధించెడివారు. వీరు తమ కాలమునంతను గ్రంథపఠనము నందును, ఉత్తమ మతగ్రంథములకు ప్రతులు వ్రాయుట యందును, కొన్ని ఉద్గ్రంథములకు వ్యాఖ్యానములు రచించుటందును వ్యయపరచెడివారు. వీరు ధనాపేక్షను విడచి, పవిత్రజీవితమును గడపుచు, క్రైస్తవసంఘమును సేవించుచు కాలము పుచ్చుచుండిరి. వీరాకాలమునాటి ప్రజలకు గురువులు. ఆ కాలమున ఐరోపా ఖండమునందు సంఘములో వివిధవృత్తుల నవలంబించు పనివాండ్రును, ధనాధికులును ఉన్నత వంశ సంజాతులునగు వీరపురుషు