విజ్ఞానకోశము - ౨
ఉద్భిజ్జ భూగోళము
"టండ్రా"లలో చాల కొలది ప్రదేశములలో మాత్రము వ్యాపించియున్నవి. భూమ్యుపరిభాగముపై వేరు వేరు ప్రదేశములలో వేరువేరు విధములగు వృక్షసంపదలు ఆవరించియున్నవి. కొన్ని కొన్ని జాతిసమూహములు కొన్ని ప్రదేశములలోనే యున్నవి; అట్టి ప్రదేశములు తరుచు శీతోష్ణమండలములై యున్నవి. అవి "వృక్షమండలములు" (Formations) అని పిలువబడుచున్నవి. ఇట్టి "వృక్షమండలము"లలో మిక్కిలి పెద్ద సమూహములు శీతోష్ణ పరిమితుల ననుసరించి, అక్షాంశ రేఖాసంబంధముగా విభజింపబడి యున్నవి. ఉదా॥కు ఈదిగువ వృక్ష మండలములు కలవు——
1. ఉష్ణమండల వర్షారణ్యమండలములు : విశాలపత్రములుగల సతతహరిత వృక్షములతోను, మ్రానుగట్టిన ఆరో హణ లతలతోను ఇతరమైన తీగెజాతులతోను (Epiphytic plants) ఈ అడవులు నిండియుండును.
2. ఉపోష్ణ ప్రాంతములలోను, సమశీతోష్ణ ప్రాంతములలోను పెరుగు ఆకురాల్చు విశాలపత్రారణ్య మండలములు: లారెల్, ఓకు మొదలగు చెట్లజాతు లిందు పెరుగును.
3. గడ్డిమైదానపు మండలములు: ఖండాంతర్భాగములో మధ్య - అక్షాంశ రేఖలయందుగల అమెరికాలోని ప్రయిరీలు, రష్యాలోని స్టెప్పీలు వీని కుదాహరణములు.
4. సతతహరిత శృంగాకారములగు అరణ్య మండలములు : వైన్, ఫర్, సీడర్ (దేవదారు జాతులు), స్ప్రూస్ మున్నగు మెత్తనికఱ్ఱను గలిగిన ఈ మండలపు వృక్షజాలము ఉత్తర అమెరికాలోను, ఉత్తర యూరేషియాలోను గలవు.
5. ధ్రువమండలము లందలియు, ఉష్ణ మండలము లందలియు ఎడారులు : ఈ మండలములలో ప్రతియొక్క టియు దానికి కారణభూతమైన శీతోష్ణస్థితిలో సాధ్యమగు అత్యుత్తమ వృక్షజాతిని సూచించును. "అత్యంత పరిణత వృక్షమండలము" అని దీనికి పేరు. ఏ వృక్షమండలములోనైనను సమృద్ధమై అవిచ్ఛిన్నముగానుండు అత్యంత పరిణత వృక్షసంపదతోబాటు పురోగాములగు కొన్ని వృక్షవర్గము లుండును; ఇవి పరిణామ సంబంధములగు కొన్ని మార్పుల పరంపరను పొందుచు క్రమముగా అత్యంత పరిణత వృక్షజాతి అగుటకు యత్నించుచుండును. పరిశుద్ధ వాయువులు విస్తారముగా తగులు తావులో పాచి, పాకుడువంటి మిక్కిలి సూక్ష్మములగు నిమ్నజాతి వృక్షజాలముమాత్రమే పెరుగును. అవి మరణించిన తర్వాత క్రుళ్ళుటవలన ఏర్పడిన ఆకు పెంటచే రాతినాచులు, ఆకులవంటి రూపభేదములు ఏర్పడుటకు ఆధారభూమి ఏర్పడును. వాటినుండి క్రమముగా గడ్డిజాతులు, ఇతర పొద మొక్కలు వర్షము లేకున్నను బ్రతుకగల శక్తితో బయలుదేరును. శిలాతలము ఇంకను శిథిలమై, భిన్న భిన్నములగు కొలదియు, ఇంకను ఎక్కువ భూప్రదేశము ఏర్పడుచుండును. ఉత్పన్నములై నశించిపోయెడి ఉద్భిజ్జరూపములవలన ఆకు పెంట వృద్ధియగు చుండును. గడ్డిజాతులు కాలక్రమమున పొదలకును పొట్టిగా పెరుగు చెట్లగుబురులకును తావిచ్చును. ఆ తరువాత చెట్లు బయలు దేరును. ఇట్టి ప్రాథమికాభివృద్ధి జరుగుటకు బహు దీర్ఘ కాలము పట్టును. కాని మొదటిలో అడవి యుండి అది అగ్నిచే నశించినయెడల ఈ క్రమము వేగముగా నగును. రెండు దశాబ్దములలో నే అట్టి పరిస్థితిలో క్రొత్త అడవియొక్క ఆచ్ఛాదనము ఏర్పడును. సాధారణముగా ఈ అభివృద్ధిక్రమములో వివిధ దశలలో నున్న ఉద్భిద సమూహము ఒకేమారు పెరుగుచుండుట మనకు కనబడుచుండును.
ఏ మొక్కల సమూహములోనైనను నానా విధములగు ఉద్భిదజాలము, ఒక దాని ప్రక్కన ఇంకొకటి చక్కగా జీవించుచు తమ జాతిని పెంపొందింప చేసి కొనుటకు అనుకూలపడియుండుట మనము గమనింతుము. ఉదాహరణకు ఉష్ణమండలారణ్యములో తడిగా చీకటిగా నుండు నేలపై నాచులు, కుక్కగొడుగులు, జీవాణువులు మొ. ఉద్భిదజాలము తివాచీవలె పరచికొని యుండుటను చూతుము. చెట్ల యొక్క శాఖలపై దట్టముగా పెరిగెడు గుల్మములను, పొదలను, చెట్లను, ఆరోహణలతలను, లేక ప్రాకుడులతలను చూడగలము. ఈ మొక్కల యొక వేళ్ళు వివిధములగు లోతులకు చొచ్చుకొనియుండును ; మరియు వేర్వేరు కాలములలో అవి నేలయందలి వివిధములగు పొరలలో నుండి అత్యధిక ఆహారమును సంగ్రహించును. ఈ విధముగా, కాంతి, ఆర్ద్రత విషయములలో పరిసరము ప్రతి ఉద్భిదశ్రేణికిని వేరు విధముగా నుండును, కనుక ఒకదానిలో నింకొకటి కలిసి మెలసి తక్కువ పోటీ