Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము -౨

ఉత్తర మీమాంస

కాదు. అభిన్నముకూడ అయియున్నది. బ్రహ్మవినాభూతము జడము. శంకరునివాదమునకు ఆద్వైతవాదమని పేరు. భాస్కరుని వాదమునకు భేదాభేద వాదమని నామము.

రామానుజుడు అద్వైతవాదమును భేదాభేదవాదమునుకూడ అంగీకరింపలేదు. భేదాభేదములు పరస్పర విరుద్ధములు. రెండువ్యక్తులు భిన్నమైనచో అభిన్నములు కానేరవు. అభిన్నములైనచో భిన్నములు కానేరవు. అందుచే భేదాభేదములు రెండు ఒక్కచోటనే వర్తింపజాలవు. అదియునుగాక పరబ్రహ్మమును ఉపాధి ఆక్రమింపజాలదు. ఆ బ్రహ్మము స్వయం అపరిమిత స్వరూపము కలది. అది తేజోబలములకు రాశి. జడము బ్రహ్మాధారముగాని, బ్రహ్మము జడాధారముగాదు. పరతంత్రమైన జడము స్వతంత్రమైన బ్రహ్మమును ఉపహితము చేయజాలదు. అందుచేత బ్రహ్మము జడోపహితము కాగలదని చెప్పుటకు వీలులేదు. ఆ కారణముచేత జీవుని ఆత్మ మొట్టమొదటినుండియు బ్రహ్మమునకు భిన్నమనియే ఒప్పుకొనవలయును. జడమునకు జీవుడు ఎట్లు ఆత్మయో, జీవునికి తనఆత్మ ఎట్లున్నదో, అట్లే జీవాత్మకు పరబ్రహ్మము ఆత్మ. పరబ్రహ్మమునకు శరీరము జీవుడు. జీవునికి శరీరము జడము. అన్నింటికిని అవినాభావసంబంధము'. ఇట్లు జీవజడ విశిష్టమైన బ్రహ్మమే అద్వైతమని ఉపనిషత్తులు చెప్పును. ఇట్లు విశిష్టమైన అద్వైతమును బోధించుటచే రామానుజుని మతమునకు విశిష్టాద్వైతమని పేరు. రామానుజుడు, శంకరుడు ప్రతిపాదించిన మాయను అంగీకరింపలేదు. ప్రపంచము బ్రహ్మమునకు విశేషణమైనప్పుడు మాయ కాజాలదు. అందుచేత ప్రపంచము సత్యమే. అదియునుగాక, మాయకు స్థానము బ్రహ్మమా లేక జీవుడా అను విషయము విమర్శించతగినది. బ్రహ్మమయినచో, శుద్ధస్వరూప, జ్ఞానస్వరూప విశిష్టమైన బ్రహ్మము, అశుద్ధస్వరూప, అజ్ఞాన స్వరూపములతో విశిష్టమైన మాయకు ఆశ్రయము కాజాలదు. జీవుడే అయినచో, జీవుడు పూర్వము ఉన్నగదా మాయకు ఆశ్రయము కాగలడు? కాని జీవుడే మాయాకార్యమని శంకరుడు బోధించును. అయినచో కారణము కార్యముకంటె పూర్వమున ఉండవలెను. మాయ జీవునికి కారణము, కార్యము కూడ కాజాలదు. అందుచేత, మాయ అసంభవము. కనుక శంకరుని అద్వైతమును స్వీకరింపజాలమని రామానుజాచార్యులవారి వాదమైయున్నది.

శంకరుడు తప్ప వేదాంతులెవ్వరు మాయను స్వీకరింపరైరి. మాయను ఈశ్వరశక్తియని ఒప్పుకొన్నను ఆశబ్దము సత్తగాదు; అసత్తగాదు అను నర్థము ఈయజాలదు. అందరు ప్రపంచము సత్యమనియే వాదించిరి. రామానుజుడు బ్రహ్మము ఈశ్వరుడేయనియు, అది పరమపురుషుడనియు, విష్ణువు అనియు బోధించెను. శంకరుడు పరబ్రహ్మము పురుషస్వరూపము కాదనియు, ఈశ్వరుడు పరబ్రహ్మము కాడనియు, అపరబ్రహ్మమనియు చెప్పెను. శంకరుడుతప్ప తక్కినవారందరు పరబ్రహ్మము ఈశ్వరుడే అనియు, సగుణమనియు, అది విష్ణుస్వరూపముగాని శివస్వరూపముగాని యైయున్నదనియు వాదించిరి. అట్లుచేయుట వేదవిరుద్ధమని, ఆ సిద్ధాంతములకు ఆధారములైన పాశుపత పాంచరాత్రాగమములు వేద బాహ్యములని స్మృతులు, పురాణములు, సగుణుడైన ఈశ్వరుని వర్ణించినను, ఆవర్ణనలను శ్రుతిప్రాధాన్యము కలవాటినిగా నిర్వచించవలెనని అతడు వాదించెను. అందుచేత శంకరుడొక్క డే స్మార్తుడని, అనగా శ్రుతిస్మృత్యనుయాయి అని, తక్కినవారు స్మార్తులుకారని సంప్రదాయాభిప్రాయము.

మధ్వాచార్యులు పై ముగ్గురి మతములను స్వీకరించలేదు. ప్రపంచము, జీవుడు సత్యములే. స్వతంత్రులుగాక పరతంత్రులే. అయినను బ్రహ్మమునకును జీవునికిని అత్యంత భేదము కలదు. పరబ్రహ్మమైన ఈశ్వరుడు తన స్వరూపశక్తిచే జీవులను జడమును సృజించును. ఆ శక్తిచేతనే వాటిని నియమించును. ఈ శక్తి పేరు మాయ. అయినను, ఇది శంకరుని మాయవలె అసత్యముకాదు. సత్యమే. పరబ్రహ్మస్వరూపము అసత్యము కాజాలదు. జీవబ్రహ్మములకు శరీర శరీరిభావము అంగీకరించజాలము. శరీరములో బాధకలిగిన శరీరి అనుభవించును. కాని పరబ్రహ్మమునకు దుఃఖముఎన్నడునులేదు. అదినిత్యానందస్వరూపము. జీవుడు తన సుఖదుఃఖములను తానే అనుభవించును. అందుచే జీవబ్రహ్మములకు పూర్ణభేదము అంగీకరించవలెను. ఇట్లు పూర్ణభేదమును బోధించుటచే మధ్వాచార్యులవారి మతమునకు ద్వైతమని పేరుకలిగినది.

155