Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇండోనేషియా (చరిత్ర)

సంగ్రహ ఆంధ్ర


ప్రఖ్యాతమైనది. ఇతర ఆసియాదేశములనుండి విద్యార్థులు విద్యాభ్యాసమునకై వచ్చి ఇచట ఉండెడివారు. యవద్వీప (జావా) సంస్కృతి అధికాంశము భారతీయమైనది, జావ నుల భాష - కవి భాష - లోని శబ్దజాలము సంస్కృత మూలమైనది. జావనుకవులు రామాయణ, మహాభారతములను ఇతర పురాణ గాథలను ఇతివృత్తములుగా గ్రహించి, కావ్యములుగా వ్రాసిరి. వారు సంస్కృత సంప్రదాయములను విరివిగా పాటించిరి. జావను భాషలోనికి అనువదింపబడిన మహాభారతము ఇటీవల జరుపబడుచున్న మహాభారత విమర్శనమునకు చాలా తోడ్పడు చున్నది. ఒకవైపు హిందూ మతము, విష్ణు పూజ వ్యాప్తిలో నుండినవి. రామాయణ గాథలు నాట్య నాటకములలో ప్రదర్శింపబడినవి. మరి యొక వైపు బౌద్ధ స్తూపములు నెలసినవి. మధ్య జావాలో 'బారోబుదూరు' బౌద్ధస్తూపము చాల ప్రసిద్ధమైనది, సుందరమైనది. సుమారు 8వ శతా ప్రాంతమున ఇది నిర్మింపబడినది. నేటికిని ఇది ప్రాచీన బౌద్ధకళకు చిహ్నముగా నిలిచియున్నది. తూర్పు బోర్ని యోలో క్రీ.శ. 400 నాటి సంస్కృత శిలా శాసనములు లభించినవి.వాటిని బట్టి హిందూ సంస్కృతి అచ్చట బాగుగ వ్యాపించినదని తెలియుచున్నది.

13 వ శతాబ్దము నాటికి ఇండోనేషియా దీవులన్నియు 'మజా పాహిత్ సామ్రాజ్యము' అని ప్రసిద్ధిచెందిన హిందూ సామ్రాజ్యాధికారములోనికి వచ్చినవి. ఈ సామ్రాజ్య చక్రవర్తులలో ఒకడైన 'హాజావురుక్' పరిపాలనా కాలము ఇండోనేషియా చరిత్రలో స్వర్ణయుగముగా పరిగణింపబడుచున్నది. 15వ శతాబ్దాంతమువరకే ఈ సామ్రాజ్యము అచ్చట అధికారములో ఉండినది. నాటికి అచ్చట అనేక ప్రదేశములలో దేవాలయములు, స్తూపములే కాక, జనుల ఆచార సంప్రదాయములు, కళలు, వినోధములు, ప్రాచీన హిందూ బౌద్ధనంస్కృతుల చిహ్నములుగా నిలిచియున్నవి.

అరేబియా, పర్షియా దేశములనుండియు, పశ్చిమ భారతతీరప్రాంతమునుండియు వచ్చి న మహమ్మదీయ వర్తకులీ ద్వీపములలో ఇస్లాము మతమును ప్రవేశ పెట్టిరి. త్వరలో ఈ మతమును జనసామాన్యము స్వీకరించెను. మొదట తీరప్రదేశములందలియు, తరువాత ఇతర భాగములందలియు ప్రజలు ముసల్మానులైరి. పదునైదవ శతాబ్దము తుదివరకే మధ్యజావాలో మొదటి ముస్లిము రాజ్యము స్థాపింపబడినది. మజాపాహినరాజులు క్రమక్రమముగా బలహీను లగుచు, అంతఃకలహములకు గురియై ముస్లిముల రాజ్యవ్యాప్తిని అరికట్టలేక, దానికి లొంగిపోయిరి. మజాపాహిత రాజ్యపతనముతో ఇండొనేషియాలో హిందూ మహాయుగము అంతమైనది.

ఇస్లాము మతమును స్వీకరించుట కిష్టములేని హిందువు లందరును బలిద్వీపము వైపుకునకు పారిపోయి, అచట స్థిరపడిపోయిరి. నేటికిని ఒక్క బలిద్వీనములోనే హిందువు లధిక సంఖ్యాకులై ఉన్నారు.

1613-47 వరకు మధ్య జావాలో రాజ్యపాలన చేసిన సుల్తాను హంతొ క్రోకుసుయో అను నతడు ముస్లిం రాజులలో ప్రసిద్ధుడు.

మొట్టమొదటి డచ్చి వర్తకులు 16వ శతాబ్దాంతము నాటికి ఇండొనేషియాకు వచ్చిరి. వారు తీరప్రాంతములలో ఉండిపోయి కోటలు కట్టుకొనిరి.తమ కంటే పూర్వము వచ్చిన పోర్చుగీసువారిని, తమ తర్వాత వచ్చిన ఆంగ్లేయులను కూడ తరిమివేసి, డచ్చివారు తూర్పు ఇండియా దీవులకు ఏకైక నాయకులైరి. డచ్చి ఈస్టు ఇండియా కంపెనీ యాజమాన్యము కొంతకాలము సాగిన తరువాత 1799 సం. డిసెంబరు 31 వ తేదీ నాడు ఇండొనేషియా, నెదర్లాండ్సు ప్రభుత్వాధీనమై ఆ దేశమునకు వలసయైపోయినది. డచ్చి ప్రభుత్వము ఇండో నేషియా దీవుల సంపదలను స్వదేశ సౌభాగ్యముకొరకు వినియోగించుకొనుట తప్ప ఇచ్చటి జనుల అవసరములను ఎన్నడును గమనించలేదు. జనులు బీదలై పోయిరి. వలసతత్త్వమును నిరసించిరి. అసంతృప్తి ప్రబలినది. డచ్చి ప్రభుత్వమునకు వ్యతిరేకముగా తిరుగుబాట్లు జరగినవి. త్రునాజాజా సురపతి, ఇమాంచొంజోల్, ఉమర్ , దీపో, నెగో అను వారలు ఈ స్వాతంత్య్ర సమరమును నడపిన నాయకులలొ ప్రసిద్దులు. కాని భేదోపాయముచేత డచ్చివారు నిర్దాక్షిణ్యముగా - ఈ తిరుగుబాట్లను అణచివేసిరి. 20వ శతాబ్దారంభముతొ స్వాతంత్య్ర ఉద్యమము క్రొత్తమార్గము పట్టినది. సక్రమమైన ఆందోళనము, ప్రతిఘటనము ప్రారంభమైనవి. ప్రజా నాయకులు ఇండో నేషియాలో