విజ్ఞానకోశము - ౨
ఉద్భిజ్జ పరిణామము
క్రీ. శ. 1859 వ సంవత్సరమున ఛార్లెస్ డార్విన్ అను నాంగ్లేయ జీవశాస్త్రజ్ఞుడు తాను వ్రాసిన 'జాత్యుత్పత్తి' అను గ్రంథమునందు పరిణామ సమస్యను పరిష్కరించుచు 'ప్రాకృతికవరణము' (Natural Selection) అను సిద్ధాంతమును ప్రతిపాదించేను. ఆ గ్రంథ ప్రభావము సమస్తమానవుల ఉద్దేశములపై పడినది. అతడు శాస్త్ర సమ్మతముగ శాస్త్రజ్ఞుల కందరికిని జీవపరిణామ విధానమునుగూర్చి నమ్మకము కలిగించెను. అతని సిద్ధాంతము మూడు ముఖ్యమైన విషయములపై ఆధారపడి వున్నది. (1) ప్రాణులలో నిరంతరము మార్పులు కలుగుచున్నవి. ఆమార్పులు సంతా నమునకు సంక్రమించుచున్నవి. (2) పెరిగి పెద్దవగు వాటి సంఖ్యకంటే ఎంతో ఎక్కువ సంతానమును ప్రాణులు ఉత్పత్తి చేయుచున్నవి.బ్రతుకుకొరకు తీవ్రమగు పోరాటమువానిలో పరస్పరముగ ఉండి తీరవలెను. (3) పరిస్థితు లకు అనుకూలమగు మార్పులు ఏ ప్రాణులకు కలవో, వాని మూలమున ఏ ప్రాణులు ఈ పోరాటమున నెగ్గునో అవి బ్రతికి ఆ మార్పులను సంతానమునకు సంక్రమింప జేయును. ప్రకృతి ఈ విధముగా ప్రాణులను ఎంచుకొనును. ఈ ఎన్నికవలన ప్రాణులలో మార్పులు కలుగుచుండును. ఉద్భిజ్జములును, జంతువులును, అనంఖ్యాకములగు మార్పులను పొందుచుండును. ఆ మార్పులు సూక్ష్మములుగా నుండును. వానిలో కొన్ని ప్రాణికి ప్రయోజన కారులుగను, కొన్ని హానికరములు గను ఉండును. అదృష్టవశమున ఆ మార్పులు ఏ ప్రాణికి సరియైన మార్గమునకలుగునో ఆ ప్రాణి బ్రతికి వానిని సంతానమునకు అంద జేయును. తక్కిన ప్రాణులు నశించి సంతానరహితములగును. ఈ పద్దతి ప్రకారము ఒకజాతి స్థిరముగా మార్పు జెందుచు, పరిసర ప్రదేశములకు పూర్వముకంటెఎక్కువ తగియున్న రూపములతో అభివృద్ధి చెందుచు, క్రొత్త పరిసరములలో నెగ్గగల రూపములను ఉత్పత్తిచేయుచుండును. ఈ విధానమునకు డార్విన్ "ప్రాకృతిక వరణము" అని పేరు పెట్టెను. డార్విన్ సిద్ధాంతమునుకూడ అంగీకరించని శాస్త్రజ్జులు కొందరు కలరు.
'డిగ్రీస్ ' అను డచ్చి వృక్షశాస్త్రజ్ఞుడు పరిణామకారణమును, దాని విధావమును గూర్చి మరియొక సిద్దాంతమును క్రీ.శ.1901 వ సంవత్సరమున ప్రతి పాదించెను. డార్విన్ ముఖ్యమని తలచిన చిన్నచిన్న సూక్ష్మ భేదములు పరిసర ప్రదేశములవలన కలిగినవనియు, అవి ఆనువంశికముగా సంక్రమింపవనియు డిగ్రీస్ నమ్మెను. పరిణామ సంబంధ మగు మార్పులను కలిగించు భేదములకు అతడు ఉత్పరివర్తనములు (Mutations) అని పేరు పెట్టెను. అవి. శాశ్వతమైన వనియు, అవి సంతానమునకు సంక్రమించుననియు, ఒక్కొకప్పుడు అవి స్ఫుటముగా, పెద్దవిగా నుండుననియు ఆతని సిద్ధాంతము. పెద్ద పెద్ద స్ఫుటమైన