Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కేరళదేశము (భూగోళము)

సంగ్రహ ఆంధ్ర


అడవులు : కేరళ రాష్ట్రములో అటవీసంపద ప్రధానమైనది. మొత్తము భూభాగములో 25.8 ప్రతిశతి ప్రాంతము అడవులచే ఆక్రమింపబడి యున్నది. ఈ విషయములో అస్సాము తరువాత కేరళము రెండవదిగా పరిగణింపబడు చున్నది. ఈ వనసంపత్తివలన రాష్ట్రమునకు ప్రతి యెకరమునకు పదునొకండు రూపాయల ఆదాయము లభించును. అఖిలభారతమునందు సగటున ప్రతి యెకరమునకు నాలుగు రూపాయలు మాత్రమే అడవుల నుండి ఆదాయము లభ్యమగుచున్నది.

కేరళీయ వనములు వివిధములయిన మృగజాతులకు ఆలవాలములై యున్నవి. 'పెరియారు' తటాక సమీపమున గల రిజర్వు వనములు (Reserve forests) వన్యమృగముల కాశ్రయ మొసగుచున్నవి. ఏనుగులు, ఆబోతులు, చిరుతపులులు, సాంబర్లు, అడవి పందులు మున్నగు అనేక జాతుల మృగములు స్వేచ్ఛగా ఆ వనములందు సంచరించు చుండును. దాదాపు 600 కంటె ఎక్కువ వృక్ష జాతులు ఈ వనములందు గలవు. టేకు, నల్ల మద్ది, సీసము మున్నగు కొన్ని తరగతులకు ఈ వనములు కేంద్రములు. కలప వ్యాపారమునకు కేరళము సుప్రసిద్ధము. కల్లాయి (Kallai) యందుగల కలప అడితి (Depot) ప్రపంచములో కెల్ల రెండవదని ప్రశస్తి గాంచినది. మరి చలతా పరివేష్టితములైన అత్యున్నత వృక్షరాజములు మనోహర దృశ్యములను చేకూర్చుచున్నవి. ఏనుగు దంతములును కేరళ వన్యసంపత్తులో చేరినవే.

ఖనిజములు : ఖనిజ సంపత్తులో కేరళరాష్ట్రము ఏ ఇతర రాష్ట్రమునకును వెనుదీయదు. అణుయుగారంభము పిదప కేరళీయ ఖనిజములు అత్యంత ప్రాముఖ్యము వహించినవి. అణుశక్తికై ఉపయోగింపబడు 'థోరియమ్' (Thorium) అను పదార్థముగల 'మోనోజైట్' (Monozite) ఈ రాష్ట్రములో విరివిగా లభించును. కొల్లము (క్విలన్) జిల్లా సముద్రతీరము మోనోజైట్ (Monozite) ఎల్ మెనైట్ (Elmenite), రూటైల్ (Rutile), జిర్ కోసీ (Zircosi), సిలమెనైట్ (Silamenite) అను ఘన ఖనిజపదార్థములకు పుట్టినిల్లు. పోర్సిలెయిన్ తయారు చేయుటకు అవసరమయిన చీనా మన్ను ఈ రాష్ట్రమందు పెక్కుస్థలములలో లభించును. ఇటుకలు చేయుటకు ఉపకరించు రెండవరకము మన్ను అచట విరివిగా కలదు. షార్క్ లివర్ ఆయిల్, టర్టైల్ ఆయిల్ మున్నగు నూనెలును, నిమ్మగడ్డి (Lemon grass) మున్నగు తృణపదార్థములును, ఓషధులకును, సుగంధ ద్రవ్యములకును ఉపకరించు ముడిపదార్థములును కేరళములో లభించును.

సిమెంటు తయారు చేయుటకు అవసరమగు ముడిద్రవ్యములుగూడ ఇందు లభ్యమగును. కేరళములో తెల్ల సిమెంటు ఫ్యాక్టరీ యొకటి కలదు. 360 మైళ్ళ పొడవు గల సముద్రతీరము కలిగి, సమీపమందలి భూమిని ఆక్రమించుకొను సాగరజల తటాకములును, మంచినీటి చెరువులును విరివిగానున్న కేరళ రాష్ట్రములో జల సంబంధమగు సంపత్తుకు కొదువలేదు.

జనసంఖ్య :

1. కేరళ రాష్ట్రపు మొత్తము జనసంఖ్య (1951) 1,35,51,529
పురుషుల సంఖ్య 66,82,861
స్త్రీల సంఖ్య 68,68,668
2. గ్రామీణులు 1,17,66,592
నాగరులు. 17,84,937
3. అక్షరాస్యులు 54,73,765
నిరక్షరాస్యులు 80,77,764
1951 లెక్కలనుబట్టి జనసాంద్రత చ. మై. 1కి 904 మంది
1957 లెక్కలనుబట్టి జనసాంద్రత చ. మై. 1కి 1000 మంది

విభాగములు : కేరళ రాష్ట్రమునకు రాజధానీ నగరము తిరువనంతపురము. ఇందు 9 జిల్లాలును, 55 తాలూకాలును, 4615 గ్రామములును, 88 నగరములును, 22 మునిసిపాలిటీలును, 897 పంచాయితీలును కలవు.

జిల్లాలు విస్తీర్ణము జనసంఖ్య
1. తిరువనంతపురము 846.3 చ. మై. 13,27,812
2. క్విలన్ 1981.9 చ. మై. 14,84,783
3. అల్లెప్పీ 705.3 చ. మై. 15,14,105
4. కొట్టాయం 1998.6 చ. మై. 13,26,489
5. ఎర్నాకులం 1558.5 చ. మై. 15,30,143
6. త్రిచూరు 1147.8 చ. మై. 13,62,772
7. పాల్ఘాటు 1971.7 చ. మై. 15,65,167
8. కోఝికోడ్ 25,55.0 చ. మై. 20,65,177

38