ఉపాధ్యాయుడు
సంగ్రహ ఆంధ్ర
శిష్యు లిరువురి సహకారమువలననే సాధ్యము అను సంశముపై ప్రాచీనగ్రంథమునందు సూచితము.
ప్రాచీన భారతీయులు గురుశిష్యుల కుండవలసిన సంబంధమును గూర్చి నియమములు కావించిరి. తల్లియు,తండ్రియు, ఉపనయనము కావించినవాడును, విద్యాభ్యాసము చేయించిన వాడును గురువులు. వేదమును సంపూర్ణముగ చదివించినవాడు ఆచార్యుడు.అందు కొంతభాగమును మాత్రమే నేర్పినవాడు గురువు. ఉపనయనము జరిగిన తరువాత శిష్యుడు గురుకులవాసము చేయుచు, భిక్షాచరణమువలన ఉదరపోషణము కావించుకొనుచు, వినయవంతుడై గురువునకును, తత్పత్నికిని సేవ చేయుచు, గుర్వనుగ్రహమును వడసి విద్యాలాభమును పొందవలెను. విద్యార్జనము కావించునప్పుడు బ్రహ్మచర్య నియమములను కఠినముగ పాలింపవలెను. భోగముల పొంతకు పోరాదు. గురువు శిష్యునికి మంచిమాటలతోనే బోధింపవలెను. అవసరమగు నెడల బెదరింపవలెను. కొన్ని సందర్భములలో గురువు శిష్యుని త్రాటిలో కాని వెదురు బెత్తముతో కాని శిక్షింపవచ్చును. అంతకుమించి శిష్యుని దండించు గురువు రాజదండనమునకు పాత్రుడగును. ఇవి శాస్త్రకారుడగు గౌతముడు పేర్కొనిన నియమములు, మనువు కూడ గౌతమునితో ఈ నియమ విషయ మున నేకీభవించుచున్నాడు.
గురువు సాధారణముగ నున్నత వంశ సంజాతుడై ఉండవలెను. విద్యార్జనమును, ప్రవచనమును, అతనికి వంశాను గతములై యుండవలెను. గురువు ధర్మానుష్ఠాన పరుడు కావలెను. ఈతడు శిష్యునియందలి వాత్సల్యముచే ఆతనికి విద్యాదానము చేయవలయును. మరుగుపరచక తా నెరిగిన అంశముల నన్నిటిని గురువు శిష్యునకు బోధింపవలెను. ఉత్తముడగు గురువు (ఆచార్యుడు) ధనలాభము కొరకై విధ్యాబోధనము కావింపడు. ధనమును స్వీకరించి విద్యను బోధించువాడు ఉపాధ్యాయుడని మనువు మున్నగువారు అభిప్రాయపడిరి. ఆచార్యునికి శిష్యుని వలవ శుశ్రూషపొందుట కధికారము కలదు. అయినను అట్టి అధికారమును దుర్వినియోగము కావించుట కాని, శిష్యుని యొక్క విద్యాభ్యాసమునకు భంగము కల్గువిధముగ శుశ్రూషకొనుట కాని గురువున కెంతమాత్రము
తగదు. శిష్యుని నైతికౌన్నత్యముకొరకు మాత్రమే గురు శుశ్రూష విధింపబడినది. విద్యాభ్యాసము పూర్తియైన వెనుక శిష్యుడు గురువునకొసగు దక్షిణ లాంఛనప్రాయము. అది ధర్మ్యమార్గమున సంగ్రహింపబడవలయును. శిష్యుడు గురువున కొసగు దక్షిణ ఆవు, గుఱ్ఱము, ఛత్రము, పాదుకలు, ధాన్యము, కూరగాయలు మొదలగువాటిలో నొక రూపములో నుండ వచ్చును. నిజమునకు విద్యాదానమునకు ప్రతిఫలములేదు. గురువు పేదవాడై శిష్యుడు సమర్థుడైన పక్షమున, శిష్యుడు తన అవసరములకొరకై వలయుసంభారములను తెచ్చుకొని గురువు కుటుంబములో నొక్కడుగ నివసింపవచ్చును. విద్యాభ్యాసము పూర్తి కావించుకొని స్వగృహమునకు మరలిపోవు శిష్యు నుద్దేశించి, ఆచార్యుడు కావించు అనుశాసనము తైత్తిరీయోపనిషత్తునశిక్షావల్లి యందు వర్ణింపబడినది. ఇయ్యది ఉత్తమమగు నాదేశము,
కొన్ని సందర్భములలో విద్యార్థి తన ఇంటి కడనే తండ్రి వలననో, తాత వలననో, లేక తదితర సమీప బంధుపుల వలసనో విద్యార్జనము కావింపవచ్చును. ఆపద్ధర్మము క్రింద బ్రాహ్మణేతరుడగు గురువు కడ విద్యార్థి జ్ఞాన సముపార్జనము కావింపవచ్చును. గురు కులమువాడై నను శిష్యునికి పూజ్యుడే.
ఎట్టి సందర్భమునందును అనర్హుడగు శిష్యునికి విద్యాబోధనము కావింపరాదని ప్రాచీన భారతీయులు గురువును పౌనఃపున్యముగ శాసించిరి. ఈ యంశమునే శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీత యందు తెల్పియున్నాడు. గీతాబోధ నము కావించి తుట్టతుదకు శ్రీకృష్ణుడు అర్జునునితో ఇట్లనెను.
ఇదం తే నాతపస్కాయ నాభక్తాయ కదాచన
న చాశుశ్రూషవే వాచ్యం నచ మాం యో భ్యసూయతి.
ఈ గీతా రహస్యమును తపస్వి కానివానికిని, భక్తిశ్రద్ధలు లేనివానికిని, గురు శుశ్రూష చేయనివానికిని, పరమేశ్వరుని చూచి అసూయపడు వానికిని తెలుపగూడదు అని దీని భావము. ప్రాచీన కాలికులగు గురువులు తమ వద్దకు వచ్చు విద్యార్థుల అర్హతను పరీక్షించిన మీదటనే వారికి జ్ఞానదానము చేసెడివారు.