Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము -౨

ఇటలీ భాషావాఙ్మయములు


నందలి మూడవ మహావ్యక్తి. ఇతడు డాంటీని విశేషముగా ప్రశంసించి యున్నట్లు ఈతని జీవిత చరితమువలన విశద మగుచున్నది. ఇతడు పెట్రార్కా యొక్క సన్నిహిత మిత్రుడు. ఇతడు లాటిను భాషయందుకంటె ఇటాలియను భాషలోనే అధిక సంఖ్యగల కావ్యములను రచించి యున్నాడు. తన ఇటాలియను రచనల మూలమున మహాకవుల కొరకు ఉద్దిష్టమయిన “విశ్వదేవాలయము"న ఇతనికి ఒక విశిష్టస్థానము లభించియున్నది. "నవలా" రచనకు ఇతడు జనకుడుగా ప్రసిద్ధినందెను. “డేకా మెరన్” అను నీతని రచన బహుళముగా "పునరుజ్జీవనము" యొక్క ఆరంభమునకు అత్యంత సన్నిహితమైన కారణమై యున్నది. డాంటీ వ్రాసిన "డివైను కామెడీ" తో పోల్చి దీనిని "హ్యూమను కామెడీ" యని సముచితముగా పేర్కొనియున్నారు. ఈ రచయిత యొక్క ప్రతిభను ఇంతకంటే గొప్పగా ప్రశంసించుట యెవరికిని తరముకాదు. ఇతని మిత్రుడును సమకాలికుడును అగు పెట్రార్కా ఒనర్చిన అనువాదములవలె బొకేషియో కావించిన గ్రీకు, రోమను గ్రంథముల అనువాదములు ఇటాలియను భాషా వాఙ్మయములో అత్యున్నత మైన సారస్వత ప్రాముఖ్య మును పొందియున్నవి.

“పునరుజ్జీవనము" ( Renaissance ) :- "పునరుజ్జీవనము" అని వ్యవహరింపబడు కాలమును గూర్చి సంగ్రహముగా చెప్పవలెనన్నచో, దీనిని "దీప్తి విజయము” అని చెప్పవచ్చును. మధ్యయుగముల అంధకారము పై హేతువు అను వెలుతురు విజయమును సాధించిన కాలమును ఇది సూచించును. స్వపక్ష దురభిమానము, వెట్టి భక్తి, మూఢవిశ్వాసము అను అజ్ఞానలక్షణముల యొక్క గట్టిపట్టునుండి హేతువు తుదకు విముక్తి పొందిన యుగమిది. ఇటాలియను వాఙ్మయములో ఈ కాలము “క్వాట్రో సెంటో" లేక 15 వ శతాబ్ది అని వ్యవహరింపబడుచున్నది. టర్కీ వారిచే కాన్ స్టాంటి నోపుల్ జయింపబడుట, అమూల్యములైన గ్రీకు పుస్తకములను, వ్రాతప్రతులను తీసికొని కాందిశీకులు అధిక సంఖ్యాకులుగా తూర్పు సామ్రాజ్యమునుండి ఇటలీ లోప్రవేశించుట, ఈ కాందిశీకులలో కొందరు ప్రముఖులు ఇటాలియను విశ్వవిద్యాలయములలో ఆచార్యులుగా నియమింపబడుట అనునవి గ్రీకు, రొమను సంస్కృతి యొక్క పునరుజ్జీవన భావనయందు నూతనాభిరుచిని కల్పించెను. లారెంజోడి మెడిసీ యొక్క ప్రత్యక్షపోషణ క్రింద ఫ్లోరెన్సులో 1450 లో ప్లేటోనిక్ పరిషత్తు ఒకటి స్థాపింపబడెను. ఇదియొక ప్రసిద్ధమైన కార్యసాధనము. నూతనమైన ప్లేటోత త్వమునకును, క్రైస్తవమతమునకును మధ్య సామరస్యమును కల్పించుటకై ఫిసినో అనునాతడు (1483-99) ప్లేటో యొక్కయు, ఫ్లాటినస్ యొక్కయు, సంపూర్ణ గ్రంథములను అనువదించెను. కాని, ఈ పునరుజ్జీవనోద్యమములో ప్రసిద్ధుడైనవాడు పీకో-డిలా- మిరాండోల అనువాడు. ఆతడు ఈ పునరుజ్జీవనోద్యమమునందు అత్యాశ్చర్యమును కొలుపు సాహసికుడుగా వర్ణింపబడినాడు. ప్లేటో తత్త్వము గూఢమైన ప్రేమతత్త్వము కారణముగా సౌందర్యాన్వేషణమును గొప్పగా ప్రకాశింపచేసెను. 15వ శతాబ్ది యందలి మహోన్నత భావములకెల్ల వన్నె దిద్ది, స్పెన్సరు మూలమున ఇంగ్లీషు కవితలో ప్రవేశించి, షెల్లీని తన కడపటి వారసునిగా చేసికొన్న దీ ప్లేటో తత్త్వము. ప్లేటో నూతన తత్త్వముతోపాటు మెడిసీ వంశజుడైన లారెంజొ యొక్క పరిపోషణము క్రింద 'చౌసన్స్ గెస్టె' (ఫ్రెంచి కవితా భేదము) యొక్క అనుకరణము మున్నగు ఇతర కవితాప్రక్రియలలో ఇటాలియను కవిత విస్తరింప దొడగెను. ఈ మెడిసీ వంశజులలో పెక్కుమంది రాజనీతివేత్తలుగా, కవులుగా, రోమను కాథలిక్ మతస్థులకు ప్రధానగురువులుగా, యుద్ధ వీరులుగా, పేరుగాంచి యున్నారు. కాసిమో, లారెంజోల యొక్క మహత్త్వము స్వీయ దేశీయ సారస్వత చరిత్ర పత్రముల యందు ముద్రిత మయ్యెను.

పునరుజ్జీవన యుగములో ఇటాలియను వచనరచనాభివృద్ధికి నికోటో మేకియా నేటీ (1469-1527) అను కవి కారకుడయ్యెను. రాజకీయ సిద్ధాంత ప్రతిపాదకుడుగాను ఆధునిక మైన ఇటలీ యొక్క ప్రవక్తగాను ఇతడు ప్రసిద్ధి కెక్కెను. ఇతడు పెక్కు రంగములలో కృషి చేసిన వాడు. ఇతని కీర్తికి జయపతాక ఇల్ ప్రిన్ సిపే అను గ్రంథము నేటి వరకు గూడ ఇది యూరపుఖండ రాజ్యతంత్రమునకు ఒక ప్రమాణ గ్రంథముగా వరలుచున్నది. ఈ కవిశైలి సులభమైనదై, సొంపైనదై యున్నది. ఇతని భాష సుశొ