విజ్ఞానకోశము - 3
కొండపల్లి
ప్రతి ప్రాకారమునకును బురుజులు నిర్మింపబడినవి. ఈ బురుజులకడ సేనాధిపతులు కావలి కాయుచుండెడివారు. ఈ ప్రాకారములు దుర్గము చుట్టును మహోన్నతమగు పర్వతముల నొరసికొని యున్నవి. నడుమ నడుమ కొండవరుసలే పెట్టని ప్రాకారములై దుర్గమునకు శ్రీరామరక్షలైనవి, ఈ సహజ ప్రాకారములు విచిత్ర శోభావహములు.
ప్రాకార పరివేష్టితమైన యేడు బురుజులను దాటి పైకి పోయినచో నొక సింహద్వారము గానుపించును. ఆ ద్వారమును దాటి లోనికి పోయినచో మహోన్నత మైన యింకొక ప్రాకారము తగులును. ఈ ప్రాకారము దుర్గప్రదేశమును ఆవరించియుండును. ఇది వల్గదరివర్గ హయఖుర ఘట్టనలభేద్యము; శాత్రవ భయంకరము; సుహృద్దర్శనీయము.
ఈ ప్రాకార పంక్తుల మధ్యనున్న నిర్మాణములును, సౌధములును ప్రాచీన సభ్యతా శిల్ప సౌందర్యమునకు పరమావధులు. ఈ కట్టడములలో ధనాగారము లన్నియు నొకచోట నున్నవి. వాని కావల సేనాధిపతుల సౌధములు కలవు. వీనిసమీపముననే రాజమహలులు, రాజాంగనాంతఃపురములును, ఉద్యానవనములును ఉన్నవి.
రాజవీథుల సామీప్యమున అరువది ధనుస్సుల దూరములో దర్బారు భవన మొకటి కలదు. తద్భవనోపరి నిర్మిత శిలా విగ్రహములును, శిలాలతలును ప్రాచీన శిల్ప ప్రావీణ్యమున కతిభూములు. ఈ భవనమునకు అధో భాగమునగల గజాశ్వశాలలు అతి భయంకరములై కన్పడును. దుర్గ సంరక్షణార్థము చుట్టును పర్వత శ్రేణులపై నాలుగు రక్షణస్థలు లేర్పరుప బడినవి.
కొండపల్లి దుర్గమునకు తూర్పు భాగమున హనుమంతు కొండ గలదు. రాజ భవనమునకును దీనికిని రమారమి వేయి ధనుస్సుల దూరము. హనుమంతు కొండ బురుజుపై నొక చిన్న ద్వారమున్నది. అందు సైన్యాధ్యక్షుడు నివసించుటకు సౌకర్యము లమర్పబడినవి. ఈ బురుజు నందే యైదువందల మంది సైనికులు ఖడ్గ కవచధారులై కాపుండెడివారు. ఈ కొండపై నుండి చూచినచో హైదరాబాదు పోవు దండుబాటయు, కృష్ణా నదియు నగపడగలవు.
కొండపల్లి దుర్గమునకు దక్షిణ పార్శ్వమున ఎఱ్ఱ బురుజు గలదు. ప్రధాన దుర్గమునకును దీనికిని రమారమి రెండుమైళ్ళు దూరముండును. తూరుపు కనుమల వరుస నంటి సుమా రేబదిమైళ్ళు దూరములో గల ప్రదేశములను గూడ చూచుటకు అనువుగా నీ యెఱ్ఱ బురుజు మిక్కిలి యెత్తైన స్థలమునందు కట్టబడినది. దీని నుండి అమరావతీ ప్రభృతి పుణ్యక్షేత్రములను సందర్శింప వచ్చును. ఈ బురుజుపై వేయి సంఖ్య గల సైనికపటాల ముండెడిది.
కొండపల్లి దుర్గమునకు పడమటిభాగమున ఎడ్లకొండ బురుజు గలదు. ఇదియు పైన ఉదాహృతములైన రెండు బురుజుల కంటె నున్నతమై యున్నది. అనల్ప శిల్ప విన్యాసము గల కోట ప్రాకారములచే నిది పరీవృతము. సైన్యములను బురికొల్పుటకై నగారా మ్రోయించు సైనికుల కిది విడిదిపట్టుగా కట్టబడెను. ఇందు వేయి పటాలము లుండుచుండెను. దీని నుండి చూచినచో నందిగామ సీమ యంతయు గనబడగలదు.
కొండపల్లి కోట నిర్మాణ రహస్యమంతయు ఒంటి మన్యము బురుజు కట్టడమునందే గుప్తమైయున్నది. ఈ బురుజు నేలమట్టమునుండి యేడువందలగజముల యెత్తున నుండును దీని శిఖరాగ్రము నుండి పరీక్షించినచో కృష్ణా మండలమునకు ముఖ్యపట్టణమైన బందరు సముద్ర తీర దృశ్యము దృగ్గోచరమగును. ఈ బురుజు నుండియే రెడ్డి రాజులు కొండవీటి దుర్గమును వీక్షించెడివారు. పైని బేర్కొన్న మూడు రక్షణ కేంద్రముల కంటె నిది కీలక స్థలము. ఇది యవలీలగ వేలకొలది శత్రువులను సంహరించుటకువీలగునట్లు కట్టబడినది. దీనిని చేరుకొనుత్రోవలో మహా వృక్షములును, గండశిలలును, అల్లిబిల్లిగ నల్లుకొనిన తీవె జొంపములును అసంఖ్యాకములుగ నున్నవి. అటు పోవునపుడు కుంజపుంజము లెంత యానంద సంధాయకములో పర్వతగుహల నుండి వెలువడు క్రూరమృగముల ధ్వనులును, ప్రతిధ్వనులును కీచురాలగానము అంత భీతావహములు. ఒంటి మన్యముపై నొక ద్వారమున్నది. ఆ ద్వారము నొద్ద నొక సైనికుడు కావలి కాయుచుండెడి వాడు. శత్రు సైన్యములు పండ్రెం డామడల దూరమున నున్నపుడేకనిపెట్టి రణభేరిమ్రోయించుట తద్వార నివేశిత
47