Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - ౨

ఉద్భిజ్జములు - అంగభేదరహితములు

మారుటకు ప్రయత్నపడుచుండును. ఉదాహరణమునకు సముద్రతీరములందలి ఇసుక దిబ్బలపై తొలుదొల్త “మఱ్ఱం" (marram) గడ్డివంటి మోటుజాతి ఉద్భిజ్జములు మాత్రమే అంకురింపగలవు. ఇవి పెరిగి ఇసుకను స్థిరపరచుటయేగాక, అవి ఎండి క్రుళ్ళిన తరువాత, ఉపరితలపు నేలకు ఆకు పెంట నిచ్చును. ఈ ఆకు పెంట కలయిక వలన, ఆనేల ఎక్కువ నీటిని నిలుపుకొనగలదు. అందువలన కొంత తక్కువ ప్రత్యేకతతోగూడిన ఉన్నతజాతి వృక్షములకు జీవనాధారము లభించును. ఈ విధముగా గుణములోను వృక్షసహజావాస ప్రదేశముయొక్క స్థిరత్వములోను క్రమాభివృద్ధి కలుగును, చిట్టచివరకు ఇసుకతిన్నె మొత్తపు నేలమీద దట్టమగు ఉద్భదజాలముగాని ఒక అడవిగాని ఏర్పడవచ్చును. ఫ్రాన్సు యొక్క లాండీసు తీరమునందు ఇసుకదిబ్బపై ఏర్పడిన దేవదారు అడవులు ఇందుల కుదాహరణము. పశువుల మేతకొరకు ప్రత్యేకింపబడిన గడ్డి భాగములు, అవి మేత కుపయోగింపబడనిచో చిట్టడవిగా మారి కాలక్రమేణ అడవి ప్రదేశముగా మారును. ఇట్టి మార్పులు జరుగు దశలలో ప్రతి దశయు కొన్ని వృక్షజాతులను ప్రత్యేకముగా కలిగి యుండును. ఈపరిణామము జరుగుకొలది, వాటి సంఖ్యయును, పరిమాణమును, సామాన్యముగా వృద్ధికాదొడగును. చివరదశయందు ఒకటి లేక రెండు ఉద్భిజ్జజాతులు తక్కినవాటికంటే ప్రముఖములు కావచ్చును.

పోటీ : ఎడారులలో నుండు కొన్ని వెల్లడిగా పెరుగు జాతుల చెట్లలో తప్ప మిగిలిన ప్రాంతములలో నుండు ప్రతి మొక్క మధ్య ఎల్లప్పుడును పోటీయుండును. వృక్షసహజా వాసప్రదేశము కొన్ని మొక్కల పెరుగుదలకు అనుకూలముగను, మరికొన్నిటి పెరుగుదలకు ప్రతికూలముగను ఉండును. ఇట్టి పోటీయే లేనిచో, పర్వతముల యందుండు చాలరకపు మొక్కలు పల్లపు ప్రదేశములలోను, నీటి మొక్కలు మరుభూములలోను పెరుగగలవు. ఈ పోటీలో జయము, వాటికి కావలసిన కాంతి, గాలి, నీరు, ఖనిజలవణమును సంపాదించుశక్తి, అను ఆంశములపై ఆధారపడి యుండును. పొడుగైన వృక్షములు మిగిలిన వాటికన్న అధికముగా కాంతిని పొందగలవు. నేల, మరియు శీతోష్ణ పరిస్థితులు చెట్లకు సహాయపడినచో, ఈ క్రమములో ఉద్భిదముల పరాకాష్ఠస్థితి అడవి. ఈ పరంపరలో నిది అంత్య పరిణామ దశయై యున్నది. అదేవిధముగా దట్టమగు ఆకులు గలిగిన వృక్షములు ఇతర వృక్షములకంటే ఎక్కువగా జయమును గాంచును. ఏమనగా, అదే తావులో పోటీచేయు ఇతర వృక్షజాతులు పెరుగుదలను అవి నిరోధించును. కాని పెద్ద పరిమాణముగల చెట్ల సంతానోత్పత్తి జరిగిన పిమ్మట ఆ మొక్కలు తిరిగి పెద్దవిగా ఎదుగుటకు చాలకాలము పట్టును. ఇట్లు ఆలస్యముగా పెరుగు వృక్షములకంటె త్వరితముగా సంతానోత్పత్తిచేయు మొక్కలు (గుల్మములు, శాక ములు, గడ్డిగాదములు) మానవుడు, జంతువులు మరియు ఇతర ప్రతికూల పరిస్థితులలో, అభివృద్ధిపొందుటకు ఎక్కువ అవకాశములు కలవు. అందువలన అడవుల క్రింద నుండు భూవైశాల్యము క్రమముగా తగ్గిపోవుచు గడ్డి మైదానముల పెరుగుదలకు తావు కలుగుచున్నది.

ఆర్ధిక స్థితిగతులు : ఆధునిక మైన ఆర్థిక వృక్షశాస్త్రము, పైన వివరింపబడిన పరిసరసంబంధముల స్థితిగతులపై ఎక్కువగా ఆధారపడి యున్నది. ఒక ప్రదేశములో సహజముగా పెరుగు జాతులు, వ్యవసాయపు పనులకు విలువైన మార్గదర్శకముగా నుండును. సస్య భూగోళశాస్త్ర పరిజ్ఞానము మొక్కల నాటు వారికిని, వ్యవసాయదారులకును, తోటలు పెంచువారలకును, ఆ పరిసరము యొక్క శక్తి ని స్వాభావిక ధోరణిని గ్రహించి ఆ మార్గములద్వారా తమ పైరులకు ప్రణాళిక ఏర్పరచుకొనుటకు తోడ్పడు చున్నది. కలప మున్నగు ఆటవికములగు ఉత్పత్తులు, వ్యవసాయపు ఉత్పాదనము, పశుపాలక పరిశ్రమములు, మొదలగు వానికొరకు జాతీయ ప్రణాళికలు ఏర్పాటు చేయునపుడు, అవి జయప్రదము కావలెనన్నచో, ఉద్భిదజాలమునకును, పరిసరములకును మధ్యనుండు సున్నితమగు సామ్యమును చెడకుండ పరిసర సంబంధములకు చెందిన అంశములనుకూడ పరిగణింప వలయును.

యం. జె. సు.


ఉద్భిజ్జములు - అంగభేదరహితములు (థాలోఫైటా): పుష్పరహిత ఉద్భిజ్జములలో అంగభేద రహితమైన ఉద్భిజ్జములు (థాలోఫైటా) ఎక్కువభాగమును ఆక్రమించి