Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈజిప్టు (భూగోళము)

సంగ్రహ ఆంధ్ర


శాఖోపశాఖలుగా, పెద్ద కాలువలు, చిన్న కాలువలు ప్రవహించుచుండును. సముద్రతీరప్రాంతమున, మెంజలే సరస్సు, ఎడ్ కర్, బర్లోసు, మార్కొటిసు, మున్నగు ఎక్కువ లోతులేక వెడల్పయిన మడుగులు విస్తరించి యున్నవి.

ఎగువ ఈజిప్టునందు కొంతభాగము ఉష్ణమండలములో నున్నవి. కాని దేశమునందు ఎక్కువ భాగము కర్కటక రేఖకు ఉత్తరముగా నున్నది. ఇచ్చటి వాతావరణము మిక్కిలి స్వచ్ఛముగాను, పొడిగాను ఉండును. ఉష్ణోగ్రత క్రమబద్ధముగను, వేడిగను ఉండును. సంవత్సర మందు సుమారు ఏడు, ఎనిమిది మాసములవరకు ఉత్తరమునుండి వీచెడి విసురుగాలి పగటి సమయమందు వాతావరణమునకు సౌమ్యతను కలిగించును. ఈ విసురుగాలి, ఓడలు నదీ ప్రవాహమునకు ఎగువగా ప్రయాణము చేయుటకు సహాయపడును. చల్లటి గాలులు వీచుటచే చలికాలవు నెలలు చాల ఆహ్లాదకరముగా నుండును.జనవరి అన్నిటికంటే మిక్కిలి శీతలమైన నెల. అప్పుడు నైలునది లోయలోను ఎడారిలోను ఉష్ణోగ్రత 32° డిగ్రీలుగాని,అంతకంటె ఒకటి రెండు డిగ్రీలు తక్కువగా గాని ఉండుట కద్దు. అలెగ్జాండ్రియా, కైరో పట్టణముల గరిష్ఠ ఉష్ణోగ్రత సగటున, వరుసగా 99° F, 110° F (ఫారసు హైటు) ఉండును. దక్షిణమునకు పోయిన కొలది ఎడారి వాతావరణము సమీపించుచు ఉష్ణోగ్రతా వ్యత్యాసము ఎక్కువగుచుండును.

ఈజిప్టునందు అరణ్యములుగాని, అడవిమొక్కలు గాని లేవు. ఈ దేశమందున్న కొలది వృక్షజాతులలో ముప్పది రకముల ఖర్జూరము, టామరిస్క్, కారబ్, మున్నగునవి చేరియున్నవి. హాల్ఫా అను ఒక రకపు గడ్డియు, పేము మున్నగు చువ్వలును వృక్షసంపరగా నున్నవి. తామర పువ్వులు, నీటికలువలు మున్నగునవి పుష్పములలో ముఖ్యమైన రకములు.

అడవులు లేకపోవుటవలన అడజాతి ఫలములు తక్కువ, అడవి జంతువులతో గుంటనక్కలు, నక్కలు, సివంగులు, అడవి గాడిదలు, రకరకముల జింకలు ముఖ్యమైనవి, ఒంటెలు, గుఱ్ఱములు,గాడిదలు,కొమ్ములు గలిగిన పశు సముదాయములు, గొజ్జెలు ముఖ్యమైన పెంపుడు జంతువులు.

నల్ల సీసపురాయి, సున్నపురాయి, ఇసుక రాయి, మున్నగునవి ఇచ్చటి ముఖ్యమగు శిలా సంపద, ముఖ్యముగా నైలునది లోయలో ఇసుక రాయి విరివిగా నుండును. ఈజిస్టు దక్షిణపుకొన యందున్న "అస్వాను” పట్టణమునందు నల్ల రాయి విరివిగానున్నది. దేశములో చాల భాగము కదలికతో గూడిన ఇసుకతో కప్పబడి యున్నది. నైలునది సరిహద్దు లలోని నేల ఇట్టిదే

ఈజిప్టు వ్యవసాయ పరిశ్రమకు ప్రత్యేకముగా అనుకూలముగా నున్నది. ధాన్యములు, ప్రత్తి, మున్నగు వ్యవసాయపు వస్తువులు ఈ దేశమునందు విరివిగా ఉత్పత్తి అగుచున్నవి. అయినను ఈ దేశమునందు వ్యవసాయము చాల ప్రాచీనదశలో నున్నది. కచ్చితముగా చెప్పవలయుననిన ఈజిప్టు దేశము ప్రత్తిపంటకు మాత్రమే ప్రసిద్ధిచెందియున్నది. ఇందు ముతక ప్రత్తి ముఖ్యముగా లాభకరమును, జనసామాన్యము పండించునదియు