Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈక్వెడార్

సంగ్రహ ఆంధ్ర

చిన్న భాగము పునశ్చరణ చేయబడును. క్రైస్తవుల "ప్రభుప్రార్థన" ("Lord's Prayer") తో తుల్యమైన దానినిగా దీనిని భావించుచున్నారు. “నిన్నే మేము ఆరాధించుచున్నాము; నిన్నే మేము సహాయముకొరకు అర్థించుచున్నాము; నీ వనుగ్రహించినవారి మార్గమగు ఋజుమార్గమును, మాకు చూపుము; నీ వాగ్రహించెడి వారి మార్గమునకాని, తప్పుత్రోవకు చెదరి నడచెడి వారి మార్గమునకాని, మమ్ములను పోనీయవలదు.” అను మాటలతో నిది యంతమగుచున్నది.

ముస్లిం మసీదులోనే ప్రార్థన చేయవలెనన్న నిర్బంధము లేదు; నిజమునకు ఈశ్వరుని విశాల ప్రపంచమే అతని ప్రార్థనారంగము. కాని సాముదాయకముగ ప్రార్థన చేయుట ప్రశస్తతరము. నిజమునకు, ఇస్లాం సాంఘిక జీవనము నెప్పుడును విస్మరింపదు; ప్రజాజీవనమును భక్తి పరమైన అర్థముతో నింపుటకై ప్రయత్నించును. పంచ ప్రార్ధనలును మానవునకు తన గమ్యస్థానమును సతతము జ్ఞాపకము చేయుచుండుటకై ఉద్దేశింపబడినవి.

మూడవ స్తంభము  : 'జకాత్ ' లేక భిక్షాదానము. మొదటిలో బహుశః ఇది ఐచ్ఛికమై యుండెడిది; కాని తరువాత ఇది ధనము, ధాన్యము, పశువులు, పండ్లు, వర్తకపు సరుకు మొదలగు ఆస్తిపై నిర్బంధముగా వసూలు చేయబడు నొక పన్నుగా పరిణమించినది. సాంఘిక న్యాయమును సమకూర్చుటకును, పెట్టుబడి దారి విధానము పెరుగకుండ నిరోధించుటకును ఇదిఒక ఉపాయమైయున్నది.

నాల్గవ స్తంభము : ఉపవాసము. పెక్కు ఇతర మతములలో నీ యుపవాస పద్దతి లేకపోలేదు. కాని ఇస్లాంలో చాల విశదముగా నిది క్రమబద్ధము గావింపబడి యున్నది. ఖురాన్ ఆవిష్కృతమైన పవిత్రమగు రంజాన్ చాంద్ర మాసమంతయును ఉపవసింపవ లెనని ఆ మతానుయాయులు ఆదేశింపబడుచున్నారు.

ఐదవ స్తంభము : పుణ్యక్షేత్ర సందర్శనము. జీవితములో ఒకమారు, సమర్ధతగల ప్రతిముస్లిము, స్త్రీయును, పురుషుడును సంవత్సరములో ఒక సముచిశ సమయమున మక్కాయాత్రకు ప్రయాణము చేయుట పవిత్రకర్తవ్యముగా నెంచబడుచున్నది.

ప్రతీ గొప్పమతమునకును ఒక ప్రత్యేక వ్యక్తిత్వము ఉండును. మూలధర్మ సిద్ధాంతములను సంక్షిప్తముగా విచారము చేసినంత మాత్రమున దానిలోని సంపూర్ణ పరమార్థతత్త్వము ఎంతమాత్రమును వ్యక్తము చేయబడదు. ఈ మతమందలి ఆరాధన విషయమునుబట్టి చూచినచో, ఇస్లాం కర్మకాండకు ప్రాధాన్యమిచ్చునది గాను, ధార్మిక జీవితపు టర్థమును, అంతస్సారమును పరిగణింపనిదిగాను కనబడును. కాని నిజమాలోచించినచో మతానుష్ఠానముల ననుసరించుటకు వలసిన సరియగు ఉత్తేజము నొసంగు భక్తి కిని, మతవిజ్ఞానమునకును తగు ప్రాముఖ్యమును ఇస్లాం పరిపూర్ణముగా నిచ్చుచున్నది. ఈ మతానుయాయులు ప్రార్థనసమయమందు, కాబా (Kaaba) దిక్కునకు అభిముఖులు కావలెనని ఆదేశింపబడుచున్నారు. కాని వారి ధర్మనిష్ఠాపరత్వము వారు తిరిగెడి దిక్కుతోనే పరిసమాప్తి కాదనియు, మనస్సులో నెలకొనవలయుననియును ఇస్లాం సుస్పష్టముగా హెచ్చరించుచున్నది. ఆరాధన యొక్క నిర్ణీత విధుల ననుసరించు టతో బాటు రేయింబవళ్ళు భగవంతుని స్మరించుచుండవలెనని మానవుడు ఆదేశింపబడుచున్నాడు. భక్తితత్పరు లానందించు భగవత్సామీప్యము, అట్టివారికి ఉత్తర జన్మలో ప్రసాదింపబడగల అల్లా దివ్యదర్శనము యొక్క అనిర్వచనీయానందము ఇహపరజీవిత సుఖము లన్నింటి కంటెను గొప్పవని అతడు కాలక్రమములో తెలిసికొనునట్లు చేయబడుచున్నాడు.

ష. హి

ఈక్వెడార్  : ఈక్వెడార్. దేశము దక్షిణఅ మెరికాలో ఏండీ (ఆండీస్) పర్వత శ్రేణుల మధ్య నున్నది. ఈక్వెడార్ అనగా స్పానిష్ భాషలో నిరక్ష రేఖపైనున్న దేశమని యర్థము. ఈ దేశమునకు ఉత్తర, ఈశాన్యదిశ లందు కొలంబియా దేశమును, తూర్పు దక్షిణములందు పెరూ దేశమును, పశ్చిమమున పసిఫిక్ మహాసముద్రమును ఎల్లలుగా నున్నవి. ఇది విస్తీర్ణమున 1,04,510 చ. మైళ్లు కలిగి పసిఫిక్