Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈరాను (చ)

సంగ్రహ ఆంధ్ర


ముఖ్యముగ పేర్కొనదగి యున్నవి. జరతుష్టుడు స్థాపించిన మజ్దామతము పారసీకమున సర్వత్ర వ్యాపించేను. ఈ మతధర్మములు గ్రంథస్థములు కావింపబడెను, కాని పారసీక ప్రభువులు నూతనముగ నెలకొల్పబడిన క్రైస్తవ మతమును బాధింపలేదు. పహ్లవీ అను నూతనలిపి ఈ కాలముననే వృద్ధిచెందెను. ఈ కాలమునాటి శాసనములు నేటికిని లభ్యమగుచున్నవి. ఇవి పహ్లవీ లిపిలో వ్రాయబడి యున్నవి. పార్థియనుల భవన నిర్మాణమునందును, శిల్పకళ యందును గ్రీకు, బౌద్ధ ప్రభావములు చక్కగా కాననగును.

క్రీ. శ. 211వ సంవత్సరమున పార్థియను రాజుల అధికార మంతరించేను. ససానియా (Sasanian) వంశము వారి పరిపాలన ప్రారంభమయ్యెను. ఈ వంశమున సుమారు నలుబదిమంది రాజులు కలరు. వీరు 430 సంవత్సరముల కాలము ఈరాను దేశమును పాలించిరి. ఈ పారసీక ప్రభువులకును, రోమను చక్రవర్తులకును తరచు యుద్ధములు జరుగుచుండెడివి. వీరికాలమున మజ్దామత మింకను దృఢపడెను. కాని ఇతరమతస్థు లేవిధముగను బాధింపబడలేదు. మజ్దామతమునకు సంబంధించిన అనేక దేవాలయములు దేశమం దెల్లెడల నెలకొనెను. ఇందు అగ్నిపూజ సాగు చుండెడిది. ప్రతి గ్రామమునందున ఒక పురోహితుడుండెడివాడు. ఈతడు మతవిధులను సక్రమముగా నిర్వర్తించు చుండెను. చక్రవర్తి, దేవదేవుడగు "అహుర్ మజ్దా" యొక్క ప్రతినిధి కావున అతడు మానవాతీతుడైన ఒక వ్యక్తియను భావము సర్వత్ర వ్యాపించెను. సంఘమునందు ఉన్నత వర్గములు, హీన వర్గములు అను విభేదము లేర్పడెను. పారసీక ప్రభువులు సమర్ధులైన అధికారుల సహాయమున రాజ్యపాలన చక్కగ సాగించిరి. ససానియా యుగమునందు పారసీకమున జాతీయభావము బాగుగా బలపడెను. ఆ కారణమున మతమునందును, భాషయందును, శిల్పకళ యందును పౌరసీకుల జాతీయతయు, స్వతంత్ర భావములును ద్యోతక మగుచున్నవి. ఈ యుగమునందు అనేక నూతన గ్రంథ ములు వ్రాయబడెను. ఇతర భాషల నుండి పుస్తకములు అనువాదము కావింపబడెను. ఇవియన్నియు క్లిష్టమైన పహ్లవీలిపిలో వ్రాయబడినవి. . ఈ కాలమునాటికి ఈరానీ భాష సులభతరమై ఆధునికమగు పారసీభాషకు సమీపముగ రాసాగెను. ఈ యుగమందు సజ్దామతమునకు మూలమైన "అవేస్తా" గ్రంథమునకు అనేక ప్రతులు వ్రాయబడెను. ఇందు వాడబడిన లిపి "అవేస్తా" అనబడు ప్రత్యేక లిపి. ససానియా చక్రవర్తుల కాలమున పారసీక సామ్రాజ్యమునకు షాపూరు అనునది ముఖ్యపట్టణము.

క్రీస్తుశకము ఏడవ శతాబ్దియందు ససానియావంశ మంతరించెను. రోమక సామ్రాజ్యమునకును, పారసీక సామ్రాజ్యము నకును నడుమ తరచు యుద్ధములు సాగు చుండినట్లు విదితము. ఈ యుద్ధములవలన రెండు సామ్రాజ్యములును చాల క్షీణదశకు వచ్చెను. ఈరాను దేశమున సాంఘిక వైషమ్యములు హెచ్చెను. ఉన్నతవర్గముల వారికిని తక్కిన ప్రజలకును తీవ్రమగు మనస్పర్ధలు బయలుదేరెను. ఇదే సమయమున ఇస్లాము మతమును నూతనముగ స్వీకరించిన అరబ్బులు మతావేశముతో వివిధ దేశముల జయించుచు పారసీక దేశముపై పడిరి. క్రీ. శ. 641 వ సంవత్సరమున నిహావంద్ అను ప్రదేశము ససానియా ప్రభువుల సేనలు సంపూర్ణముగ ఓడిపోయెను. వారి రాజ్య మంతరించి మహమ్మదీయులగు అరబ్బుల యుగము ప్రారంభమయ్యెను.

క్రమక్రమముగా ఈరాను దేశమంతయు అరబ్బులకు వశమయ్యెను. ఇస్లాము మతముకూడా పారసీక ప్రజలలో వ్యాపింపసాగెను. సుమారు ఒక శతాబ్ది కాలము పారసీక దేశమును అరబ్బులగు “ఒమయ్యద్ ఖలీఫాలు" పరిపాలించిరి. ఈ యుగమునందు పారసీకమున రాజుల నిరంకుశత్వ మంతరించెను. సర్వమానవులు సమానులు అను భావము వ్యాపించెను. ఈ కాలమున రాజకీయముగ అరబ్బులదే పైచేయి అయినను, సాంస్కృతిక విషయములలో ఈరానీ ప్రజల ప్రాముఖ్యము నశింపలేదు. క్రమక్రమముగా పౌరసీకులకు విదేశీయుల పరిపాలన యెడల విసువు జనించెను. క్రీ. శ. 763 వ సంవత్సరమున అబ్బాసీ వంశపు ఖలీఫాలు "ఒమయ్యద్ ఖలీఫాల"ను ఓడించి నూతన రాజ్యమును నెలకొల్పిరి.

అబ్బాసీవంశపు ఖలీఫాలు స్థానికులగు పారసీకులు. వీరి ముఖ్యపట్టణము జగత్ప్రసిద్ధిచెందిన బాగ్దాదు నగరము. ఇచ్చట పరిపాలన కావించిన వారిలో హారూన్ అర్ రషీద్