ఉద్యాన కృషి
సంగ్రహ ఆంధ్ర
మొదలగు ప్రాంతములందును విస్తారముగనున్నవి. ఇవి వట్టి బంక నేల లగుటచేతను, వీనియందు చెట్ల వేళ్ళు బాగుగా లోతునకు దిగక పోవుట చేతను, పండ్లతోటల పెంపకమునకు అనుకూలింపవు. మరియు ఈ నేలలు ఎండినతరువాత బీటలుతీయు స్వభావము కలిగియుండుటచే చెట్లకు నష్టము కలుగును. తెల్లకంకర నేలలు లేక సున్నపు నేలలు, చవిటి నేలలు పండ్లతోటలకు అనుకూలములు గావు. కాని, నీరు బాగుగా ఇంకు, తేలికైన నల్లగరుప నేలలందు మోసంబి, సాత్కుడి, లేక బత్తాయి, నిమ్మ, జామి, లక్ష్మణాఫలము మొదలగు జాతులను పెంచదగును. ఫలవృక్షములను తోటలయందేగాక, భవనముల ఖాళీప్రదేశములందును, గోడల ప్రక్కలందును, రహదారుల యొక్కయు కాలువగట్ల యొక్కయు ప్రక్కలందును నాటవచ్చును. ఇట్లు నాటుటకు కొబ్బరి, బొప్పాయి, పనస, చింత, మామిడి, జీడిమామిడి, నేరేడు మొదలగు జాతులు అనుకూలములు.
2 వ పటము
గృహోపవనమునందలి పూలమడి నమూనా
తోట పెంచుటకు ఏర్పాట్లు: తోటను పెంచు స్థలము ఎత్తైన సమతల ప్రదేశము కలదిగా నుండవలెను. తీవ్రముగా వీచు గాలులనుండి రక్షణము నొనగుటకు, మొక్కలను నాటుటకుముందే తోటచుట్టును ఎత్తుగా పెరిగి చిరకాలముండు మామిడి, సరుగుడు మొదలగు చెట్లు నాటవలెను. తోటను పశువులు, మేకలు పొడుచేయకుండ కాపాడుటకు తోటచుట్టును మంచి కంచెను నాటుట అవసరము. ఇందులకు తెల్ల తుమ్మ, సీమచింత, కిత్తనార, నేపాళము, చిల్లకంప మొదలగు వానియొక్క విత్తనములనుగాని కొమ్మల యొక్క ఖండములనుగాని రెండు వరుసలలో నాటవలెను. తోటను పెంచు ప్రదేశమును ముందుగా కొలిచి, ఎత్తు పల్లములను చదును చేసినతరువాత అనుకూలమగు భాగములుగా విభజింపవలయును. తోటలోని బాటలు చక్కగా నుండుటయు, తోట చదరముగాను ఇమిడిక గాను ఉండుటయు ముఖ్యవిషయములు. బాటలు, నీటికాలువలు ఏర్పాటుచేయునపుడు నీరు సులభముగా ప్రతిభాగమునకును పారు నవకాశమును కలిగియుండునట్లు చూడవలెను. తోటలకు కావలసిన నీరు సరఫరాచేయుటకు తగిన మంచినీటి బావులుండవలెను. తొట యొక్క విస్తీర్ణము, నీటి సౌకర్య మున్నంతవరకే పరిమితము కావలెను. తోటయండు బావులకు దగ్గరగా నీరు ఎక్కువగా కోరు అరటి, బొప్పాయి, నారింజ, జాతులను, కొంచెము దూరముగా మామిడి, జామ, సపోటా మొదలగు జాతులను నాటవలెను.
చెట్లు నాటుదూరము : పండ్ల మొక్కలను చాల తక్కువ దూరముగ నాటిన యెడల చెట్లు పెద్దవైన తరువాత వానికి తగినంత సూర్యరశ్మి, నీరు లభించక పోవుటచే తగుఫలితము కలుగదు, భూమిలో చెట్ల వేళ్ళు, నీరుకొరకు, ఆహారము కొరకు చాల వేగముగా విస్తరించును. సాధారణముగా చెట్ల యొక్క కొమ్మలు బయట యెంతఎత్తునకు వ్యాపించి పెరుగునో వేళ్ళుగూడ భూమిలో అంత లోతునకుగాని అంతకంటే ఎక్కువ లోతునకుగాని వ్యాపించును. చెట్లు అనేక సంవత్సరములు మనవలసిన వగుటచే అవి 10-15 సంవత్సరములు పెరిగినతరువాత ఎంతవరకు వ్యాపింపగలవో దానికి తగినంత నీరు, వెలుతురు, ఆహారము లభించుటకు మధ్య ఎంతెంత దూరముండవలెనో, వానిని నాటునప్పుడే నిర్ణయింపవలెను. మొక్కలను చదరపు పద్ధతిలో నాటుటయే ఉత్తమము, వివిధ ఫలజాతులను చదరపు పద్ధతిని నాటదగిన దూరములు ఈ క్రింద నీయబడినవి.
| 1. | మామిడి | 40 | అడుగులు |
| 2. | నిమ్మజాతులు | 20-30 | అడుగులు |
| 3. | సపోటా | 30 | అడుగులు |
| 4. | జామి | 25 | అడుగులు |
| 5. | ద్రాక్ష | 24 | అడుగులు |
| 6. | లక్ష్మణాఫలము | 20 | అడుగులు |
| 7. | బొప్పాయి | 8-10 | అడుగులు |
| 8. | అరటి | 6-8 | అడుగులు |
| 9. | ఫాల్సా | 4-6 | అడుగులు |
| 10. | కొబ్బరి | 24 | అడుగులు |
| 11. | అంజూర | 8 | అడుగులు |
| 12. | దానిమ్మ | 15 | అడుగులు |