Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము -.౨

ఇబ్ని బతూతా

భయహేతువుగానుండిన ఈ రాజ్యము వాటిలో ఏదేనొక దానికి వశమగును. రాజ్యము యొక్క జననము, అభ్యుదయము, వినాశమునకు సంబంధించిన చక్రభ్రమణమునకు మూడు తరములు లేక 120 సంవత్సరములు పట్టునని ఇబ్ని ఖల్దూన్ చెప్పుచున్నాడు. అసాబియాత్ లేక గణ చిత్తమునకు సంబంధించిన సిద్ధాంతమిదియే. రాష్ట్ర నిర్మాణమునకు దారితీయు క్రమమును వర్ణించుటలో అసాబియాత్ సిద్ధాంతప్రవచనమునందు హాబ్సుకంటె ఇబ్ని ఖల్ధూన్ గంభీర పరిజ్ఞానమును కనబరచి యున్నాడని చార్లెను ఇస్సావి వక్కాణించి యున్నాడు. మానవుడు నిరంతరము అధికతరభాగ్యవంతమును, సౌఖ్యవంతమును అగు జీవితమును ఆశించి కృషి చేయువాడగుటచే పెక్కు చిక్కులతో కూడిన ఆర్థిక సమస్యలు వానిని ఎదుర్కొనును. జటిలములైన ఈ యార్థిక సమస్యలనుగూర్చి ఇబ్ని ఖల్దూన్ చర్చించి యున్నాడు. ఈ సమస్యలు వర్తక వాణిజ్యములు, పన్నులు, మూల్య సిద్ధాంతము, అవసరాలు, లాభనష్టములు, గుత్తహక్కులు, ఎగుమతులు, దిగుమతులు, కఱవు కాలములో దాచి పెట్టుట మొదలగు వానికి సంబంధించినవై యున్నవి.

పై విషయములను బట్టి మానవసంఘమునందలి గుణములయొక్క ఉత్పత్తి, అభ్యుదయము వినాశము లను వివరించెడి సకల శాస్త్రముల రంగములందు ఇబ్ని ఖల్ధూన్ మొదటి మార్గదర్శిగా నున్నట్లు స్పష్టము కాగలదు. "టోయన్ బీ (Toyanbee)" తన “చరిత్రపఠనము” అను గ్రంథపు మూడవ సంపుటమునందు నుడివినట్లు "దర్శన వైశాల్య గాంభీర్యములందును, విశుద్ధ బుద్ధిబలము నందును ధూసుడైడ్సు (Thucudides) తోను, మాషియ వెల్లీతోను ఇబ్ని ఖల్దూన్ సరిసమానముగా తులదూగినాడు." ఫ్లింటు అను. రచయిత తాను వ్రాసిన “చరిత్ర తత్వ చరిత్ర" అను గ్రంథమునందు ఇంకను ముందుకు బోయినాడు. "ప్రాచీనయుగమునగాని మధ్యయుగమునగాని క్రైస్తవ ప్రపంచము ఇంతటి ప్రతిభా సంపన్నుని ఒక్కని గూడ చూపలేదు. చారిత్రక సిద్ధాంత ప్రతిపాదకులలో మూడువందల సంవత్సరముల తరువాత "వీకో" (Vico) ప్రభవించు వరకు ఏకాలమందుగాని, ఏదేశమందుగాని ఇతనితో సమానుడులేడు." అని ఫ్లింటు నొక్కి చెప్పినాడు. యథార్థముగ ఇతడు ప్రపంచములో మొదటి శాస్త్రీయ చరిత్రకారుడు. ఇతడు చరిత్రరచనమీదను, చరిత్ర శాస్త్రము పైనను మాసిపోని ముద్ర వైచిన యట్టివాడు.

ఇట్లు అసాధారణ ప్రజ్ఞావంతుడును, మానవ సమస్యల విషయములో అంతరదృష్టి సమన్వితుడును అగుటచే నీ ప్రతిభాశాలి తన దర్శన వైశాల్యమునందును, సృజనాత్మకబుద్ధి విశేషమునందును, వ్యాకృతి పటుత్వమునందును తరువాతికాలపు ఐరోపేయ విద్వాంసులకు అగ్రగామి అయియుండుట అద్భుతముకాదు.

హెచ్. కె. ఎస్.

ఇబ్ని బతూతా : ఇబ్ని బతూతా అను వంశ నామముగల అబూ అబ్దుల్లా మహమ్మద్ ఒక గొప్ప మహమ్మదీయ యాత్రికుడు. ఈతడు మూరు" జాతికి చెందినవాడు. స్పెయిను దేశమునందు శాశ్వతముగ నెలకొనిన అరబ్బులను క్రైస్తవులు మూరులని పిలచెడివారు. ఇబ్ని బతూతా క్రీ.శ. 1304వ సంవత్సరమున టాంజీయరు నందు జన్మించెను. ఈతనికి బాల్యము నుండియు దూరదేశములకు యాత్రలు చేయవలెనని కోరికయుండెను. ఆయుద్దేశ్యము ననుసరించి యాతడు క్రీ. శ. 1325వ సంవత్సరమున తన యాత్రలు ప్రారంభించెను. ఈతడు మధ్యధరా సముద్రతీరము ననుసరించి టాంజియరు నుండి అలెగ్జాండ్రియావరకును ప్రయాణము కావించెను. ఆపైన నాతడు పాలస్తీనా, అలెప్పో, డెమాస్కస్ లకుపోయి, పవిత్రస్థలములగు మక్కా మదీనాలను, అలీ యొక్క సమాధి నెలకొనియున్న నెజిఫ్ ను సందర్శించెను. బాస్రా, ఇస్ఫహాన్, షిరాజ్ నగరములనుచూచి తిరిగివచ్చి, ఇబ్ని బతూతా రెండవ పర్యాయము మక్కా నగరమును సందర్శించెను. ఈ పర్యాయ మాతడు మక్కాయందు మూడు సంవత్సరములు నివసించెను. ఆఫ్రికా ఖండము యొక్క తూర్పుతీరము ననుసరించి దక్షిణముగ సముద్రయానము కావించి, ఈ యాత్రికుడు మరల నుత్తరాభిముఖముగ మరలి పారసీక గుడమును చేరెను. ఇబ్నిబతూతా మూడవ పర్యాయము పవిత్రస్థలమగు మక్కాను సందర్శించెను. ఈత డింకను అనేక ప్రదేశములకు పోయెను. ఇబ్ని బతూతా 55 వ ఉత్తర రేఖాంశవృత్తమువరకును ప్రయాణము కావించి