Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇనుము (భూగర్భశాస్త్రము)

సంగ్రహ ఆంధ్ర

ఆమ్లజని, గంధకము, భాస్వరము, ఉక్కులో ఇవి ఒక పరిమితిని మించియున్నచో అది వెళుసగును. ఆమ్లజని, గంధకము. ఈ రెండింటిని మాంగనీసును ఉపయోగించి వేరు చేయవచ్చును. ఖనిజములోని భాస్వరమంతయు ముడి ఇనుములోనికి దిగును. భాస్వర పరిమాణమును బట్టి ఉక్కు తయారగు విధానము నిర్ణయింతురు. భాస్వరము ఖనిజములో ఒకవంతు లోహమునకు 0.001 వంతుకంటే తక్కువగా నున్నచో "ఆమ్ల బెసిమర్ " విధానమున ఉక్కు తయారుచేయ వీలగును. భాస్వర మెక్కువగా (.015 వంతు వరకు) ఉన్నచో క్షార బెసిమర్ ' విధానమును అవలం బింతురు. ఈ పద్ధతికి కొలిమిగోడలు, లోపల, మెగ్నిషియా ఇటుకలచే పేర్చబడును. ఇనుములోని భాస్వరము ఇటుకల యొక్క మెగ్నీషియముతో కలిసి వేరగును. ముడి ఖనిజమున భాస్వరము తక్కువ ఉండుట మంచిది.

నిధులవర్ణన : మన దేశమునందు గల లోహనిధులు నాణ్యమునందును, నిలువల యందును, ప్రపంచమున మొదటిస్థాన మాక్రమించినవి.

పొరలరూపపు లోహ శిలాసమూహముల (Banded Iron Formations) నుంచి ఏర్పడిన హెమటైట్, ఇనుప ఖనిజములలో అగ్రగణ్యమయినది. హెమటైట్, సిలికాల యొక్క పలుచటిపొరలు, పరంపరగా నున్న ఈ శిలలు కేంబ్రియన్ (Cambrian) యుగమున అనగా 5000 లక్షల సంవత్సరములకు పూర్వము, విస్తారమైన సరస్సులయందేర్పడినవి. ఇవి రసాయనవిధానమున గాని, జీవ రసాయన (Bio-chemical) విధానమున గాని నిధులు ఏర్పడును. ఈ శిలోత్పత్తికి కావలసిన పదార్థములు లోహగర్భిత భూభాగమునుండి ప్రవహించు నదీజలముల ద్వారమున గాని, లేదా సముద్రగర్భము నందున్న అగ్ని పర్వతములనుండి గాని వచ్చియుండ వచ్చును. సాధారణవాతాహతి క్రమముననే ఇవి తయారయిన వన్న అభిప్రాయము గలదు. ఇందలి సిలికా ఇనుము చాలవరకు అగ్నిపర్వతములనుండి వెలువడిన ద్రవముల నుండియే కూడినదని కొందరి అభిప్రాయము. నీటిలో కరగియున్న లోహము యొక్క, సిలికా యొక్క అవ క్షేపణమును ఋతుభేదములు, ఆ నీటిలో నుండు సేంద్రియ ద్రవ్యములు (Organic Matter), నీటి యొక్క ఆమ్లగుణములు నిర్ధారణచేయును. ఈ విధముగా నీటి అడుగున ఏర్పడిన పొరల శిలలు భూభాగములుగా మారిన తరువాత భూతలము నకు సమీపమునందున్న భాగముల లోహపు పాలు క్రమముగా వృద్ధిచెంది నిధు లేర్పడినవి. సిలికా, పరివాహక బలములందు కరగిపోయి వేరుపడుటవలనను, శేషించిన భాగమునుండి వచ్చు ద్రావకముల ద్వారమున లోహము సమకూరుటవలనను, ఈ లోహపు వృద్ధి జరిగినది. ఈ రకపు హెమటైట్ నిధులు ఈ క్రింది రాష్ట్రములలో కలవు. బీహారునందలి సింగభూమ్ జిల్లా ప్రక్కనే ఒరిస్సాలోనికి యొంఝార్, బొనాయి ప్రాంతము (నిల్వ 8000 మిలియన్ టన్నులు) ; మధ్యప్రదేశమునందు బస్తరు, దుర్గ్, చాందా. జబల్ పూరు (6000 నుంచి 7000 మిలియన్ టన్నులు); బొంబాయిలో గల ధార్వారు, రత్నగిరి జిల్లా, వాటి ప్రక్కన గల పోర్చుగీసు, గోవా (30 మిలియన్ టన్నులు); మైసూరులో షిమోగా, చిక్క, మంగళూరు, బెంగుళూరు, చిత్రల్ దుర్గము, తుమ్ కూరు (2000 మిలియన్ టన్నులు) బళ్ళారిజిల్లాలో గల సందూరు ప్రాంతము (300 మిలియన్ టన్నులు); ఆంధ్రలోని కర్నూలు జిల్లా (4 మిలియన్ టన్నులు); హైదరాబాద్ లోని చిత్యాల (37 మిలియన్ టన్నులు); ఈ నిధుల హెమటైట్ ఖనిజమందు ధాతువు 60% కంటే ఎక్కువ కలదు.

హెమటైట్ గనులను, సింగథమ్, కెయింఝార్, మయూర్ భంజి జిల్లాలలోను, మైసూరులోని బాబాబుడర్' కొండలలోను, త్రవ్వుచున్నారు. వీటిలో ధాతువు 60 నుంచి 69% వరకు కలదు. ముడి ఖనిజము స్థూల రూపమునగాని, పొడిగాగాని దొరకుచున్నది. పొడిరూపపు ఖనిజము ప్రస్తుతము ఉపయోగపడుట లేదు. కాని మున్ముందు దానిని ఉండలుగాగాని, బిళ్ళలుగాగాని చేసి ఉపయోగించవచ్చును. ఇచ్చట మేలురకపు ముడిఖనిజముతో కలిసి, తక్కువరకపు ఖనిజములు (లోహము 45 నుంచి 50% వరకు) కూడ దొరకుచున్నవి. వీటితో కలిసియున్న హెమటైట్ జాస్సరు (Hematite Jasper) లో 20 నుంచి 25% వరకు లోహముకలదు.

పొరల రూపపు మేగ్నటైట్ (Banded magnetite) నిధులు, దక్షిణ మైసూరునందు (500 మిలియన్ టన్నులు);