ఉపాధ్యాయుడు
సంగ్రహ ఆంధ్ర
ఇవియన్నియు లౌకిక విద్యలే. వీటి ప్రశంస శుక్రనీతి సారము, వాత్స్యాయన కామసూత్రములు, బౌద్ధగ్రంథమగు లలితవిస్తరము, జైనగ్రంథమగు సమవాయ సూత్రము మున్నగు గ్రంథములందు కాననగును.
ప్రాచీనకాలమునందు అనగా క్రీ. పూ. 2000 సం॥ ల ప్రాంతమున అనాటి నాగరక దేశము లన్నిటియందును కూడ గురువునకు సంఘమున విశిష్ట స్థానము లభించియుండెను, బాబిలోనియాలో, అస్సీరియాలో, చీనాలో, ప్రాచీనకాలము నాటి ఐర్లాండు, అమెరికాదేశములందలి ఎఱ్ఱఇండియను జాతులలో ఉపాధ్యాయునికి గొప్ప గౌరవము లభించుచుండెనని తెలియుచున్నది.
ఉపాధ్యాయుడు సంఘమందలి సామాన్య జనులకు అన్ని విషయములందును నాయకుడుగ నుండెడివాడు. ఇది సహజమగు స్థితి. ఉపాధ్యాయుడు సామాన్యులగు వారికి తెలియని అనేక విషయముల నెరిగి వ్రాయుట, చదువుట నేర్చియుండెడివాడు. నిరక్షరాస్యత సర్వత్ర ప్రబలియుండిన ఆకాలమున, అక్షరములు చదువగల్గిన వాడు ఒక విశిష్ట వ్యక్తిగ భావింపబడుచుండుట సహజము కదా ! బ్రిటను, ఫ్రాన్సు వంటి నాగరక దేశములలో కూడ మధ్యయుగము నందు పుస్తకములు చదువ నేర్చిన వారి నందరను మాంత్రికులుగానో, పిశాచ గణగతులుగనో పామరులు భావించు చుండిరట! అనగా వారు సామాన్య మానవులు కారని వారి భావము. కావున అతి ప్రాచీన కాలములో ఉపాధ్యాయునకు ప్రపంచమం దెల్లెడల ప్రత్యేక గౌరవము లభించుచుండుటలో నాశ్చర్యములేదు.
భారతీయ విద్యారంగమును వీడి పాశ్చాత్యరంగమును పరామర్శించునప్పుడు, ఈ రెంటికిని గల గొప్పభేదము నించుక గమనింపవలసి యుండును. ప్రాచ్య (భారతీయ) సంప్రదాయమునందు విద్య యనగా పరబ్రహ్మమును తెలియజేయు జ్ఞానమని ముఖ్యార్థము. (“వేత్తి అనయా ఇతి విద్యా") తదితర లౌకిక విద్యలు ద్వితీయ శ్రేణికి చెందినవి. భారతీయు లిహమును, పరమును మేళవించి తత్సంయోగమును జీవితముగ భావించిరి. జన్మమును, మృత్యువును ఒకే సూత్రము నకు గల రెండు కొనలుగా వారు పరిగణించిరి. ఇహజీవిత మతి చంచలమైనది. దీనినే సంపూర్ణముగ నమ్మియుండుట పొరపాటు. పరమే మానవునికి శాశ్వతమైనదని వారి దృఢ విశ్వాసము. కావున పరమునందలి శ్రేయస్సు కొరకే ఎక్కువగ కష్టించవలెను. పాశ్చాత్య విద్యావిధానమునం దట్లుకాక ఐహిక విషయములకే ప్రాముఖ్యము మెండు. అంతేకాదు. ప్రాచీన కాలమునాటి భారతీయాచార్యులు గొప్ప పండితులై యుండుటయే గాక జీవిత పరమార్థమును గ్రహించిన మహనీయులు. అందువలన వారికి అసామాన్యమగు గౌరవ మొసగబడుచుండెను. పరమేశ్వరుడు సర్వవ్యాపి కావున ఆయనను ప్రపంచము నందలి సర్వజీవులందును సర్వవస్తువులందును కాంచనగును. భారతీయవిద్యార్థి తన గురువునందు పరమేశ్వర సాక్షాత్కారమును గాంచుచుండెను. కావున భారతీయ సంప్రచాయమున గురువునకొక విశిష్టస్థాన ముండెను. పాశ్చాత్య సంప్రదాయమున గురువునకీ విశిష్టతలేదు. కొన్ని లౌకిక ప్రయోజనములను సాధించుటకు మాత్రమే గురువు మనకు సాయపడును. అతడుకూడ విద్యార్థివలెనే మానవ మాత్రుడు. ఈ విభిన్న దృక్పథములే ప్రాచ్యపాశ్చాత్య విద్యావిధానములందలి మౌలిక భేదములకు కారణము.
యూదులు జన్మచే ప్రాగ్దేశీయులైనను వారి భావములు పాశ్చాత్యవర్ణరంజితములు. జాతీయభావ ప్రబోధము, నైతిక వర్తనము నలవరచుట వారి విద్యా లక్ష్యములు ఈ లక్ష్యముల కనువగునట్లు వారు తమ ప్రణాళికలను నిర్మించుకొనిరి. కుటుంబమునకు పెద్దయగు తండ్రియే బాలకునికి ప్రథమ గురువు. ప్రప్రథమమున Synagogues అనబడు యూదు దేవాలయముల కంగములుగ పాఠశాలలు స్థాపింపబడెను. అందు వ్రాయుటయు చదువుటయు లెక్కలు చేయుటయు ఏదైన ఒక వృత్తి విద్యయు నేర్పబడుచుండెను. పిదప ప్రతి గ్రామ మందును ఒక పాఠశాల నెలకొల్పబడెను. విద్యార్థులకు బోధనము కావించువారు యూదు ధర్మమును చక్కగ నేర్చిన వ్రాయసగాండ్రు (Scribes) అను గురువులు. ఈ గురువులు శిష్యులకు ధార్మిక విద్యను, వృత్తివిద్యను కూడ కరపుచుండిరి. యూదులు గురువును గౌరవభావముతో మన్నించుచుండిరి. మానవుని సర్వతోముఖాఖి వృద్ధిని సాధించి తన్మూలమున రాష్ట్రాభ్యుదయమునకై పాటుపడుట గ్రీకుల విద్యాలక్ష్యము. గ్రీకురాష్ట్రములలో