Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉద్దేశాత్మక మనస్తత్వవాదము

సంగ్రహ ఆంధ్ర


వము (experience) వలనను ప్రాథమిక ప్రోద్బలములు పరిణామము చెంది నూతన గమ్యములను చేర్చును. లేదా నూతనమార్గమున గమ్యములను చేర్చును. అంతేకాని మూల ప్రోద్బలములు మారవు. ఎప్పుడు పోరాడుట, ఎట్లు పోరాడుట అనునవి విజ్ఞానమువలన పరిణామము పొందునే కాని కోపము వచ్చినప్పుడు పోరాడుట అను గమ్యము మారిపోక నిలిచియేయుండును.

కాలక్రమమున ఈ ప్రాథమిక ప్రోద్బలములు మిళితములై ఒక్కొక్క పదార్థముపై కేంద్రీకరింపబడి మానవత్వమునకు అత్యవసరమైన అభిమానములు (Sentiments) గా మారుచున్నవి. లింగేచ్ఛయును, మాతృప్రేమలో ఇమిడియున్న పరిరక్షక వాంచయును (Protective tendency) కలిసి ఒక పురుషునికి ఒక స్త్రీపై ప్రేమ అను భావముగా రూపొంది మానవత్వమునకు దోహద మొనర్చుచున్నవి. దేశభక్తి కూడ ఇట్టి భావము అనియే చెప్పవచ్చును, ఇందు కొన్ని ప్రాథమిక ప్రోద్బలములు చేరియున్నవి. దేశము ప్రమాదములో నున్నపుడు భయము కలుగును. ఇతరులు తన దేశముపై దండెత్తునపుడు కోపము కలుగును. తన దేశమును ఇతర దేశములకన్న మిన్నగా చేయవలెనను ఆశయముచే స్వాధి స్థానత (self-assertiveness) జనించును. ఇవన్నియు ఏకమై అతనిలో దేశభక్తి (Patriotism) అను అభిమానమును జనింప జేయుచున్నవి. కావున మాగ్డూగల్ వాదము ననుసరించి సంఘ వ్యాపారములో అభిమానము కేవల మొక ప్రాథమిక ప్రోద్బలముచే కాక వాటి కలయికచే ఏర్పడుచున్నది. అదియే ప్రాముఖ్యమును వహించుచున్నది. ఆ అభిమానము లేనిచో మానవత్వమే లేదని చెప్పవచ్చును. ఉదా॥ మానవులలో సంఘ ప్రియత్వము కలదని మనకు తెలియును. కేవలము ప్రాథమిక ప్రోద్బలముగానే ఉండినచో అది మానవులను గుంపులుగా నుంచగలదేగాని, వారిని కలసిమెలసి ఘనకార్యములు చేయు వారినిగా చేయజాలదు. మరల సంఘజీవితము గూడ ప్రాథమిక ప్రోద్బలములను క్రమపరచి వాటిని సంఘాపయోగకరములనుగా మార్చుచున్నది. ఇది మాగ్డూగల్ చే ప్రతిపాదింపబడిన ఉద్దేశాత్మక మనస్తత్వ సిద్ధాంతము యొక్క స్వరూపము

ఇతర శాస్త్రవేత్తలు దీనిని ఆచరించిన విధము చూడదగినది. ఇది తొలుదొల్త సంఘ శాస్త్ర వేత్తలను (Sociologists) సమ్మొహితులను చేసెను. దీనిచే వ్యక్తి యొక్క స్వేచ్ఛను కాపాడవలసిన ఆవశ్యకము వారికి వ్యక్తమయ్యెను. ప్రాథమిక ప్రోద్బలజనితములైన మానవుల కొర్కెలను గౌరవించుట సంఘము యొక్క విధి అనుభావము ప్రభలమయ్యెను. అవసరమైనచో ఈ ప్రాథమిక ప్రోద్బలములు స్వేచ్ఛ కొరకు మానవ సంఘమును పునర్నిర్మించవలేను అని కూడ భావింపబడినది. కాని ఉద్దేశాత్మక సిద్ధాంతమునకు అనుకూలమైన ఈ తీవ్ర సాంఘిక వాదము ఎక్కువకాలము నిలువ జాలకపోయెను. వ్యక్తి స్వాతంత్య్రము వలన సంఘమునకు ప్రమాదము వాటిల్లును అనుభయము కొందరికి కలిగెను. సంఘము వ్య క్తిని మార్చుచున్నది. కావున వ్యక్తి స్వేచ్ఛను కోరుట తగదు. వ్యక్తి తన భాషను, నడవడిని, ఆచార వ్యవహారములను సంఘము నుండియే అలవరచుకొనుచున్నాడు. అతడు సంఘముచేత తీర్చిదిద్దబడుచున్నాడు. వ్యక్తి ఏ సంఘ సంస్కృతితో జీవించుచు, గర్వపడుచున్నాడో ఆ సంస్కృతి, ఆ సంఘము పెట్టిన భిక్ష గాని అన్యము కాదు. సంఘము ముందు, వ్యక్తి తరువాత. మనము మానవులవలె జీవించుచుండుటకు కారణము సంఘము కాని వ్యక్తి యొక్క ప్రాథమిక ప్రోద్భల ప్రభావముకాదు.

పై విధమున విమర్శించిన వారిలో ముఖ్యుడు ఎల్. ఎల్. బెర్నార్డ్ (L. L. Bernard) అను సంఘశాస్త్రవేత్త. ఆతడు ప్రాథమిక ప్రోద్భల సిద్ధాంతము అనంగికార్యమని దానిని పూర్తిగా నిరాకరించెను. మనస్తత్వశాస్త్ర వేత్తలు అందరును మాగ్దూగల్ ప్రాథమిక ప్రోద్బలసిద్ధాంతమును సమర్థింపలేదు. థారన్ డైక్ (Thorndyke) అనునాతడును క్రియాత్మక సిద్ధాంత వాదమునకు మూలపురుషుడగు వాట్సన్ (Watson) అనునతడును ఈ సిద్ధాంతము అసంపూర్ణమని నిరాకరించిరి. వారి దృష్టిలో మానవజీవిత మందంతటను ఈ ప్రాథమిక ప్రోద్బలములు పనిచేయజాలవు. క్లిష్టమయిన మానవవ్యాపారము అభ్యాసముచే (Learning)సాధింపనగునుగాని ప్రాథమిక ప్రోద్బలముల చర్యవలన కాదు. మరియు పది ప్రాథమిక ప్రోద్బలజన్య