Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉద్భిజ్జవర్గీకరణము

సంగ్రహ ఆంధ్ర


matophyta) అనికూడా అనబడును. కాని కాలక్రమమున రూపాంతరము చెందిన కొన్ని కొన్ని ఫెరనులు(Ferns) కూడ నిత్తనములను ఉత్పత్తి చేయుచుండెను. అట్టి ఫెరనులనుండే పుష్పసహిత ఉద్భిజ్జములు పుట్టెనని తెలియుచున్నది.

పుష్పించు వృక్షములను వివిధ శాస్త్రజ్ఞులు వివిధ విధములుగా వర్గీకరించిరి. వీనిలో మొదటి విభజనము వృక్షము లలో గల ఆకారమునందలి పోలికలపై ఆధారపడి యున్నది. కాని నవీన సిద్ధాంతముల ప్రకారము వృక్షములను వాని సజాతీయ బాంధవ్యముల ననుసరించి కూర్చుట, ఉత్తమ పద్ధతిగా పరిగణింప బడుచున్నది. డార్విన్ సూత్రములను బట్టియు, శిలలపై కన్పడు వృక్షచిహ్నములను బట్టియు ప్రస్తుతపు జాతులన్నియు ప్రాచీన జాతులనుండే పుట్టినవను అంశము స్పష్టమగుచున్నది. వీని నన్నిటిని జాతియుక్తముగా చేర్చుటలో వీని వృద్ధి క్రమమునకును, నిర్మాణక్లిష్టతకును గల సంబంధము అనుసరింపబడెను. కాని కొన్నిటిలో నున్న సూక్ష్మత ఇదివరలో నున్న భాగములు తగ్గిపోవుటవలన కలిగినదనికూడ వారు గ్రహించిరి. వీరి వర్గీకరణములో చెట్ల జాతులను, శ్రేణులను క్రమముగా చేర్చుటకు ఎక్కువగా పుష్పభాగములలోను, ఫలములలోను, బీజములలోను, కణసంహతులలోను గనబడు అభివృద్ధి చిహ్నములు దృష్టిలో నుంచుకొనబడెను.

ఇట్లు ప్రయత్నించుటలో ఎంగ్లర్ ' అను ఆంగ్లేయ శాస్త్రజ్ఞుడు చెట్లను చాలవరకు పరిణామ క్రమముగా చేర్చగలిగెను. పుష్పించు వృక్షములలో కొన్ని, వాని బీజములను ఆకులవంటి అవయవములపై ఉత్పత్తి జేయును. వీనిలో పండ్లు ఉండవు. బీజములు పైకి కనబడుచుండును. వీనిని వివృతబీజవంతములు (Gymnosperms) అని యందురు. వివృత బీజవంతములను ఎంగ్లర్ నాలుగు తరగతులుగా విభజించెను.

(1) పైకడేలిస్ (Cycadales): వీనిలో బీజములపై సన్నని వెండ్రుకలుండును. కేసరములు శంకువు ఆకారముగా నమర్చబడియుండును. ఫలదళములు శంకువులుగా నుండవచ్చును; లేకపోవచ్చును.

(2) గింగోపలిస్ (gingoales): వీని బీజములపై సన్నని వెండ్రుకలుండును. కేసరములు కొన్నింటిలో ఒకటి, మరికొన్నింటిలో కొన్ని సూత్రమే యుండును, ఆకులు సామాన్యముగా నుండి పత్రనతములు చీలియుండును.

(3) కోని ఫెరేలిస్ (Coniferales) : వీని బీజములపై సన్నని వెండ్రుకలుండవు. కేసరములు శంకువుల పైననే యుండును. అన్ని భాగములందును సర్జరసనాళము లుండును.

(4) నీటేలిస్ (Gnetales) : వీని బీజములపై వెండ్రుకలుండవు. కేసరములు శంకువులలో నుండును.వీని యందు సర్జరసనాళము లుండవు.

సంవృతబీజవంతములు (Angiosperms): పుష్పించు వృక్షములలో ఇది రెండవ భాగము, సంవృత బీజవంతము లలో బీజములు బహిరంగముగా నుండక, పండ్లలోపల నుండును. సంవృత బీజవంశముల యొక్క గింజలలో కొన్నింటిలో బీజదళములు రెండు ఉండును. వీనిని 'ద్విదళ బీజకములు' (Dicoty ledons) అందురు. ఉదా॥ మామిడి, చింత, వేరుసెనగ మొదలగునవి. మరికొన్నింటిలో బీజదళము ఒక్కటిమాత్రమే యుండును. దీనిని 'ఏకదళ బీజములు' (Monocoty ledons) అందురు.ఉదా౹౹ జొన్న, మొక్కజొన్న, గోధుమ, వరి, మొదలగునవి.

ఏకదళబీజకములను పదునొకండు ప్రసమూహములు (Cohorts) గా భాగించిరి. ప్రతి ప్రసమూహము (Cohort) లోను కొన్ని కుటుంబము లుండును. ఉదా॥ Glumiphlorae (గ్లూమిఫ్లోరె) అనబడు ప్రసమూహములో Graminae (గ్రామినీ) అనబడు ఒక కుటుంబము కలదు. దీనినే గడ్డిజాతి కుటుంబమని యందురు. వరి, జొన్న, మొక్కజొన్న మొదలయినవి ఈ కుటుంబమునకు జెందినవే. గడ్డిజాతి కుటుంబములో ఎన్నియో గణములు గలవు. వీనిలో Oryza ఒకటి. ఈ గణములో Sativa అను ఒక జాతి కలదు. అదియే వరిమొక్క. అందుకే వరి మొక్క ను 'Oryza Sativa' అందురు. వరిలో Oryza Sativa Pusa T-18, Oryza Sativa Co₁ Oryza Sativa, Krishna Katukalu మొ॥ రకములు అనేకములు గలవు. ఈ రకములను 'Varieties' అని యందురు.