Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - ౨

ఇబ్ని ఖల్డూన్

చెడుగు నున్మూలించుటకును, దీనపతిత జనోద్ధరణమునకును, ప్రజానీకపుస్థితిని మెరుగుపరచుటకు యోగ్యమగు ప్రభుత్వ వ్యవస్థను నెలకొల్పుటకును రాజునకు ధనమావశ్యకమని అబిర్ - రబీ వివరించెను. ఇట్టి భావములనుబట్టి అబిర్ - రబీ దృష్టియందున్న ప్రభుత్వ ధ్యేయ మెట్టిదో మనకు స్పష్టమగును.

అబిర్- రబీ గ్రంథమందున్న మరియొక విశేష మేమన దానిలో జాతిమత దురభిమాన సూచకమగు పదమే లేదు ; ఏవర్గ మేని ఉద్యోగమున కనర్హమని ఒక్క మాట యైనను లేదు. శాస్త్రప్రణాళికల (వీనిని గూర్చి విపుల వివరణములు గలవు.) యందు చరిత్రను, రాజనీతిని ఒకదాని కొకటి అనుబంధముగా నిరూపించి, రాజ్య మందలి ఉన్నతోద్యోగులందరకును చరిత్రజ్ఞాన మవసరమని చెప్పెను. ఐనను విజయవంతమగు జీవితమునకును, విజయవంతమగు రాజ్యత్వమునకును నీతి నాధారముగాగొని రచయిత స్వతస్సిద్ధముగా నేది మంచిదో నైతికముగా నేది సత్యమైనదో దానినే బలపరచినాడు.

హె. కె.యస్.

ఇబ్ని ఖల్దూన్ (Ibni Khaldun) : ఇబ్ని ఖల్డూన్ మధ్య యుగపు ఐస్లామిక తాత్వికవేత్తలలో నొకడు. ఇతడు స్పెయిన్ జాతీయుడు. కాస్టిల్లె రాజయిన మూడవ ఫెర్డినండు సెలిల్లే నగరమును 1248 లో పట్టుకొనగా, ఈ స్పెయిన్ వంశీయులు సెలిల్లే నుండి ట్యూనిసు నగరమునకు వలస వెళ్ళిరి. 1332 లో ట్యూనిసు నగరమునందే ఖల్డూన్ పుట్టియుండెను. ఇచ్చట విద్యాభ్యాసము ముగిసిన తరువాత ఇతడు మొరాకోకు పోయి ఫెజ్ సుల్తాను నొద్ద ఉద్యోగిగా ప్రవేశించెను. తరువాత నితడు 'గ్రానడా' కు పోయెను. తరువాత గ్రానడా సుల్తాను పక్షమున కాస్టిల్లె క్రూర రాజయిన 'పెడ్రో' వద్దకు రాయబార సంఘనాయకుడుగా వెడలెను. గ్రానడాను పూర్తిగ 1374 లో వదలి పెట్టిన తరువాతనే ట్యూనిసుకు సమీపముననుండిన ఎడారిలోని యొక ప్రదేశమున స్థిరనివాస మేర్పరచుకొనేను. ఇచటనే అతడు తన సుప్రసిద్ధమైన 'ప్రొలో గోమేనా' అను గ్రంథరచనకు పూనుకొనెను. ఈ ప్రదేశము పట్టణజీవనమునకు దూరమయి అనుకూలముగా నుండెను. ఇచ్చటనే 1382 లో “విశ్వ చరిత్ర" మహాగ్రంథమును పూర్తి చేసెను. ఇది పది సంపుటముల ఉద్గ్రంథము. రాజకీయ రాయబారాల సంబంధ ముస ఇతని సేవ ఇంకను అత్యవసరముగా గనుపడుచుండెను. ఈజిప్టు యొక్క "మామెలుకు” సుల్తాన్ పక్షమున టామర సేన్ తో రాయబారము సలుపుటకు ఇతడు నియోగింపబడెను. తరువాత నితడు కెయిరీలో ముఖ్య న్యాయాధిపతిగా నియోజితుడయ్యెను. 1406 లో అచ్చటనే ఇతడు మరణించెను.

విశ్వచరిత్ర మను మహాగ్రంథమేగాక, ఇతని కీర్తిప్రతిష్ఠలకు "ప్రోలోగో మెనా" అను గ్రంథముకూడ ఎక్కువగ దోహద మొసంగియున్నది. తాను నిర్ధారించిన యంశములను నిరూపించుటకు ఇతడు వేదాంతమును, వ్యాకృతి పద్ధతిని సహాయము గైకొనెను. తన భావముల విశదీకరణమునకు చారిత్రకాంశములనుగూడ అటనట చూపియున్నాడు. చరిత్రయు ఒక శాస్త్రమని ఇతని యభిప్రాయము. రాజ్యముల అభ్యుదయ పథకములకు గల కారణములను దెలిసికొనుటకు చరిత్రను పఠించవలయును. అందువలన నే కాబోలు తాను రచించిన “ప్రోలోగోమెనా” లో ప్రకటించిన భావములను సిద్ధాంతీకరించుటకే అంత దీర్ఘకాలము తన శక్తియుక్తులను, కాలమును ఆ మహాచరిత్ర నిర్మాణమందు వినియోగించి నట్లు కనబడుచున్నది. చరిత్రకారులు ప్రమాదములకు గురి అగుట సహజమని వారికి హెచ్చరిక చెప్పినాడు. చరిత్రకారుని ఎదుర్కొను చిక్కులు మెండు. అతనికి లభించిన చారిత్రకాంశములు స్వార్థపరులు సేకరించినవి కావచ్చును. చరిత్రకారుని దృష్టిలో గాక భిన్నమైన మరియొక కారణార్థముగా ఆ చారిత్రకాంశములు సేక రింపబడి యుండవచ్చును. పరిస్థితులన్నియు సంపూర్ణముగ మారి చరిత్రకారుడు చేసిన నిర్ణయములు తారుమారు గావచ్చును, ఇట్టి ప్రమాదములలో పడకుండుటకై సాంఘికశాస్త్రము చరిత్రకారునికి సహాయపడుచున్నది. సాంఘిక శాస్త్రమనగా సంఘము యొక్క వివిధ స్వరూపముల అధ్యయనము. మరి యీ శాస్త్రము చరిత్ర కారుడు సేకరించిన యంశములపై నిర్మితమగుచున్నది.

సాంఘిక శాస్త్రమునకు ఆధారభూతములయిన ముఖ్య సిద్ధాంతములు ఈ క్రింది విధముగా నుండునని అతడు చెప్పుచున్నాడు.----