విజ్ఞానకోశము -౨
ఉద్భిజ్జములు (ఆహార పరికల్పన)
శిలీంధ్రములును, మోనోట్రోపా (Monotropa) వంటి స్వల్పసంఖ్యగల పుష్పసహితములగు ఉద్భిజ్జములును, ఈ తరగతి లోనికి వచ్చును.
కీటకాహారులు లేక మాంసాహారులగు ఉద్భిజ్జములు (Carnivorous Plants): ఈ మొక్కలకు పత్రహరిత ముండును. అవి పిండిపదార్థములను తయారు చేసికొన గలవు. కాని అవి విచిత్రమగు ఉపాయములతో పురుగులను పట్టుకొనుచు నత్రజని సంబంధమగు ఆహారమును అధికముగా గ్రహించును. నిపెన్ థస్ (Nepenthes) అను కూజా మొక్కయు, డ్రోసిరా (Drosera) లేక సూర్యబిందు, యూట్రికులేరియా (Utricularia) అను బోను మొక్కయు (Bladder-Wort) ఇట్టి మొక్కలకు సామాన్యమైన ఉదాహరణములు. నిపెన్ థప్ మొక్క విషయములో ఆకు యొక్క రేకు బోలుగానున్న కూజామాదిరిగా మార్పు జెందియుండును. పురుగులను పట్టుకొనుటకు దానికొక మూతయుండును. సూర్య బిందులో ఆకులకు గ్రంథులు గల వ్రేళ్ళవంటిమీసము లుండును. పురుగు వ్రాలగానే అవి మూసికొని దానిని బంధించి వేయును. యూట్రికులేరియా ఒక నీటి మొక్క. దానిలో పురుగులను పట్టుకొనుటకై కొన్ని ఉపపత్రములు బోనులుగా మారి యుండును. ప్రతిబోనునకు ఒక్క టేద్వార ముండును. లోనికిపోయిన పురుగులు బయటికి రాలేవు.
ప్రత్యేక మైన ఆహార పరికల్పనా విధానము మరి యొకటి గలదు. దానిని 'సహజీవనము' (Symborisis) అందురు. అనగా పరస్పర ప్రయోజనముకొరకు రెండు వివిధ జీవులు కలిసి నివసించుట. గాలిలో నున్న నత్రజనిని బంధించ గల కొన్ని రకముల సూక్ష్మజీవులు పప్పుదినుసు మొక్కల వ్రేళ్ళలో ప్రవేశించి అచ్చట స్వాభావికమైన కణుతులను, లేక మొటిమలను కలుగజేయును. అవి ఆ కణములలో నత్రజనిని, నత్రజని సంబంధమగు సంయోగ పదార్థముగా మార్చి మొక్కలకు అందజేయును. సూక్ష్మ జీవులకు కావలసిన పిండిపదార్థములు మొక్క నుండి లభించును.
కొన్ని అడవివృక్షముల వ్రేళ్ళు భూమిలో నుండు చాలరకముల శిలీంధ్రములతో కలిసియుండును. ఉచ్చశ్రేణికి చెందిన మొక్క యొక్క వేళ్ళతో శిలీంధ్రములు ఆ విధముగాకలిసి యున్నపుడు వానిని 'సహకార శిలీంధ్రములు' (mycorrhiza) అందురు. శిలీంధ్రముగల వేరునకు మూలరోమములుండవు. భూమినుండి లవణములను, నీటిని పీల్చుకొను వ్యాపారము శిలీంధ్రమే నిర్వర్తించును.
విలువయుంచు ఆహారమును రవాణా చేయుట (Translocation of storage food) :కరిగిన ఖనిజ ద్రవ్యములతో నున్న నీటిని మూలరోమములు పీల్చుకొని దారువుగుండ పైకి కాండములోనికి, పత్రములలోనికి పంపునని మనకు తెలిసినది. నిజముగా ఆకులే మొక్క యొక్క వంటశాలలు. క్లిష్టమగు సేంద్రియాహార పదార్థములు చాలవరకు అచ్చట సమీకరింపబడును. చురుకుగా పెరుగుచున్న భాగములు ముఖ్యముగా ఆహారపదార్థములను సామాన్య ద్రావణీయ రూపములో ఉపయోగించుకొనును. తాత్కాలికముగా కావలసిన దానికంటే ఎప్పుడును ఎక్కువగానుండు ఆహారము ముందు ముందు ఉపయోగముకొరకు నిలువయుంచు స్థలములకు పంపబడును. పెరుగుచున్న భాగముల నుండి నిలువచేయు స్థలములకు ఆహారపదార్థముల రవాణా 'త్వక్కు' లేక 'శణము' (Phloem) అను కణసంహతి ద్వారా జరుగును. ద్రావణీయములగు సామాన్య ఆహార పదార్థములు అదేరూపమున నిలువచేయ బడవు. వాని ఉపయోగము అవసరమగువరకు అవి క్లిష్టమైన ఆద్రావణీయరూపములలోనికి మార్చబడును. ఆహారము నిలువ యుంచుకొనుటకు మొక్కలలో పెక్కు అవయవములు ప్రత్యేకముగా తగియున్నవి. ఉదా॥ ముల్లంగివంటి