Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - ౨

ఈనాటి యుద్ధ సాధనములు


మును గూర్చియు, సముద్ర గర్భమునందు చరించు జలాంతర్గాముల యొక్క యుద్ధప్రక్రియను గూర్చియు ప్రత్యేక శ్రద్ధాసక్తులతో గూడిన విచారణ ఆవశ్యకమగుచున్నది.

భూయుద్ధము : ఈనాడు కేవలము భూయుద్ధమనునది లేనేలేదు. ఆంఫిబియస్ (Amphibious) విమాన యుద్ధ ప్రక్రియల కారణముగా భూయుద్ధములు అంతరించినవి. భూమిలో పాతి పెట్టబడిన ప్రేలుడు గనులు ఈనాటి భయంకరమైన రక్షణసాధనములై యున్నవి. వీటిపై లోతుగా అచ్చటచ్చట టాంకులను విధ్వంసముచేయు తుపాకులు కప్పబడి యుండును. అక్కడక్కడ అమర్ప బడిన ఫిరంగుల తోడ్పాటుగల మరతుపాకుల చిక్కములు ఇందుండును. మీట నొక్కగానే ప్రేలెడు ఫ్యూజులు (fuses) కూడ ఇం దమర్పబడియుండును. శత్రువుల ప్రదేశముపై దిగి సన్నద్ధరక్షణశ్రేణులను భేదించి, శత్రు మధ్యములోనికి చొచ్చుకొనిపోవుట కష్టసాధ్యమైన పని. కావున భవిష్యద్యుద్ధము వలన ఎక్కువ భీతి అనవసరము .

భూయుద్ధములో రక్షణవిధానపు టెత్తులు నానాటికి అభివృద్ధి చెందుచున్నవి. ఈ యుద్ధములందు ఇటీవల ఘటిల్లిన అభివృద్ధులలో పేర్కొనదగినవి : (1) ప్రాక్సిమిటీ ఫ్యూజు (Proximity fuse): దీనిలో ఒక చిన్న రేడియో సెట్టు అమర్చబడియుండును. ముందుగా నిర్ణయింపబడిన దూరములో భూమి పై భాగమున రేడియో సెట్టు సహాయముతో షెల్లులు (shells) వ్రేలును. ఈ పేలుడు వలన యుద్ధరంగములో నిలబడియున్న సైనికులపై ఫిరంగులదళము యొక్క విధ్వంసక శక్తి పది రెట్లు ఇనుమడించును. (2) బాజూకాలు (Bazookas): ఇవి మిక్కిలి బలమైన ఉక్కును సహితము తూట్లు గావింపగలవు. రాకెట్లు అమర్చబడి కచ్చితముగా లోపల చొచ్చుటకు ప్రసిద్ధములయిన విమానములే అత్యంత శక్తిమంతములైన ఆంటి టాంక్ (Anti-tank) ఆయుధములు. (3) విమానములలో తీసికొనిపోబడు పదాతుల యొక్క ఆధునికపు దాడి: ఉదాహరణము : (1) పారచూటు (గాలిగుమ్మటములు); (2) విమానముల మీద నుండి సైనికులను క్రిందికి జారవిడుచుటకు సాధనములు (towed gliders); (3) రాకెట్టును పేల్చు ఓడలు (4) స్థలజల యుద్ధములకు (amphibious war fare) పనికివచ్చు డక్స్ (Ducks) అను ఓడలు. (5) నీటిలోని ఆటంక ములను తొలగించుటకు తోడ్పడు ఆధునిక పద్ధతులు. టాంకులను విధ్వంసముచేయు ఆయుధములలో అత్యంత శక్తిమంతము లైనవి రాకెట్లు.

సముద్రపు నీటిపై యుద్ధము నావికాదళము నిర్వహించు పాత్ర : (అ) శత్రువుల సముద్ర వ్యాపారమును భగ్న పరచి తమ వ్యాపారములను నిరాఘాటముగా సాగునట్లు చేసికొనుట, (ఆ) శత్రు విమాన దాడులనుండి స్వీయ విమాన దళమును రక్షించుకొనుట, (ఇ) శత్రు విమానదళములను ముఖ్యముగా జలాంతర్గాముల దళమును విధ్వంసము చేయుట, (ఈ) శత్రుతీరములమీద దిగుటకై జరుగు స్థల-జల యుద్ధ కార్యములలో సేనతో సహకరించుట.

ఈనాటి యుద్ధములను నిర్వహించు నౌకాదళములో పెద్ద పెద్ద ఓడలు అనవసరము. బ్రహ్మాండమైన యుద్ధ నావలు, విమాన వాహక నౌకలు ఉపయోగించు రోజులు గతించినవి. అయినను వాటికిని స్థాన మొసగవలసి యున్నది. విమానముల మీదను, నౌకలమీదను తీసికొని పోబడు ఆయుధములతోబాటు నూతన పద్ధతుల సహకారము అవసరమగు చున్నది. ప్రాక్సిమిటీ ఫ్యూజు, రాడార్ అనునవి రెండును కలిసినచో పటిష్ఠమైన ఒక విధ్వంసక శక్తి ఏర్పడగలదు. కాబట్టి సమర్థమైన యంత్రములతోను, ఆయుధములతోను కూడుకొని కట్టుదిట్టమయిన రక్షణ స్థితిగల ఓడలను సామాన్యమైన ఎత్తునుండి అల్ప సైనిక సంఖ్యగల విమానములు దాడిచేయుట ఆత్మ వినాశకరమైన చర్యగా పరిగణింపబడును.

సముద్రగర్భమునందలి యుద్ధము: ఇటీవలి ప్రపంచ చరిత్రమున దురాక్రమణదారులు రెండు పర్యాయములు జలాంతర్గాముల సహాయముతో ప్రపంచమును విచ్ఛిన్న మొనర్ప ప్రయత్నించిరి. సముద్రముమీద జరుగు వ్యాపారము అంతయు ముఖ్యముగ పెద్ద ఓడల మూలముననే జరుగవలసియున్నది. అందుచేత జలాంతర్గాముల యొక్క శక్తిని అల్పముగా భావించరాదు. సముద్ర గర్భమునందు జరుగు యుద్ధ విధానములో క్రొత్త వ్యూహములను, ఎత్తుగడలను ప్రవేశ పెట్టవలయును. రక్షక నౌకాదళమును ఉపయోగించుటకంటె చిన్న చిన్న సముద్రమార్గములలో