విజ్ఞానకోశము -౨
ఉక్కు పరిశ్రమ
యుండును. ప్రచండమగు ఉష్ణమును ఎదిరించుటకై ప్రత్యేకమగు ఇటుకలతో చుట్టు నొక ఉక్కుకప్పు గల కొలిమి నిర్మింపబడును. తాపనపాత్రమునందు 60 నుండి 300 టన్నుల లోహము ఏకపర్యాయము ఇముడ గలదు. చిన్నరకములు స్థిరముగను, పెద్దరకములు కదల్చుటకు వీలుగను. ఉండును. ఈ తాపనపాత్రమునకు రెండువైపుల, రెండేసిగదు లుండును. వాటిలో ఒకటి, గాలిని ముందుగా వేడిచేయుటకును, మరొకటి, బాష్పమును వేడిచేయుటకును ఉపయోగించును. బాష్పము, గాలి ఒకవైపు గదులనుండి తాపనపాత్రములోనికి తీసికొని పోబడును. దానిలో అవి కలిసి తీవ్రమగు జ్వాలతో మండును. ఈ విడువబడిన వాయువులు రెండవ వైపున నుండు గదులలోని నిరోధకగొట్టముల (chequers) ద్వారమున పంపబడి, వాటికి వేడిమి కలిగించుటకు ఉపయోగించును. ఇట్లు మొదటి గదులలోని వేడిగాలి ఖర్చై చల్లబడుచుండగా రెండవవైపునుండు గదులు పనిచేయ నారంభించును.
కొలిమిలో వేయబడు పదార్థములు :
1. ఘనస్థితియందును, ద్రవస్థితియందును ఉండు పోత ఇనుము
2. చిన్న చిన్న తునుకలు.
3. ముడి ఇనుము (ఖనిజము).
4. సున్నపురాయి.
ఈ పదార్థమంతయు పూర్తిగా కరుగుటకు సుమారు రెండు గంటలు పట్టును. అప్పుడు వేడిలోహము వేయబడును. కరుగుకాలమునందు పోత ఇనుము, తునుకలు విశేషముగా ఆమ్లజనీకరణము నొందును. ఈ వేయబడిన పదార్థము లన్నియు పూర్తిగా కరుగగనే (మాలిన్యములతో నేర్పడిన) చిట్టెము లోహము పైకి తేలును. లోహములోని ఇసుక చాలవరకును, కర్బనము కొంతవరకును ఆమ్లజనీకరణము చెందును. మిగిలిన ఇసుక, కర్బనము, భాస్వరము, గంధకము తరువాత పరిశుభ్రము చేయుకాలమున తొలగింపబడును. ఈపని, మరికొంత ఖనిజము, పొట్టు (mill scale), సున్నపురాయి మొదలగు ఆమ్లజనీకరణములను కలిపి నెరవేర్పబడును. ఈ సమయమున పనిచేయువాడు గొప్పనేర్పును ప్రదర్శింప వలసి యుండును. తయారగు ఉక్కు యొక్క మంచి చెడుగులు దానిలో చివరకు మిగల్చబడు కర్బనము యొక్క శాతము ననుసరించి యుండును.
ఈ పరిశుభ్రముచేయు సమయమున కొలిమినుండి మచ్చునకై పదార్థములు తీయబడుచు, లోహముయొక్కయు, చిట్టెము యొక్కయు విశ్లేషణ పరీక్షలు (Analyses) చేయబడును. దీనివలన కరిగించువానికి కొలిమిలోని పదార్థముయొక్కస్థితి తెలియును. సరియగు ఉక్కు ఉత్పన్నమగుటకు కరిగించువాని యొక్కయు, ధాతుశాస్త్రజ్ఞుని (Metullurgist) యొక్కయు మధ్య చక్కని సహకారము అవసరమగుచున్నది. 80 నుండి 100 టన్నుల ఉక్కును తయారుచేయు కొలిమియందు ఆద్యంతములు 10 నుండి 14 గంటల కాలము పట్టును. 20 నిమిషములలో నగు బిస్సిమరు విధానమునందుకంటె ఇందు దీర్ఘమైనకాల మవసరము. చివరకు తెడ్డులోనికి పోయునపుడు అవసరమగు కర్బనమును కలుపుట మొదలగు తుది సంయోజనములు జరుగును. చుట్టలుగా తయారుచేయు యంత్రశాలలకుగాని, లోహకారశాలలకుగాని పంపుటకు ముందుగా ఇట్లు తుదకు కడ్డీలుగా పోయుటకు ఉక్కు, సిద్ధముగా నుండును.
విద్యుద్విధానము (Electric Process) : అభిధమనభ్రాష్ట్ర, వివృతభ్రాష్ట్ర విధానములుకొన్ని, వాటియందుగల కొన్ని అశ క్తతలచే ప్రత్యేకరకములకు చెందిన ఉత్తమ గుణముకల ఉక్కును తయారుచేయుటకు ఉపయోగపడ జాలవు. ఈ అశక్తతలను తొలగించి వేడిమిని కల్గించుటకు విద్యుచ్ఛక్తిని ఉపయోగించుపద్ధతి అమలులోనికి వచ్చినది. వ్యయహేతువుగానిచో విద్యుచ్ఛక్తినే చాల రకముల ఉక్కులను తయారుచేయుటకై వాడవచ్చును. విద్యుత్తుచే ఉష్ణమును పుట్టించినచో ఆమ్లజనీకరణ వాయువుల ప్రసక్తి ఉండదు.
విద్యుచ్ఛక్తితో ఉక్కు కొలుములు రెండువిధములుగా వేడి చేయబడును. ప్రధానమగు మొదటి విధానములో మూడు కర్బనపు కడ్డీల విద్యుద్వారములు కొలుముల యందలి తాపన పాత్రలలోని ఉక్కునకు విద్యుత్తును పరివర్తనయంత్రము (Supply transformer) నుండి అందిచ్చును. ఈ విద్యుద్వారములకును, లోహమునకును
147