Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజానకోశము - ౨

ఇండోనేషియా (చరిత్ర)

అనేక జాతులవారు వలసవచ్చి ఇండోనేషియాలో స్థిరనివాసము ఏర్పరచుకొనిరి. నేటికి రెండువేల ఏండ్లకు పూర్వమే భారతీయు లీద్వీపములలో ప్రవేశించిరి. భారతీయుల రాక ఇండోనేషియా చరిత్రలో గొప్ప ఘట్టము. వారిచటి జనుల జీవితమును చాల ప్రభావితము చేసిరి. తండోపతండములుగా వలసపోయిన భారతీయవర్తకులు తమతోపాటు తమ ఉన్నతమైన నాగరికతను ఈ ద్వీపములకు తీసికొనివచ్చిరి. హిందూమతము, సంస్కృతి ఇచ్చట విస్తరింపచేసిరి. అక్కడి జనులలో చాలమంది హిందూమతమును స్వీకరించిరి. క్రీ.శ. మొదటి శతాబ్దములో భరతఖండ దక్షిణాపథమున శాతవాహనాంధ్ర సామ్రాజ్యము వెలసియుండెను. శాతవాహనుల కాలములో ఈ దీవులతో సముద్ర వర్తకము చాలా విరివిగా సాగుచుండెడిది. రెండవ శతాబ్దము నాటికే ఇండో నేషియాలో హిందూ సామ్రాజ్యము నెలకొనియుండినది. కాని దానికి భారతదేశముతో ఎట్టి సంబంధమును లేదు. ఐదవ శతాబ్దము నాటికి జావా, సుమిత్రా దీవులలో హిందూ సామ్రాజ్యము లుండెను. ఇవి భారతదేశపు వలసలు కావు. స్వతంత్రరాజ్యములు. భారతీయుల వలస యొక్క విశిష్టత ఇందు చూడనగును.

భారతీయ నాగరికతా విస్తరణముతో పాటు బౌద్ధమతము కూడ ఇండో నేషియా దీవులలో బాగుగ వ్యాపించినది. అంతే కాక, బౌద్ధమత సంస్కృతులముద్ర అచట శాశ్వతముగా నిలిచిపోయినది. భారతీయు లీదీవులను ‘సువర్ణ భూమి' యనియు 'సువర్ణ ద్వీప'మనియు వర్ణించు చుండెడివారు. ఆ పేరును బట్టి వారచటి ధనధాన్య సంపదలచే ఆకర్షింపబడిరనుట స్పష్టము. సుమత్రాద్వీపము భారతీయవిద్యాపీఠముగా ఉండెడిది. భారతదేశమునకు పోవుచు చీనా యాత్రికులు అరుమాసముల కాలము ఇచ్చట ఆగి సంస్కృతము నేర్చుకొనెడివారట. ఈ ద్వీపములలొ అనేక శాసనములు సంస్కృత భాషలో, సంస్కృతమునకు సంబంధించిన మరొక భాషలో, బ్రాహ్మీ లిపిలో వ్రాయబడి ఉన్నవి. తక్కోలము, కర్పూరద్వీపము, సువర్ణ ద్వీపము, నారికేళ ద్వీపము, యవద్వీపము మున్నగు పేర్లను బట్టి అవి భారతీయుల వలసలని తెలియవచ్చు చున్నది.

సుమత్రాలో క్రీ. శ. 4 వ శతాబ్దములో శ్రీ విజయ రాజ్యము అను స్వతంత్ర హిందూరాజ్యము స్థాపింపబడెను. 7వ శతాబ్దాంతము నాటికి ఆ రాజ్యము చాల పేరు ప్రతిష్ఠలు పొందినది. శ్రీ విజయ విశ్వవిద్యాలయము