Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇంద్రియములు

సంగ్రహ ఆంధ్ర


చేపల జ్ఞానేంద్రియ మండలము వింతగా నుండును. అవి తమ తల పైనను, శరీరము మీదను, ఉండు గుంటల యొక్కయు గీతలయొక్కయు సహాయమున నీటిలోని పరిసర వస్తువులనుండి వచ్చెడి పరావర్తనతరంగములకు క్షొభ్యత చూపుచు చీకటిలోకూడ సరియగు మార్గమున ఈదుకొని పోవుచుండును.

మానవునకు ప్రకోపకములయిన రసాయనిక పదార్థములకు క్షోభ్యతను చూపుటకు నోటియందును, నాసికాకుహరముల యందును, ఉభయ చరములకు, చేపలకు ఇతర జలజంతువులకు శరీరముమీద నంతటను గ్రంథులుండును. కరగిన పదార్థమునుండి రసాంకురములు (స్వాదము కుళములు) {taste buds) రుచిని గ్రహించును. సున్నితమగు పై భాగములు గల సన్నని గ్రహణ నాడులు చిన్న చిన్న రంధ్రములలో నుండును. సామాన్యముగా ఇవి నోటిలోగాని నోటికి దగ్గరగాగాని ఉండును. కొన్ని రకముల చేపలలో ఈ రసాంకురములు శరీరముమీద నందంతటను, మరి కొన్నిటియందు ప్రక్క రెక్కలయందును ఉండును. మానవుని నోటియందలి రసాంకురములు తీపి వస్తువులను, ఆమ్లములను, లవణములను, చేదు పదార్థములను కనుగొనగలవు. నీటియందు కరిగిన వస్తువుల రుచిని తెలిసికొనుటకు చేపలకును, ఇతర జలచరములకును ఘ్రాణేంద్రియము రసాంకురములవలె పనిచేయును.

సంతానోత్పత్త్యంగములు : సంతానోత్పత్తి అన్ని మొక్కలకు, జంతువులకు ముఖ్య ధర్మము, తనవంటి క్రొత్త వ్యక్తులను ఉత్పత్తిచేసెడి శక్తిని పందనోత్పత్తి శక్తి అందురు. పెక్కు శతాబ్దముల వరకు పాశ్చాత్యులు అనేక జీవులు, నిర్జీవ వస్తువులనుండి ఉద్భవించెనని నమ్మిరి, కాని అతిపురాతనమైన హైందవ ఇతిహాసములలో సంతానోత్పత్తికి స్త్రీ పురుష సంయోగము అవసరమని గుర్తింపబడియున్నది. ఫ్రాన్ సెసియో రెడి (Franceseo Redi 1626-1697) అనునాతడు బ్రతికియున్న క్రిములు, ఈగలు పెట్టిన గ్రుడ్లనుండియే, క్రిములును ఈగలును ఉత్పత్తి అగును అని నిరూపించెను.

సంతానోత్పత్తి 'బీజాశయములు' (Gonads) అనబడు లైంగిక గ్రంథులవలన జరుగును. పురుషులలోని వృషణములు, స్త్రీలలోని అండములు ప్రధానములైన సంతానో త్పత్త్యంగములు. పురుషులలోని వీర్యవాహికలు, వాటి అనుబంధ గ్రంథులు, లింగము, స్త్రీలలోని అండాశయ నాళము, గర్భాశయము, భగరంధ్రము సహాయ ఉత్పత్త్యంగములుగా పనిచేయును. లైంగికముగా పరిపక్వము నొందిన పిమ్మట, పెక్కు జంతువులయందు బాహ్యములయిన లింగభేదములు, ఇతర లైంగిక లక్షణములు పొడసూపును. లైంగిక గ్రంథులు గ్రుడ్లను, వీర్యమును తయారుచేయుటయే కాక, కొన్ని మాంసగ్రంధి రసద్రవ్యములను (Hormones) దాచి యుంచును. సహకారి ఇంద్రియముల యొక్కయు లైంగిక భేదములయు ఏర్పాటునకు ఈ మాంసగ్రంథి రసద్రవ్యములే కారణము.

దుప్పులకుండెడి బలసిన మెడ, ఎక్కువ గంభీరమైన స్వరము, రొమ్ములు; పెంపుడుపుంజులయందుండెడి కూత పెట్టెడిగుణము, వాటి నెత్తి పైనుండు జట్టు, ఆరెబొట్టెలు మున్నగునవి పై కికనబడు మరికొన్ని లైంగిక లక్షణములు.

బహుకణ గ్రంథులను లాలాజల గ్రంథులు, కాలేయ గ్రంథులు, క్షీరసార గ్రంథులు, చెమట గ్రంథులు తమతమ స్రవములను వాటి గొట్టములద్వారా ప్రవహింప చేయును. వెన్నెముక గల జంతువులు గొట్టములు లేని గ్రంథులను కలిగియుండును. ఈ స్రవములు రక్తముచే శరీరమునందలి వేరు వేరు భాగములకు కొంపోబడుచుండును. గొట్టములేని ఇట్టి గ్రంథులను అంతస్స్రవణ గ్రంథులు (Endo-crine glands) లేక నిర్వాహక గ్రంథులు అందురు. శరీరము యొక్క అభివృద్ధి పైనను దాని కృత్యములపైనను, వీటి స్వల్ప పరిమాణముల ప్రభావము చాలా విశేషముండును. మెదడునందుండు పోషక గ్రంథి, కంఠ గ్రంథులు (Thyroid) నాలుగు కంఠగ్రంథులు (Para thyroid), ముత్రపిండ ముల దాపున నుండు ఎడ్రెసల్ (Adrenal) గ్రoథి, వృషణములయందుండు గ్రంథులు గొట్టములు లేని ఇట్టివన్నియు, అంతస్రవణ గ్రంథులలో చేరును. ఇవి కొద్ది పరిమాణములలోనున్నను శరీరము యొక్క పెరుగుదలకును, పని చేయుటకును సహాయపడును. ఈ గ్రంథులను వీటి విధులను గురించి తెలుపు శాస్త్రమును "ఎండోక్రినాలజీ" (Endocrinology) అనగా నిర్వాహిక గ్రంథిశాస్త్రము అందురు. వైద్యశాస్త్రములో దీనికి ముఖ్యమైన స్థానము గలదు. జంతువుల ఉత్పత్తి, లింగభేదము ఏర్పడుటకును,