Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము -౨

ఈక్వెడార్


తీరమునుండి ఏండీ పర్వతముల పైభాగము వరకును విస్తరించి యున్నది. అందుచే ఈ దేశమున తీరమైదానము, పీఠభూమి, పర్వత ప్రాంతము కూడ కలవు.

తీరమైదానమునుండి ఏండి పర్వతములపైకి పోయిన కొలది శీతోష్ణస్థితియు, ఉద్భిజ్జములును మారుచుండును. నిరక్ష రేఖ యొద్దనున్న ఏండిపర్వత పాదముల యొద్ద సెల్వాలను నిరక్షరేఖామండలారణ్యము లున్నవి. ఎత్తునకు పోయినకొలది అరణ్యములు పలుచనై పచ్చిక బీడులు కాననగును. ఇంకను పైకిపోయినచో ఆకురాలు చెట్లును, అంతకు పైభాగములందు కోనిఫర్ అడవులును పెరుగును. పర్వతాగ్రములపై కరుగని హిమముండును. కొండలపై బరువులను మోయుటకు 'లామాలు' అను జంతువుల నుపయోగింతురు. అవి పొట్టి ఒంటెలవలె నుండును. వాటి పాదములు పర్వత ప్రాంతముల నెక్కుట కనువుగ నుండును.

తీరమైదానములలో సెల్వాలను ఉష్ణ మండలారణ్యములు ఉన్నవి. వరి, కాఫీ, ప్రత్తి, అరటి, చెరకు, పొగాకు, రబ్బరు, కేకవో (కోకో), ముఖ్యమయిన పంటలు. పీఠభూమిపై సమశీతోష్ణముగా నుండును. అచట గోధుమ పొలములును, నారింజ తోటలును కానవచ్చును. ఈ దేశములో ప్రధానమగు వ్యాపారపు పంట కోకో. వర్ణోపయుక్తమగు దారువు, కపోక్, సింకోనా చెక్క, వనస్పతి దంతము (Vegetable ivory) - అనునవి యితర ఆరణ్యక ఫలసాయములు.

ఈక్వెడారు దేశమునకు 'క్విటో' (2,09,932 జనాభా) రాజధాని. అది సముద్రమట్టమునకు 9,300 అడుగుల ఎత్తుగా నున్న పీఠభూమి పై నున్నది. దాని చుట్టును గల కొండలపై మంచు దట్టముగా నుండును. క్విటో సరిగా నిరక్ష రేఖపై నున్నను అచటి సరాసరి ఉష్ణోగ్రత 55° ఫా. మాత్రమే. వేసవి కాలపు, శీతకాలపు ఉష్ణోగ్రతలయందు భేదము 1° మాత్రమే ఉండును. అచటికి సమీపముననే కొటో పాక్సీ (12,000 అ.) అను సజీవాగ్ని పర్వత మున్నది. క్విటో నగరము భూకంపముల చేతను, అగ్ని పర్వత ఉత్ క్షేపముచేతను చాల నష్టమైపోయెను. గేక్విల్ (2,58,966 జనాభా) అనునది ఈ క్వెడారునకు ముఖ్యమైన రేవు పట్టణము. అచ్చటి నుండి ఎగుమతియగు వాటిలో కోకో ముఖ్య మైనది. గేక్విల్ నుండి క్విటోవరకును రైలు మార్గమున్నది. కాని దేశమందు రాకపోకలకు తగినన్ని అవకాశములులేవు. క్వెంకా (39,983 జనాభా), అంబటో (31,312 జనాభా)-ఇవి రెండును వర్తక వాణిజ్య కేంద్రములు. సూక్రే (Sucre) అను నాణెము ఇచ్చట చలామణి లోనున్నది.

ఈ దేశములో 17 రాష్ట్రములు, ఒక సంస్థానము, “గలాపగోసు” అనుద్వీపము గలవు. ఈద్వీప వైశాల్యము 3029 చ. మైళ్లు. 650 మైళ్ళ సముద్రతీరము గలదు. ఈ దేశము యొక్క జనసంఖ్య 1950 నాటి లెక్కలనుబట్టి 32,02,757. జనసాంద్రత చదరపు మైలుకు 30.6. దీనిలో 60% అమెరికను ఇండియనులు. కోకో తోటలు, రబ్బరు తోటలు మొదలగునవి యూరపునుండి వలసవచ్చిన వారి యధీనములో నున్నవి. ఇచటి ప్రజలు రోమను కాథోలిక్ మతమునకు చెందినవారు. వీరు ముఖ్యముగా స్పానిష్, క్వెకువా అను భాషలను మాట్లాడుదురు.