Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - ౨

ఉద్భిజ్జములు - పరిసరములు


వ్యాపారములలో గాని ఈ విధముగ పరిసరములకు తగినట్లు ఉద్భిజ్జములు చేసికొను సర్దుబాట్లు 'ఉపయోజనములు' (adaptations) అనబడును. ఎడారిలో జీవించుటకు నాగజెముడు జాతి మొక్కలకును, నీటిపై జీవించు అంతర తామరకును గల సహజోపయోజనములు చక్కని యుదాహరణములు.

ఉద్భిజ్జములు, వాతావరణము: మొక్క అపేక్షించు పరిసరములలో నేలకు సంబంధించిన గురుత్వాకర్షణ శక్తి వివిధ రసాయనపదార్థములు, వాతావరణమందలి చెమ్మ, ఉష్ణోగ్రత, వెలుతురు కూడ చాల ముఖ్యమైనవి. చుట్టుపట్ల నున్న ఇతర ప్రాణులకు (మొక్కలకు, జంతువులకు) గూడ మొక్క యొక్క జీవితముపై ప్రభావముకలదు. గాలి, గాలిలోనున్న ఆర్ద్రత, ఆ ప్రదేశము యొక్క నైసర్గిక స్వరూపము కూడ వాతావరణమునకు చెందిన అంశములు,

సామాన్యముగ 0॰ మొదలు 50° ల సెం. లోపలనున్న ఉష్ణోగ్రతలో ఉద్భిజ్ఞములు జీవించుచుండును. మొక్కలలో జరుగు వివిధ శరీరధర్మముల తీవ్రత యుష్ణోగ్రతలోని మార్పులకు అనుగుణముగా 'హెచ్చుచు, తగ్గుచునుండును. కాని ఒక్కొక్క వ్యాపారనిర్వహణమునకు కావలసిన మితమైన ఉష్ణోగ్రత వేరువేరుగా నుండును. ఆయా ప్రదేశములను బట్టి ఆయా జాతుల మొక్కలకు ఆనువంశికముగ కావలసిన మితోష్ణోగ్రత కూడ వేరు వేరుగానుండును. ఉద్భిజ్జ శరీరము యొక్క ఉష్ణోగ్రత, పరిసరముల ఉష్ణోగ్రతను బట్టి మారుచుండును. అది ఒక్కొక్కప్పుడు పరిసరముల ఉష్ణోగ్రతకంటె కొంచెమెక్కు వగనో, తక్కువగనో కూడ ఉండును. సామాన్యముగ ఏ జాతి మొక్కలకైనను ఉష్ణోగ్రతలోని హెచ్చుతగ్గులకు తాళగల శక్తి యుండును. జీవకణ సంహతులలో, ముఖ్యముగా జీవరసములో నున్న నీటిపై ఆశక్తి ఆధారపడియుండును. నీరు హెచ్చుగానున్నచో ఉష్ణనిరోధకశక్తి తక్కువగను, తక్కువగానున్నచో అది ఎక్కువగను ఉండును. వాతావరణపు ఉష్ణోగ్రతవలె మొక్కలు పెరుగు నేల యొక్క ఉష్ణోగ్రత కూడ చాల ముఖ్యమైనది. నీటిని, ఖనిజ లవణములను పీల్చుకొనువేగము కొంతవరకు దానిపై ఆధారపడియుండును. ఈ విషయమున గూడ ఆనువంశికమును బట్టి కొన్ని భేదములు కనబడుచుండును.

కిరణజన్య సంయోగ క్రియచే మొక్కలు తయారుచేసికొను ఆహారములో కొంత దాచియుంచుకోను శక్తి వానికి వెలుతురు నుండియే లభించును. అందుచే వెలుతురు యొక్క ప్రభావము ఉద్భిజ్జములపై చాల గలదు. వెలుతురు ఏ దిక్కు నుండి ప్రసరించునో ఆ దిక్కునకే కొమ్మలు, ఆకులు పెరుగుచుండును. వెలుతురు సోకనిదే ఉద్భిజ్జములలో పత్రహరితము (chlorophyll) ఏర్పడదు. వెలుతురు యొక్క ప్రభావము అంతర్నిర్మాణము పై గూడనుండును. ఎక్కువ ప్రకాశములోనున్న పత్రములలో పత్రహరిత ముండు కణసంహతులు (స్తంభావళి - palisade tissue) దట్టముగను, కణముల మధ్యనుండు అవకాశములు చిన్నవిగను, బహిశ్చర్మము దట్టముగను ఏర్పడును. తక్కువ ప్రకాశములో నున్న పత్రములపై తెల్లనిమచ్చ లేర్పడుచుండును. ఆ పత్రములు చిన్నవిగా నుండును. కాండము సన్నముగా, పొడవుగా పెరుగును. దానిలోనున్న కణములుకూడ పొడవుగా నుండును. వాహికాపుంజములు బలహీనముగా నుండును. చాల ఎక్కువ ప్రకాశము జీవరసమునకు హానిచేయును. వెలుతురులో నుండు అతినీలలోహిత కిరణములు (ultra violet rays) జీవరసమును ప్రేరేపించును. అందుచే చాల రకముల మొక్కలలో ఆకు యొక్క రేకు భాగము అధిక ప్రకాశములో చాల తక్కువగ నుండునట్లేర్పాట్లు కనబడును. మొక్కల యభివృద్ధి విషయమున వెలుతురు యొక్క స్వభావము, రంగు, తరంగముల దీర్ఘత (wave-length) కూడ ముఖ్యమైనవి. కొమ్మల చివర పెరుగుచున్న మొగ్గలలో చీకటి, వెలుతురులు కాలప్రమాణముల వలన కొన్ని భేదములు కాన్పించును. ఈ ప్రమాణములకును దుంపలు, గడ్డలు, పువ్వులు ఏర్పడుటకును సంబంధము కలదు. వెలుగు చీకటులు హెచ్చుతగ్గులను ప్రయోగించి కొన్ని ఏకలింగ పుష్పములుగల మొక్కలలో పుష్పముల లింగ భావమును మార్చుటకుగూడ వీలగును.

వెలుతురు మూలముననే మొక్కలలో పెరుగుదలకు సంబంధించిన పెక్కు చలనములు జరుగుచుండును. వీనిని 'ఆవర్తనములు' (tropisms) అందురు. సామాన్యముగ కాండము కాంతివచ్చు దిక్కునకు తిరుగును. మూలము కాంతినుండి దూరముగా పోవును. పత్రముల రేకులు