విజ్ఞానకోశము - ౨
ఈరాను (చ)
ఆరామములును దర్శనీయములైనవి. ఈ పట్టణములో పెక్కు మసీదులును. కళాశాలలును, సత్రములును, స్నాన గృహములును నిర్మితములయ్యెను. ఈ కాలపు భవనములలో నేలపై చిన్న చిన్న గాజుముక్కలతో సప్త వర్ణములు ఏర్పడునట్లు అలంకరణ మొనర్చుట సర్వ సాధారణముగ నుండెడిది. సఫావీద్ రాజుల కాలములో అనేక తత్త్వ గ్రంథములు విరచితములయ్యెను. కాని ఇయ్యవి కేవల వ్యాఖ్యానములే కాని స్వతంత్ర రచనలు కావు. కవిత్వములోకూడ ఈక్షీణదశ ప్రవేశించెను. ఆనాటి కవులు భావ ప్రాశస్త్యము నెడ అశ్రద్ధ వహించి పదాడంబరము కొరకై మిక్కిలి ప్రాకులాడసాగిరి. పద్యములను ముందునకును వెనుకకును కూడ చదువుట కనుకూలముగ రచించుటలో ఆనాటి కవులకు కుతూహలము మెండుగ నుండెను. కవిత్వమున సాము గరిడీలు ఈ యుగమున విస్తారముగ సాగెను. పారసీకమున రత్న కంబళముల నేత చాల ప్రసిద్ధిగాంచినది. 16, 17 శతాబ్దులలో ఈ పరిశ్రమ అత్యుత్తమస్థాయిని పొందెను. ఆ తివాసీలు పనితనమందును, అందమునందును, ప్రపంచమున నెచ్చటను సాటిలేనివి. సిల్కు, మఖమలు వస్త్రములను, జరీ బట్టలను అత్యంత సుందరముగ ఆకాలపు పారసీకపు నేతగాండ్రు సిద్ధముచేయుచుండిరి. పింగాణీ పాత్రలను తయారుచేయుటలో కూడ ఈ యుగమున పారసీకపు పనివాండ్రు ఖ్యాతిని గాంచిరి. చిరకాలము నుండియు చీనావారు ఈ పరిశ్రమకు పెట్టినది పేరు. ఈ పరిశ్రమ యందు తమ దేశపు కార్మికులకు తరిఫీదు నిచ్చుటకై
పారసీక ప్రభువులు చీనానుండి అనేక కుటుంబములను ఆహ్వానించిరి.
క్రీ. శ. 1731 వ సంవత్సరమున నాదిర్ అను సర్పారు సఫావీదు వంశపురాజును రాజ్యభ్రష్టుని కావించి తానే అధికారము వశపరచుకొనేను. ఈతడు నాదిర్ షా అను బిరుదును వహించెను. ఈరాజు పారసీకమునంతను పాలిం చుటయేకాక, ఆఫ్ఘనిస్థానము పైనను, భారతదేశము పైనను దండెత్తిపోయెను. నాదిర్ షా ఢిల్లీ పట్టణమును దోచుకొని, అచ్చటి నుండి మొగలు చక్రవర్తుల మయూర సింహాసనమును, అపారమగు ధనమును కొల్లగొట్టుకొని పోయిన విషయము అందరకును విదితమే. ఈతని అనంతరము ఈరాను దేశమందు పలువురు రాజులు పరిపాలన చేసిరి. కాని వారి కాలమున దేశమునం దెట్టి అభివృద్ధి యును సాగలేదు. 18, 19 శతాబ్దులు రెండును ఈరాను దేశ చరిత్రయందు క్షీణయుగములని చెప్పవలెను. ముఖ్యముగ పందొమ్మిదవ శతాబ్ది యందు ఈరాను ప్రభువులు బలము చాలతగ్గిపోయెను. బ్రిటను, ఫ్రాన్సు, జర్మనీ, రష్యా మున్నగు పాశ్చాత్య జాతుల వారు ధనకాంక్ష తోడను, అధికార కాంక్షతోడను, ఈరాను దేశపు రాజ్యాంగములో జోక్యము కల్పించుకొనసాగిరి. ఇందు ముఖ్యముగ బ్రిటను, రష్యా దేశములకు ఈరానును గూర్చి తీవ్రమైన పోటీ ఏర్పడెను. సామ్రాజ్య కాంక్షతో రష్యావారు ఈరానును వశపరచుకొనవలెనని ప్రయత్నములు చేసిరి. బ్రిటిషువారికి కూడ ఇంచుమించుగ ఇట్టి కోరిక యేఉండెను. తమ భారతీయ సామ్రాజ్యమునకు సమీపమున నున్న పారసీకమునందు బలవంతులగు రష్యా ప్రభుత్వము వారు స్థావరము లేర్పరచుకొనుట బ్రిటీషువారికి ఇష్టములేదు. కావున ఇరుపక్షముల వారునుకూడ పారసీక ప్రభుత్వము నుండి వీలైనన్ని ఆర్థిక సౌకర్యములను కల్పించుకొనుటకై యత్నించిరి. బ్యాంకులు స్థాపించుట, అయోమార్గముల నిర్మించుట, గనులు త్రవ్వుకొనుట, పన్నులు లేకుండ పారసీకములో “వ్యాపారముచేయుట, మున్నగు అంశము లీ ఆర్థిక సౌకర్యములలో చేరియున్నవి. ఈయుద్దేశములతో రష్యా, బ్రిటను దేశములవారు పారసీకపు రాజులకు చాల ఒత్తిడి కల్గించసాగిరి. ఇది ఇట్లుండగా పారసీకులలో పలువురు పాశ్చాత్య విద్యలను, విజ్ఞానమును అలవరుచుకొని, దేశమున ప్రజాస్వామిక పరిపాలనము కావలయునని తీవ్రమగు ఆందోళనము జరుపసాగిరి. కాని రాజులు మాత్రము ప్రజల కోరికలను మన్నింపలేదు. అందులకు మారు ప్రజాస్వామ్య సిద్ధాంతముల కనుకూలురగు వారిని అణచి వేయుటకై సర్వవిధములు యత్నించిరి. ఇరువదవ శతాబ్ది యందలి మొదటి ఇరువది సంవత్సరములు కూడ ఇంచుమించు ఇట్లే గడచెను. 1917 వ సంవత్సరమున రష్యా యందు జారు చక్రవర్తుల ప్రభుత్వ మంతరించి, సామ్యవాదుల ప్రభుత్వ మేర్పడిన తరువాత రష్యావారు తమకీవరకు పారసీక మునందేర్పడి యున్న న్యాయ విరుద్ధమగు సమస్త సదుపాయములను తమంత తామే విడచి