Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉక్కు పరిశ్రమ

సంగ్రహ ఆంధ్ర

వేరుచేయు సున్నమువంటి పదార్థము (flux) కఱ్ఱబొగ్గు అనువాటిచే పైనుండి నింపబడును. క్రింది నుండి చాల తక్కువ పీడనము గల గాలి ఊదబడును. ఈ పద్ధతి ఇంగ్లండులో మొదట క్రీ.శ. 1500 సం. ప్రాంతమున ప్రవేశపెట్టబడెను. క్రీ. శ. 1619 లో కారుబొగ్గు (coke) తరువాత 200 సం.కు వేడిగాలితో నూదుట ప్రవేశ పెట్టబడెను.

అమెరికాలో సుమారు క్రీ. శ. 1619 సం. నందు మొదటిసారిగా జేమ్సు నదితీరమున నున్న వర్జీనియాలోను, న్యూ ఇంగ్లండులోను లోహపరిశ్రమ స్థాపింపబడెను. దాదాపు 100 సం. లకు పిమ్మట ప్రప్రథమమున గాలిని ఊదు కొలిమి నిర్మింపబడెను. నేటి భారతదేశము నందలి లోహముయొక్కయు, ఉక్కు యొక్కయు పరిశ్రమలకు క్రీ. శ. 1872 సం. వరకు పునాదులు వేయబడలేదు. పాశ్చాత్య ప్రమాణములనుబట్టి మందముగా పరిగణింపబడినను అప్పటినుండి ఈ పరిశ్రమల అభివృద్ధి ఇచ్చట నిబ్బరముగా సాగుచునే యున్నది.

దాదాపు 100 సం. ల క్రితము వరకును వాడుకలోనున్న కొలుములన్నియు మోటురకమునకు చెందినవే అనవచ్చును. అవి సాధారణముగా ఛిన్నాగ్రములు గల సూచ్యగ్ర స్తూపములవలె నుండును. అవి 20 అడుగులు మొ. 30 అడుగుల యెత్తు కలిగియుండును. వీటి అడుగుభాగము నందలి వ్యాసము 8 అడుగులును (ఈ వ్యాసమే కొలిమియందు ఎక్కువ వెడల్పుగల స్థలము) పైభాగము నందలి వ్యాసము 4 అడుగులును ఉండును. దీని చుట్టు రాతికట్టడముండును. పొయ్యి, అడ్డుకోతయందు చదరముగా గాని, గుండ్రముగా గాని ఉండును. కొలిమికి రోజు 1కి 1 నుండి 6 టన్నుల పరిమాణము కల ఇనుమును ఉత్పాదనచేయు శ క్తి యుండెడిది. నేటి కొలుములు రోజు 1కి 1000 టన్నుల కంటె ఎక్కువ పోతఇనుమును (Pig iron) తయారుచేయును. ఒక్కొక్క టన్ను ఇనుము తయారగుటకు. 1800 పౌనుల కంటె తక్కువ కారుబొగ్గు (coke) వ్యయముగును. దీనినిబట్టి లోహపరిశ్రమ క్షేత్రమునందు అసామాన్యమయిన అభివృద్ధి ఘటిల్లినట్లు గ్రహింపవచ్చును. నేటి లోహపరిశ్రమలోని ముడిఖనిజములనుండి ఇనుమును ఉత్పాదనము చేయు పద్ధతి ' పైరోకెమికల్ ప్రాసెస్సు' యొక్క అభివృద్ధియందలి పరాకాష్ఠను తెలువును.

రెండువందల సంవత్సరముల క్రిందట బ్రిటనులో 17,000 టన్నుల ఇనుముమాత్రమే ఉత్పాదనము చేయబడెను. నూటఏబది సంవత్సరముల క్రిందట దాదాపు 6,00,000 టన్నుల ఇనుముమాత్రమే ఉత్పాదనము చేయబడెను. క్రీ. శ. 1952 లో అచట 10,552,100 టన్నుల ఇనుము ఉత్పత్తి కావింపబడెను. ఈ అంకెలు అచట ఈపరిశ్రమయందు జరిగిన బ్రహ్మాండమయిన అభివృద్ధిని తెలుపును.

ఇనుమును తయారుచేయుట - అభిధమన బ్రాష్ట్రము (Blast Furnace) : అభిధమన బ్రాష్ట్రము అనుకొలిమి, గనినుండి తీయబడు ముడిఇనుమును సంస్కరించును. ఈ ముడిఇనుము భూతలముక్రింద కొలది లోతునుండి తీయబడినదై యుండును. ఇది సాధారణముగా, ఇసుక, అల్యూమినా మొదలగు మట్టి పదార్థములతో కలిసి యుండును. ఈ పదార్థములు అభిధమన బ్రాష్ట్రమున కరగింపబడి ధాతుమల (slag) రూపమున తొలగిపోవును. ఈమాలిన్యమును కరగించి వేరుపరచుటయందు తోడ్పడుటకయి సున్నపురాయి మరియొక ముడిపదార్థము అవసరమగుచున్నవి. ముడి ఇనుమునందుగల మాలిన్యమునుబట్టి కొలది ప్రమాణముగల సున్నపురాయి ఉపయోగింపబడును. ముడి ఇనుమువలె సున్నపు రాయికూడా (గనులనుండి) త్రవ్వి ఎత్తబడి అభిధమన భ్రాష్ట్రము యొద్దకు ఓడమీదగాని రైలుమీదగాని తీసికొనిపోబడును.

సాధారణముగా మనకు ఎక్కవ వేడిమిగల మంట అతిత్వరగా కావలసినప్పుడు తిత్తులతో గాలిని మంటక్రిందికి ఊదుదుము. అట్లే ఈ అభిధమనబ్రాష్ట్రముయొక్క అడుగుభాగమున; పెక్కు రంధ్రములు కలవు. వాటిద్వారమున ఎక్కువ పీడనముగల వేడిగాలి ఎడతెగకుండా ఊదబడును. అందుచేతనే ఈకొలిమిని అభిధమనభ్రాష్ట్రము అందురు.

అభిధమనభ్రాష్ట్రముయొక్క వర్ణనము : నేటి అభిధమనబ్రాష్ట్రము 90-100 అడుగుల ఎత్తుగాను, గుండ్రముగాను అగ్నీష్టకములచే (Fire bricks) నిర్మింబబడిన కట్టడము. దీని పైభాగము బిగువైన ఉక్కురేకుచే ద్రఢీకృతమయి యుండును. దీనిలోపలనున్న గుండ్రని ఖాళీస్థలము యొక్క వ్యాసముల పరిమాణములు మారుచుండును. కొలిమియొక్క శక్తి ననుసరించి దానిఎత్తు 80 అడుగుల

142